పోలవరం ప్రాజెక్టు కోసం భూమిని, ఇళ్లను త్యాగం చేసిన నిర్వాసితుల్ని గుండెల్లో పెట్టుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వారి త్యాగ ఫలితంగానే ప్రాజెక్టు సాకారం అవుతోందని ఆయన అన్నారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో సమావేశమయ్యారు. భూసేకరణ పునరావాస, పరిహార ప్యాకేజీ కింద మూడో విడతలో రూ.226.61 కోట్ల చెక్కును నిర్వాసితులకు అందజేశారు. ఉగాది పండుగను పురస్కరించుకుని మూడో విడతగా నిర్వాసితుల ఖాతాలకు ఈ మొత్తాన్ని జమ చేస్తున్నట్టు సీఎం వివరించారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని అది పూర్తి కావటంతో పాటు నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు.
గత పాలకుల నిర్లక్ష్యంగా వల్ల డయాఫ్రాం వాల్ దెబ్బతిందని... నిపుణులతో అధ్యయనం చేయించి ఇప్పుడు మళ్లీ రూ. వెయ్యి కోట్లతో కొత్త డయాఫ్రాం వాల్ నిర్మాణం చేపడుతున్నామని స్పష్టం చేశారు. వారం రోజుల్లో డయాఫ్రాం వాల్ నిర్మాణం పూర్తి అవుతుందని, ప్రాజెక్టులో ముమ్మరంగా పనులు జరుగుతున్నాయన్నారు. 21 నెలల్లో ప్రాజెక్టు పనులు ముమ్మరం చేశామన్నారు. వచ్చే ఏడాది ఉగాది తర్వాత రెండు నెలల్లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని... రాష్ట్ర ప్రజలందరి కల సాకారం అవుతుందని సీఎం అన్నారు. గత పాలకులు నిర్వాసితులను పట్టించుకోలేదని... వరద నీటిలో ప్రజలు మునిగిపోతున్నా నిర్లక్ష్యంగా వదిలేశారని సీఎం నాటి సంగతులను గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును, నిర్వాసితుల్ని దృష్టిలో ఉంచుకునే రంపచోడవరం నియోజకవర్గాన్ని పోలవరం జిల్లాగా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నిబద్ధతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తోందని అన్నారు.
21 నెలల్లో రూ.1943 కోట్ల పరిహారం చెల్లింపు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రాజెక్టు నిర్వాసితులకు వేగంగా చెల్లింపులు చేశామని సీఎం అన్నారు. 2025 జనవరిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మొదటి విడతగా నిర్వాసితులకు రూ.800 కోట్లు ఇచ్చామన్నారు. గత ఏడాది దీపావళికి రెండో విడతగా రూ. 916 కోట్లను నిర్వాసితుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇప్పుడు మూడో విడతగా ఉగాదిని పురస్కరించుకుని నిర్వాసితులకు రూ.226.6 కోట్లను చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి వివరిచారు. మొత్తంగా 21 నెలల్లో 26,149 మంది నిర్వాసితులకు రూ.1943 కోట్లను చెల్లించామని తెలిపారు. రెండు దశల్లో జరిగే ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తొలిదశలో 38,068 మంది నిర్వాసితులను తరలించేందుకు చర్యలు చేపట్టామన్నారు. 75 నిర్వాసిత కాలనీల్లో ఇప్పటికే 26 పూర్తి అయ్యాయని... ఇంకా 49 కాలనీలు నిర్మాణంలో ఉన్నాయన్నారు.
2022లో గుర్తించిన 17,114 మంది నిర్వాసితులకు కాలనీలను నిర్మించి తరలించేలా చర్యలు చేపడుతున్నామని... 2027 ఏప్రిల్ కల్లా కాలనీలు పూర్తి చేసి పునరావాసం కల్పించేలా సంకల్పించామని వివరించారు. ఇంకా రూ.3,500 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉందన్నారు. ప్రతీ నిర్వాసితుడికి రూ.3.5 లక్షల మేర ఇంటి నిర్మాణం కోసం ఇస్తున్నామని... ఇంటి జాగా కోసం ఇచ్చే మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచామని తెలిపారు. గత పాలనలో జరిగిన తప్పుల్ని సరిదిద్ది నిర్వాసితులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. పునరావాస, పరిహారాన్ని పారదర్శకంగా నిర్వాసితులకు చెల్లిస్తున్నామని చెప్పారు. మూడో మారు గోదావరి పుష్కరాలు నిర్వహించే గౌరవం తనకు దక్కిందని... పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామన్నారు.
గత పాలకుల నిర్వాకంతోనే ప్రాజెక్టు 6-7 ఏళ్లు ఆలస్యం
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టు 6-7 ఏళ్ల పాటు ఆలస్యం అయ్యిందని ముఖ్యమంత్రి నిర్వాసితులకు వివరించారు. కాంట్రాక్టర్లను, ఇంజనీర్లను మార్చకుండా ఉంటే ప్రాజెక్టు పూర్తి అయిపోయేదని... నిర్వాసితులకు కూడా పూర్తి న్యాయం జరిగి ఉండేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే కంటే ముందే నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పూర్తికి మరో రూ.5 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన నిర్వాసితులంతా ప్రజల హృదయాల్లో నిలిచి పోతారని సీఎం వ్యాఖ్యానించారు. నిర్వాసితులు అంతా సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతోనే తాము పనిచేస్తున్నామని అన్నారు. ప్రాజెక్టు ఏమైనా పర్వాలేదనే అహంకార ధోరణితో గత పాలకులు వ్యవహరించారని సీఎం ఆక్షేపించారు. పోలవరం నిర్వాసితుల పట్ల తమ ప్రభుత్వానికి కమిట్‌మెంట్ ఉందన్నారు. నిర్వాసిత యువతకు స్కిల్ డెవలప్మెంట్లోనూ శిక్షణ ఇస్తామని సీఎం వివరించారు. నిర్వాసితుల నుంచి వచ్చే అభినందనల్ని ప్రజాప్రతినిధులుగా తమకు, అధికారులకు గౌరవంగా భావిస్తామని ముఖ్యమంత్రి అన్నారు.
పరిహారం చెల్లింపులతో నిర్వాసితుల్లో వెల్లువెత్తిన భావోద్వేగం
గడచిన 21 నెలలుగా కూటమి ప్రభుత్వం తమ ఆవేదనను గుర్తించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద డబ్బులు జమ చేస్తోందని నిర్వాసితులు ముఖ్యమంత్రికి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల నుంచి వచ్చిన నిర్వాసితులు హర్షాతిరేకాల మధ్య తమ అభిప్రాయాలను సీఎం ముందు వెలిబుచ్చారు. గత పాలనలో తమకు న్యాయం జరగలేదని... కూటమి అధికారంలోకి వచ్చాకే పునరావాస, పరిహార ప్యాకేజీ నిధులు తమ ఖాతాల్లోకి వచ్చాయని.. వీటితో తమ కుటుంబ ఆర్ధిక పరిస్థితులను మెరుగు పరుచుకుంటున్నామని వివరించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు కలకాలం పాలన సాగించాలని నిర్వాసిత మహిళలు భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సీఎస్ జి. సాయి ప్రసాద్, ఆర్ అండ్ ఆర్ అధికారులు హాజరయ్యారు.