
క్షణాల్లో జరిగిన ఘోరం
హాల్ టికెట్ తెస్తూ మృత్యు ఒడిలోకి యువతి
పరీక్షలు రాసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకున్న ఆ యువతి కలలు రోడ్డు ప్రమాదం రూపంలో ఛిద్రమయ్యాయి. హాల్ టికెట్ తీసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా జరిగిన ఘోర ప్రమాదంలో ఎంబీఏ విద్యార్థిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. జాతీయ రహదారి 216లోని పోలేకుర్రు చెక్‌పోస్టు వద్ద ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ప్రాణం తీసిన టిప్పర్
యానాం పెదపూడి వీధికి చెందిన మహ్మద్ మోమినా తన్వీర్ (21), ఆమె స్నేహితురాలు సయ్యద్ అఫ్రీన్ సుల్తానా పటవలలోని పైడా విద్యా సంస్థలో ఎంబీఏ, ఎంసీఏ చదువుతున్నారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న మొదటి సెమిస్టర్ పరీక్షల కోసం ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై కళాశాలకు వెళ్లి హాల్ టికెట్లు తీసుకున్నారు. పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా, పోలేకుర్రు చెక్‌పోస్టు వద్ద వేగంగా వచ్చిన టిప్పర్ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తన్వీర్ టిప్పర్ కింద పడిపోగా, ఆమె తలపై నుంచి చక్రాలు వెళ్లడంతో నుజ్జునుజ్జు అయ్యి అక్కడికక్కడే మృతి చెందింది. మరో విద్యార్థిని సుల్తానా రెండో వైపు పడటంతో స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆమెను తక్షణమే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విషాదంలో కుటుంబం
మృతురాలు తన్వీర్ తండ్రి జిలానీ యానాం మార్కెట్‌లో చికెన్ షాపు నిర్వహిస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కళ్లముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. కేవలం రెండు నెలల క్రితమే తన్వీర్ సోదరుడికి వివాహం జరిగిందని, ఆ ఇంట్లో పెళ్లి సందడి ఇంకా తగ్గకముందే ఇంతటి విషాదం నిండటంతో స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు.
చెక్‌పోస్టు నిర్వహణపై ఆగ్రహం
ఈ ప్రమాదంపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిలోని మలుపు వద్ద అనాలోచితంగా చెక్‌పోస్టు ఏర్పాటు చేయడం, బారికేడ్లను ఇష్టారాజ్యంగా ఉంచడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. అమలాపురం, యానాం వైపు నుంచి వాహనాలు వేగంగా వచ్చే ప్రాంతంలో సరైన నిర్వహణ లేకపోవడం వల్ల గతంలోనూ అనేక ప్రమాదాలు జరిగాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కోరంగి ఎస్‌ఐ పి. సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.

