కాటేసింది కాలనాగు కాదు ఎలుక అనుకున్నారు
x

కాటేసింది కాలనాగు కాదు ఎలుక అనుకున్నారు

అంబులెన్స్ వచ్చేలోపే విషం శరీమంతా పాకడంతో 13 ఏళ్ల దీపిక పరిస్థితి విషమించింది.


కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేట గ్రామంలో విషాదం నెలకొంది. తెల్లవారుజామున నిద్రిస్తున్న సమయంలో పాము కాటు వేయడంతో 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. కాటేసింది కాల నాగు అని, బాలిక ప్రాణాపాయం స్థితిలో ఉందని తెలియక సకాలంలో స్పందించకపోవడంతో ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది.

ఎలుక అనుకుని ..
గ్రామానికి చెందిన చప్పా దీపిక (13) గురువారం రాత్రి తన ఇంట్లో మంచం మీద నిద్రిస్తోంది. తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో ఏదో కరిచినట్లు అనిపించి నిద్రలేచిన దీపిక, తన తల్లి మల్లీశ్వరికి విషయం చెప్పింది. అయితే, చీకట్లో అది ఎలుక కరిచి ఉంటుందని భావించిన తల్లి, తెల్లవారాక ఆస్పత్రికి వెళ్లి ఇంజక్షన్ చేయిద్దామని చెప్పడంతో బాలిక మళ్లీ నిద్రపోయింది.
ఆధార్ కోసం వెతుకుతుండగా కనిపించిన త్రాచు
సుమారు 4 గంటల సమయంలో దీపిక తనకు ఇబ్బందిగా ఉందని చెప్పడంతో తల్లి ఆందోళన చెంది బంధువులను పిలిచింది. అప్పటికే బాలిక నోటి వెంట నురగలు వస్తుండటంతో వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఆసుపత్రికి వెళ్లేందుకు అవసరమైన (ఆధార్ కార్డు) కోసం మంచం పరిసరాల్లో వెతుకుతుండగా, మంచం పక్కనే భయంకరమైన త్రాచుపాము కనిపించడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. అది ఎలుక కాదు.. విషసర్పమని అప్పటికి గానీ వారికి అర్థం కాలేదు.
అంబులెన్స్ వచ్చేలోపే అనంతలోకాలకు..
పాము కాటు వేసిందని నిర్ధారించుకున్న బంధువులు బాలికను హుటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అంబులెన్స్ వచ్చేలోపే విషం శరీమంతా పాకడంతో దీపిక పరిస్థితి విషమించింది. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేసరికి బాలిక అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ముగిసిన చిరుప్రాయం..
దీపిక ఇటీవలే కోనపాపపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి పరీక్షలు పూర్తి చేసి, 9వ తరగతిలోకి ప్రవేశించింది. ఉన్నత చదువులు చదివి ప్రయోజకురాలు అవుతుందనుకున్న బిడ్డ, ఇలా విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read More
Next Story