జాలి పడి ఫోన్ పే చేస్తే 90 వేలు కొట్టేసి, బస్సు నుంచి దూకేసి..
x

జాలి పడి ఫోన్ పే చేస్తే 90 వేలు కొట్టేసి, బస్సు నుంచి దూకేసి..

మోసం గుట్టురట్టు, బస్సు నుంచి దూకి ప్రాణం తీసుకున్న యువకుడు


నమ్మినోడినే నట్టేట ముంచడమంటే ఇదేనేమో.. అర్జంటుగా డబ్బు కావాలని ప్రాధేయపడితే రూ. 200 పంపినందుకు, ఏకంగా 90 వేల రూపాయలు కాజేశాడో కేటుగాడు. కానీ, పాపం పండి తన మోసం బయటపడటంతో, పారిపోయే క్రమంలో రన్నింగ్ బస్సులో నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. పల్నాడు జిల్లా మేదరమెట్ల - ఒంగోలు జాతీయ రహదారిపై గురువారం జరిగిన ఈ విస్తుపోయే ఘటన వివరాలిలా ఉన్నాయి.
అసలేం జరిగింది?
చిలకలూరిపేట నుంచి ఒంగోలు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మేదరమెట్ల వద్ద గోపీనాధ్ అనే యువకుడు ఎక్కాడు. బస్సులో ఉన్న ప్రయాణికుల వద్దకు వెళ్లి.. తనకు అత్యవసరంగా రూ. 200 ఫోన్‌పే కావాలని, కావాలంటే నగదు ఇస్తానని ప్రాధేయపడ్డాడు. అతని మాటలు నమ్మిన మురళీకృష్ణ అనే ప్రయాణికుడు మానవత్వంతో తన మొబైల్ నుంచి గోపీనాధ్ ఖాతాకు రూ. 200 ట్రాన్స్‌ఫర్ చేశాడు.
నమ్మించి నట్టేట ముంచాడు..
డబ్బు పంపే సమయంలో మురళీకృష్ణ కొట్టిన UPI పిన్ నంబర్‌ను గోపీనాధ్ చాకచక్యంగా గమనించాడు. ఆ తర్వాత తన ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని, ఒక అర్జంట్ కాల్ చేసుకోవాలని మురళీకృష్ణ ఫోన్ అడిగి తీసుకున్నాడు. కాల్ మాట్లాడుతున్నట్లు నటిస్తూనే, మురళీకృష్ణ ఫోన్‌లోని ఫోన్‌పే యాప్ ఓపెన్ చేసి, తాను ఇందాక చూసిన పిన్ నంబర్ ఉపయోగించి ఏకంగా రూ. 90,000 వేరే ఖాతాకు మళ్లించాడు.
ప్రాణం తీసిన భయం
ఫోన్ తిరిగి తీసుకున్న మురళీకృష్ణకు అనుమానం వచ్చి చెక్ చేయగా, భారీ మొత్తంలో మనీ ట్రాన్స్‌ఫర్ అయిన మెసేజ్ చూసి షాక్‌కు గురయ్యాడు. వెంటనే గోపీనాధ్‌ను నిలదీశాడు. తోటి ప్రయాణికులు కూడా చుట్టుముట్టడంతో, దొరికిపోయాననే భయంతో గోపీనాధ్ ఒక్కసారిగా రన్నింగ్ బస్సు కిటికీలో నుంచి బయటకు దూకేశాడు. తీవ్ర గాయాలైన అతడిని ఒంగోలు రిమ్స్ (GGH)కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ ఘటన నేర్పే పాఠాలు..
పిన్ నంబర్ రహస్యం: ఫోన్‌పే, జీపే వంటి యాప్స్ వాడుతున్నప్పుడు పిన్ నంబర్ టైప్ చేసేటప్పుడు పక్కన వారు గమనించకుండా జాగ్రత్త పడాలి.
అపరిచితులకు ఫోన్ ఇవ్వొద్దు: అత్యవసరం అని అడిగితే మీరే నంబర్ డయల్ చేసి స్పీకర్‌పై పెట్టి మాట్లాడమనండి కానీ, అన్‌లాక్ చేసిన ఫోన్‌ను ఇతరుల చేతికి ఇవ్వకండి.
మానవత్వం vs మోసం: సాయం చేసే గుణం మంచిదే అయినా, టెక్నాలజీ యుగంలో అపరిచితులను నమ్మేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.
ఆన్‌లైన్ పేమెంట్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరించారు.
Read More
Next Story