భోలే బాబా.. చంద్రబాబా.. ఆలీబాబా.. హోరెత్తిన మండలి
x

'భోలే బాబా.. చంద్రబాబా.. ఆలీబాబా..' హోరెత్తిన మండలి

భోలే బాబా.. చంద్రబాబా.. ఆలీబాబా‘ అంటూ వైసీపీ సభ్యులు చేసిన వినూత్న నినాదాలు సభా ప్రాంగణాన్ని మారుమోగించాయి.


ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వేదికగా శుక్రవారం హైడ్రామా నడిచింది. తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారం సభను కుదిపేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెందిన కుటుంబ వ్యాపార సంస్థకు, నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీకి మధ్య ఉన్న లింకులపై చర్చించాలని వైఎస్సార్‌సీపీ పట్టుబట్టడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. నినాదాలు, మంత్రుల కౌంటర్లు, ప్లకార్డుల ప్రదర్శనతో మండలిలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.

నినాదాలతో హోరెత్తిన మండలి

సభ ప్రారంభానికి ముందే వైసీపీ ఎమ్మెల్సీలు భారీ ర్యాలీతో మండలికి చేరుకున్నారు. ’భోలే బాబా.. చంద్రబాబా.. ఆలీబాబా‘ అంటూ వారు చేసిన వినూత్న నినాదాలు సభా ప్రాంగణాన్ని మారుమోగించాయి. సీఎంకు చెందిన వ్యాపార సంస్థకు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డెయిరీ, టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం వెనుక ఉన్న కుట్రను బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానాలు ఇచ్చారు. వీటిని ఛైర్మన్ తిరస్కరించడంతో సభ్యులంతా పోడియంను చుట్టుముట్టారు.

స్వామివారి చిత్రపటాలతో నిరసన.. మంత్రి పయ్యావుల ఆగ్రహం

వైసీపీ సభ్యులు శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రపటాలను పట్టుకుని నిరసన తెలపడంపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా మండిపడ్డారు. బుద్ధుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగుతున్న వైసీపీ సభ్యులకు అసలు బుద్ధుందా? చెప్పులు వేసుకుని స్వామివారి ఫోటోలు పట్టుకోవడం దుర్మార్గం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ గౌరవాన్ని, భక్తుల నమ్మకాన్ని తగ్గించేలా వైసీపీ ప్రవర్తిస్తోందని, సభలో దేవుడి చిత్రాలను అనుమతించవద్దని ఆయన ఛైర్మన్‌ను కోరారు.

దేవుడి ధనాన్ని లూటీ చేస్తున్నారు: బొత్స

విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సాక్షాత్తూ దేవుడి ప్రసాదంపై చంద్రబాబు నిందలు మోపారని, తన సొంత వ్యాపార సంస్థల లబ్ధి కోసమే ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. దేవుడి ధనాన్ని లూటీ చేసేందుకు ప్రయత్నిస్తూ, ప్రజల దృష్టి మరల్చడానికి డొల్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ధ్వజమెత్తారు. ఇందాపూర్ డెయిరీకి, సీఎం కుటుంబ సంస్థకు ఉన్న ఆర్థిక సంబంధాలపై సమగ్ర చర్చ జరగాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

మండలి వాయిదా

పోడియం వద్ద వైసీపీ సభ్యుల ఆందోళన మిన్నంటడం, మంత్రులు-విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో ఛైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు సభను కొద్దిసేపు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Read More
Next Story