
లడ్డూ రాజకీయంపై సుప్రీం సంధించిన ’పంచ ప్రశ్నలు‘ ఇవే
కనీసం దేవుడినైనా మీ రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటూ నాడు సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోట్లాది మంది ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం చుట్టూ అల్లుకున్న వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అగ్గిమీద గుగ్గిలమైంది. రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల అచంచల విశ్వాసాన్ని వాడుకోవడంపై న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లు చెదిరేలా ఐదు సూటి ప్రశ్నలను సంధించింది. న్యాయస్థానాలను రాజకీయ రణరంగంగా మార్చవద్దు.. కనీసం దేవుడినైనా మీ రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటూ అత్యున్నత న్యాయస్థానం వేసిన చురకలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దర్యాప్తు పూర్తి కాకముందే కోట్లాది మంది భక్తుల మనోభావాలను ఆందోళనకు గురిచేసేలా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు చేసిన ప్రకటనలపై కోర్టు సంధించిన ఆ ’పంచ ప్రశ్నలు‘ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఆరోపణల హోరు.. కోర్టు జోక్యం
2024 సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా దీనిపైన కల్తీని నిర్థారించినట్టు ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో దీనిపై నిగ్గుతేల్చాలని అటు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి, ఇటు మాజీ టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి వంటి వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 30న జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై తొలిసారి విచారణ చేపట్టినప్పుడు ప్రభుత్వ తీరుపై ఐదు కీలక ప్రశ్నలను సంధించింది.
ప్రభుత్వం ఒకవైపు ఈ వ్యవహారంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసి, అది ఇంకా ప్రాథమిక దశలోనే ఉండగా.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బహిరంగంగా కల్తీ జరిగింది అని ప్రకటించడం ఎంతవరకు సమంజసమని కోర్టు నిలదీసింది. విచారణ ఫలితం రాకముందే నిందితులను ఖరారు చేయడం దర్యాప్తును ప్రభావితం చేయదా? అని ప్రశ్నించింది.
2. ఆ నెయ్యిని లడ్డూలకు వాడారని గ్యారెంటీ ఏంటి?
కల్తీ ఉందని తేలిన నెయ్యి ట్యాంకర్లను టీటీడీ అధికారులు తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయని కోర్టు గుర్తు చేసింది. అసలు ప్రసాదం తయారీలో వాడనే లేని నెయ్యి గురించి, అంత పెద్ద ఎత్తున ప్రకటనలు చేసి భక్తులను ఆందోళనకు గురిచేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ధర్మాసనం సూటిగా అడిగింది.
3. దేవుడిని రాజకీయంలోకి ఎందుకు లాగుతున్నారు?
కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటూ కోర్టు రాజకీయ నేతలకు చురకలు అంటించింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సరైన పద్ధతి కాదని, న్యాయస్థానాలను రాజకీయ రణరంగంగా మార్చవద్దని స్పష్టం చేసింది.
4. రెండో అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు?
సాధారణంగా ఏదైనా ఒక పరీక్షలో వివాదాస్పద ఫలితం వచ్చినప్పుడు, నిశ్చయించుకోవడానికి మరో ల్యాబ్‌లో రెండోసారి పరీక్ష చేయించడం (Second opinion) సహజం. మరి ఈ విషయంలో కేవలం ఒకే ఒక్క ల్యాబ్ రిపోర్టు ఆధారంగా ఇంత పెద్ద నిర్ణయానికి ఎలా వచ్చారని, తదుపరి పరీక్షల కోసం ఎందుకు ప్రయత్నించలేదని కోర్టు నిలదీసింది.
5. భక్తుల నమ్మకాన్ని దెబ్బతీయడం కాదా?
కచ్చితమైన సాక్ష్యాలు లేకుండా, విచారణ జరుగుతున్న సమయంలోనే మీడియా ముందుకు వెళ్లి ప్రసాదం అపవిత్రం అయింది అని చెప్పడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల విశ్వాసం దెబ్బతింటుందని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భక్తుల మనోభావాలతో ఆడుకోవడమేనని అభిప్రాయపడింది.
స్వతంత్ర విచారణే మేలు
ఈ ఐదు ప్రశ్నల నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని దర్యాప్తుపై భక్తులకు పూర్తి నమ్మకం కలగకపోవచ్చని సుప్రీంకోర్టు భావించింది. అందుకే, రాజకీయ రంగు లేకుండా నిజం బయటకు రావాలన్న ఉద్దేశంతో, రాష్ట్ర పోలీసులతో సంబంధం లేకుండా సీబీఐ పర్యవేక్షణలో పనిచేసే స్వతంత్ర సిట్ (SIT) కు విచారణను అప్పగిస్తూ అక్టోబర్ 4న తుది ఉత్తర్వులు జారీ చేసింది.

