ఇది జంగిల్ రాజ్.. ప్రజలు మిమ్మల్ని ఫుట్‌బాల్‌లా తంతారు: వైఎస్ జగన్
x

ఇది జంగిల్ రాజ్.. ప్రజలు మిమ్మల్ని ఫుట్‌బాల్‌లా తంతారు: వైఎస్ జగన్

త్వరలోనే 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపడతానని, ప్రజలు ఈసారి కూటమి ప్రభుత్వాన్ని ఫుట్‌బాల్‌లా తన్నడం ఖాయమని జగన్ అన్నారు.


రాష్ట్రంలో కూటమి పాలన అరాచకానికి పరాకాష్టగా మారిందని.. ఇది కేవలం జంగిల్ రాజ్ మాత్రమేనని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం భీమవరం నియోజకవర్గ పార్టీ శ్రేణులతో జరిగిన ఆత్మీయ భేటీలో ఆయన చంద్రబాబు సర్కార్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. రెండేళ్లు తిరక్కముందే రూ. 3 లక్షల కోట్ల అప్పులు చేశారు. మరి ఆ సొమ్ము ఎవరి జేబుల్లోకి పోయింది? అని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల హామీల పేరిట సామాన్యులను మోసం చేస్తూ.. మద్యం, ఇసుక దోపిడీతో రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారని మండిపడ్డారు. ఈ దుర్మార్గపు పాలనను ఎండగట్టేందుకు తాను త్వరలోనే 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపడతానని, ప్రజలు ఈసారి కూటమి ప్రభుత్వాన్ని ఫుట్‌బాల్‌లా తన్నడం ఖాయమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

రెండేళ్లలో ఒక్క మంచైనా జరిగిందా?

చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఈ బడ్జెట్‌తో కలిపి మూడు బడ్జెట్లు పెట్టినట్టవుతుంది. కానీ, ఈ రెండేళ్లలో ఏ ఒక్క వర్గానికైనా ఒక్క మంచైనా జరిగిందా? అని జగన్ సూటిగా ప్రశ్నించారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి, కోవిడ్ వంటి కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలను ఆపకుండా అమలు చేసిన తమ ప్రభుత్వానికి, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు.

సూపర్ సిక్స్ కాదు.. సూపర్ మోసం

చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలన్నీ నీటి మూటలుగా మిగిలిపోయాయని జగన్ విమర్శించారు. గ్యాస్ సిలిండర్ల నుంచి ఇసుక వరకు ప్రతిచోటా మోసమే కనిపిస్తోందని మండిపడ్డారు. మా హయాంలో ఐదేళ్లలోరూ. 3.32 లక్షల కోట్లు అప్పు చేస్తే, అందులో రూ. 2.73 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో వేశాం. కానీ బాబు గారు రెండేళ్లలోనే రూ. 3 లక్షల కోట్లు అప్పు చేశారు.. మరి ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి పోయింది? అని నిలదీశారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం, ఖనిజ సంపదను కొల్లగొడుతూ పాలకులు దోచుకో-పంచుకో-తిను పద్ధతిలో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో జంగిల్ రాజ్.. అరాచకానికి పరాకాష్ట

రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? లేక అడవి చట్టం నడుస్తోందా? అని జగన్ మోహన్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. సంక్రాంతి ముసుగులో కోడిపందాలకు అధికారికంగా వేలం పాటలు నిర్వహించడం, అశ్లీల రికార్డింగ్ డ్యాన్సులతో సంస్కృతిని భ్రష్టు పట్టించడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే ఊపేయ్..కుదిపేయ్ అంటూ బరితెగించి మాట్లాడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ధ్వజమెత్తారు. కూటమి ఎమ్మెల్యేల వేధింపులు భరించలేక మహిళా ఉద్యోగులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారని, వ్యవస్థలన్నీ కుప్పకూలి రాష్ట్రం ఒక జంగిల్ రాజ్ లా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ 2.0: కార్యకర్తలే సైన్యం.. పాదయాత్రే మార్గం

రాబోయే రోజుల్లో కూటమి అరాచకాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు జగన్ 2.0 వెర్షన్‌ను ఆయన ప్రకటించారు. గతంలో పాలనపై ఉన్న శ్రద్ధ కార్యకర్తలపై పెట్టలేకపోయానని భావోద్వేగంగా అంగీకరిస్తూ.. ఇకపై తన సైన్యానికి (కార్యకర్తలకు) అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే ఒక సంచలన ప్రకటన చేస్తూ.. రాబోయే ఒకటిన్నర ఏళ్ల పాటు తాను ప్రజల మధ్యే ఉంటానని, రాష్ట్రవ్యాప్తంగా 150 నియోజకవర్గాల్లో భారీ పాదయాత్ర చేపడతానని స్పష్టం చేశారు. గ్రామ స్థాయి కమిటీలను పటిష్టం చేసి, ప్రజల పక్షాన పోరాడుతామని, వచ్చే ఎన్నికల్లో జనం ఈ అబద్ధాల ప్రభుత్వాన్ని ఫుట్‌బాల్‌లా తన్నడం ఖాయమని జగన్ ధీమా వ్యక్తం చేశారు.

Read More
Next Story