దుర్గమ్మ దర్శనం కోసం వచ్చి..నిలువు దోపిడీకి గురై
x

దుర్గమ్మ దర్శనం కోసం వచ్చి..నిలువు దోపిడీకి గురై

దొంగలకు కలిసొచ్చిన టెంట్లు.


విజయవాడలో కనకదుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని దొంగలు భారీ స్కెచ్ వేశారు. అమ్మవారిని దర్శించుకుని పునీతులు కావాలని వచ్చిన ఒక మహిళా భక్తురాలికి తీరని శోకాన్ని మిగిల్చారు. సుమారు 50 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను దుండగులు అత్యంత చాకచక్యంగా అపహరించడం విజయవాడలో పెను సంచలనం సృష్టించింది.

రావిచెట్టు వద్ద దోపిడీ

హైదరాబాద్‌కు చెందిన సదరు మహిళా భక్తురాలు తన బంధువుల ఇంట్లో జరిగే వివాహ వేడుక కోసం విజయవాడకు వచ్చారు. పెళ్లి కోసం తన వెంట తెచ్చుకున్న బంగారు నగలను ఒక బ్యాగులో భద్రపరుచుకుని, ముందస్తుగా అమ్మవారిని దర్శించుకోవాలని కొండపైకి వెళ్లారు. దర్శనం ముగించుకుని ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు వద్దకు చేరుకున్న సమయంలో, అక్కడ ఉన్న విపరీతమైన భక్తుల రద్దీని దొంగలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఆమె ఏమరపాటుగా ఉన్న తరుణంలో బ్యాగులోని నగలను దోచుకుని మాయమయ్యారు.

పోలీసులకు టెంట్లు తెచ్చిన తలనొప్పి
మహా కుంభాభిషేక మహోత్సవాల నేపథ్యంలో ఆలయంలో భక్తుల కోసం ఎక్కడికక్కడ భారీ టెంట్లను ఏర్పాటు చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేయగానే రంగంలోకి దిగిన వన్ టౌన్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే, నిందితులను గుర్తించడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన టెంట్లు సీసీ కెమెరాలకు అడ్డుగా ఉండటంతో, ఆ నీడలో దొంగలు తమ పని కానిచ్చేశారు. కెమెరాల కళ్లు కప్పేలా ఈ టెంట్లు ఉండటం దొంగలకు వరంగా మారింది.
భద్రతా లోపాలపై భక్తుల ఆందోళన
ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో, అది కూడా అత్యంత కీలకమైన ఉత్సవాల సమయంలో ఇంత పెద్ద మొత్తంలో చోరీ జరగడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. పాత నేరస్థుల ముఠానే ఈ పని చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఏళ్ల తరబడి కూడబెట్టుకున్న భారీ సొత్తు అమ్మవారి సన్నిధిలోనే మాయమవ్వడంతో బాధితురాలు కన్నీరుమున్నీరవుతోంది. పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులు తమ విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా భక్తులను పోలీసులు మరోసారి హెచ్చరిస్తున్నారు.
Read More
Next Story