
కలకలం రేపుతున్న విజయవాడ ఉగ్ర లింక్ కేసు
ఈ నెట్‌వర్క్‌లో ఉన్న మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్రవాద మూలాలు ఉన్నయన్న ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విజయవాడ కేంద్రంగా సాగుతున్న ఉగ్ర కార్యకలాపాల కేసులో కౌంటర్ ఇంటెలిజెన్స్ (CI) పోలీసులు మరో కీలక ముందడుగు వేశారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడకు చెందిన సయిదా బేగంను అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. సోషల్ మీడియా వేదికగా యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడంలో ఈమె మాస్టర్ మైండ్‌గా వ్యవహరించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
యువతను బుట్టలో వేసుకునే డిజిటల్ వల
సయిదా బేగం సోషల్ మీడియాలో అత్యంత క్రియాశీలకంగా ఉంటూ, విద్వేషపూరిత పోస్టుల ద్వారా యువతలో ఉగ్రవాద భావజాలాన్ని నరనరానికీ ఎక్కించేదని విచారణలో తేలింది. విజయవాడలో ఇటీవల అరెస్టయిన ముగ్గురు యువకులను జిహాద్ వైపు మళ్లించడంలో ఈమె కీలక పాత్ర పోషించింది. వీరిని రెచ్చగొట్టి, దేశంపై యుద్ధం ప్రకటించేలా (గజ్వా-ఏ-హింద్) ప్రేరేపించినట్లు సీఐ సెల్ గుర్తించింది.
అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో గ్రూపులు
విజయవాడకు చెందిన మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్ బేగ్, మహమ్మద్ దానిష్‌లు కలిసి అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరిట ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. వీరు నిషేధిత ఉగ్రవాద సంస్థలైన అల్-ఖైదా (AQIS), ఐసిస్ (ISIS) హ్యాండ్లర్లతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ముగ్గురూ నెల రోజుల్లోగా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లకు వెళ్లి మిలిటెంట్ శిక్షణ పొందేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో పోలీసులు పక్కా సమాచారంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు.
లాడెన్ వేషధారణ.. జాతీయ జెండాపై విషం
నిందితుల్లో ప్రధాన వ్యక్తి రహమతుల్లా షరీఫ్ ఓలా, ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తూనే అంతర్జాతీయ ఉగ్రవాదుల ప్రసంగాలకు ఆకర్షితుడయ్యాడు. వీరు ముఖాలకు మాస్కులు వేసుకుని ముజాహిదీన్లుగా ప్రకటించుకునేవారు. ఒసామా బిన్ లాడెన్ హావభావాలను సాధన చేస్తూ వీడియోలు తీసేవారు. అంతేకాకుండా, జాతీయ జెండాను దహనం చేయడం, జాతీయ గీతాన్ని హేళన చేయడం వంటి దేశద్రోహ చర్యలకు పాల్పడుతూ భారత్‌ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే తమ లక్ష్యమని ప్రకటించుకునేవారని దర్యాప్తులో వెల్లడైంది.
దేశవ్యాప్త నెట్‌వర్క్..వేట కొనసాగుతోంది
విజయవాడ ఇన్-చార్జి సీపీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ముగ్గురు నిందితులకు తెలంగాణ, మహారాష్ట్ర, బిహార్, కర్ణాటక, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లోని ఉగ్ర సానుభూతిపరులతో సంబంధాలు ఉన్నాయి. విదేశీ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు వీరు ఉగ్ర కార్యకలాపాలకు ప్రణాళికలు సిద్ధం చేసేవారు. ప్రస్తుతం సయిదా బేగంను రహస్య ప్రాంతంలో విచారిస్తున్న పోలీసులు, ఈ నెట్‌వర్క్‌లో ఉన్న మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story

