
మన పండుగలు, ఆచారాల్లో సైన్సు ఉంది: సీఎం చంద్రబాబు
విదేశాల్లో ఉన్న తెలుగువారు మన సంస్కృతికి అంబాసిడర్లుగా మారడం గర్వకారణమన్నారు.
తెలుగు నూతన సంవత్సరాది ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం ప్రభుత్వం నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. భారతీయ పండుగలు, ఆచార వ్యవహారాల వెనుక గొప్ప శాస్త్రీయత దాగి ఉందని ఆయన కొనియాడారు. వాస్తు శాస్త్రం, సూర్య నమస్కారాలు వంటివి కేవలం ఆచారాలు మాత్రమే కావని, అవి మానవ జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విజ్ఞాన సర్వస్వాలని పేర్కొన్నారు. యోగా, నేచురోపతి వంటి ప్రకృతి వైద్య విధానాలు ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని, సంపదను ప్రసాదిస్తాయని ఆయన వివరించారు.
ఐటీ విజన్ నుంచి నాలెడ్జ్ ఎకానమీ వరకు..
ముప్పై ఏళ్ల క్రితమే ఐటీ విప్లవాన్ని ఊహించి సాంకేతికతను ప్రోత్సహించడం వల్లే నేడు మన జీవితాల్లో పెను మార్పులు వచ్చాయని సీఎం గుర్తుచేశారు. ఆనాడు తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే హైదరాబాద్ నగరం నేడు గ్లోబల్ నాలెడ్జ్ ఎకానమీగా ఎదిగిందని చెప్పారు. ఐటీ రంగం మనకు జీవనోపాధిని ఇస్తే, మన సంస్కృతీ సంప్రదాయాలు మనకు జీవన విలువలను నేర్పుతాయని, విలువలతో కూడిన జీవితం గడిపేవారే నిజమైన ఆనందాన్ని పొందుతారని ఆయన ఆకాంక్షించారు. విదేశాల్లో ఉన్న తెలుగువారు మన సంస్కృతికి అంబాసిడర్లుగా మారడం గర్వకారణమని కొనియాడారు.
ఆరోగ్య భద్రత.. సంజీవని ప్రాజెక్టు
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం సంజీవని ప్రాజెక్టు ద్వారా కీలక అడుగు వేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. భవిష్యత్తులో డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా ప్రతి వ్యక్తికి అవసరమైన వ్యక్తిగత ఔషధాలను (Personalized Medicine) అందించే సాంకేతికత అందుబాటులోకి వస్తుందని చెప్పారు. సాంకేతికతను పాలనలో అనుసంధానం చేయడం ద్వారా ప్రకృతి వైపరీత్యాలను ముందే గుర్తించి, నష్ట నివారణ చర్యలు చేపట్టే అవకాశం కలిగిందని వివరించారు.
సంక్షేమ పథకాలు.. సామాజిక భద్రత
గత ఐదేళ్లలో భయం, విధ్వంసకర పాలన వల్ల ప్రజలు పండుగలు కూడా జరుపుకోలేని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో అందిస్తోందని సీఎం స్పష్టం చేశారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఆర్థిక సాయం. తగ్గుతున్న జనాభాను పెంచేలా పాపులేషన్ మేనేజ్మెంట్ కొత్త పాలసీని తెచ్చామన్నారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ. 20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు.స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి పకథాల కింద మహిళలు, దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. అర్చకులకు రూ. 15 వేల వేతనం, ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనం ఇస్తున్నామన్నారు.
అభివృద్ధి కారిడార్లు .. పోలవరం లక్ష్యం
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం విశాఖ, తిరుపతి, అమరావతి కేంద్రాలుగా రీజినల్ ఎకనామిక్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్వే లైన్ల అనుసంధానం ద్వారా లాజిస్టిక్స్ వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, తద్వారా కృష్ణా డెల్టా, విశాఖకు గ్రావిటీ ద్వారా నీరు అందుతుందని హామీ ఇచ్చారు. నిర్వాసితుల కోసం ఇప్పటికే రూ. 1,943 కోట్లు ఇచ్చామని, కేంద్రం కూడా నిధులతో సహకరిస్తోందని తెలిపారు.
2047 లక్ష్యం.. నంబర్ వన్ తెలుగు జాతి
2047 నాటికి తెలుగు జాతి ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలన్నదే తన సంకల్పమని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఉమ్మడి కుటుంబాల వ్యవస్థను మళ్ళీ ప్రోత్సహించాలని, ఇంట్లోని పెద్దలను గౌరవించుకోవాలని పిలుపునిచ్చారు. దేవతల రాజధాని అమరావతిని నేడు ప్రజల రాజధానిగా తీర్చిదిద్దుతున్నామని, ఐదు కోట్ల ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే తన ఏకైక లక్ష్యమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
Next Story

