మార్చి నుంచే ఎండలు మండుతాయ్‌!
x
సమ్మర్‌లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకుంటాయా?

మార్చి నుంచే ఎండలు మండుతాయ్‌!

ఈ ఏడాది వేసవి ముందుగా రావడమే కాదు.. మండుటెండలతో పాటు తీవ్ర వడగాడ్పులూ వీస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది.


ఇటీవల కాలంలో చాలా ఏళ్ల తర్వాత ఈ ఏడాది శీతాకాలం జనాన్ని ఎక్కువ రోజులు గజగజలాడించింది. అత్యల్ప ఉష్ణోగ్రతలతో నిన్న మొన్నటి దాకా ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తూనే ఉంది. చాలా చోట్ల రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు సాధారణంకంటే చాలా తక్కువగా నమోదవుతూ వచ్చాయి. అయితే ఈ ఏడాది వేసవి కూడా గడగడలాడించనుంది. అత్యధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాడ్పులతో బెంబేలెత్తించనుంది. ఈ విషయాన్ని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారికంగా వెల్లడించింది. మార్చి నుంచి మే వరకు కొనసాగనున్న వేసవి సీజను ముందస్తు అంచనాలను శనివారం సాయంత్రం విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం..


ఉష్ణతాపం నుంచి ఉపశమనం పొందుతున్న కుటుంబం (ఫైల్‌)

మార్చి నుంచే మంటలు మొదలు..
కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో వేసవి ఛాయలు మొదలయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2–4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల అప్పుడే 38 డిగ్రీల వరకు రికార్డవుతున్నాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణంలో వేసవి అనుభూతి కలుగుతోంది. మరోవైపు పగటి పూట ఉక్కపోత మొదలైంది. ఈ పరిస్థితులన్నీ రాబోయే వేసవి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఐఎండీ వేసవి అవుట్‌ లుక్‌ను విడుదల చేసింది. ఒక్క వాయవ్య, మధ్య భారతదేశం మినహా దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ ఈ సమ్మర్‌ సీజన్‌లో సాధారణంకంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ఈ సీజనులో పగటి ఉష్ణోగ్రతలే కాదు.. రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలూ ఒకింత అధికంగానే రికార్డవుతాయని తెలిపింది. ఇక మార్చి నెలలో ఈశాన్య రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఉష్ణ తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.

ఈ వేసవిలో దేశంలో ఉష్ణ తీవ్రతను చూపే పటం

వడగాడ్పులూ ముందుగానే..
సాధారణంగా ఏప్రిల్‌ ఆఖరు నుంచి మే నెల చివరి వరకు వడగాడ్పులు వీస్తాయి. కానీ ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉండనుంది. మార్చి నుంచే వడగాడ్పులు ప్రభావం చూపనున్నాయి. మార్చి నెలలో గుజరాత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ వడగాడ్పులు మొదలు కావడమే గాక ఎక్కువ రోజులు కొనసాగుతాయని ఐఎండీ వెల్లడించింది. అదే సమయంలో ధండర్‌ స్టార్మ్‌ ప్రభావంతో మార్చిలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఆకస్మిక వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలో సాధారణంకంటే ఎక్కువ వర్షపాతం నమోదుకు ఆస్కారం ఉందంది.
వడగాడ్పుల రోజులూ పెరుగుతాయ్‌..
ఈ వేసవి సీజనులో ఎండలతో పాటు వడగాడ్పులు వీచే రోజులు కూడా పెరుగుతాయని ఐఎండీ అంచనా వేసింది. అంటే సాధారణ వడగాడ్పుల రోజులకంటే ఎక్కువ రోజులు కొనసాగుతాయన్న మాట! ఈ ప్రభావం వాయవ్య, పశ్చిమ భారతదేశంలోనూ, ఆం«ధ్రప్రదేశ్‌ సహా దక్షిణ భారతదేశంలోనూ ఉండనుంది.
ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకుంటాయా?
ఈ సమ్మర్‌ తీవ్రంగా ఉంటుందని ఐఎండీ వెల్లడించిన నేపథ్యంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2024లో దేశంలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ వేసవి సీజనులో పలు చోట్ల 45 డిగ్రీలకు పైగా, ఢిల్లీ, రాజస్థాన్‌లలో 50 డిగ్రీకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆ సంవత్సరం గడచిన 14 ఏళ్లలో హాట్‌ సమ్మర్‌ ఆ ఏడాది రికార్డు నమోదు చేసుకుంది. ఈ సమ్మర్‌ సీజను 2024కంటే తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు నమోదు కావచ్చని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.
ప్రజల ఆరోగ్యంపై హీట్‌వేవ్స్‌ ప్రభావం..
ముందుగానే ఎండలు, వడగాడ్పులు మొదలు కావడం, ఎక్కువ రోజులు కొనసాగడం వల్ల ఆ ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడనుంది. ఇది చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వారు, ఆరుబయట పనులు చేసే వారి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. నీటి వనరులు అడుగంటడం, విద్యుత్‌ డిమాండ్‌ పెరగడం వంటి పరిస్థితులు తలెత్తుతాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది. చల్లదనానికి అవసరమైన చర్యలతో పాటు మంచినీటి సరఫరా, చలివేంద్రాలు, శీతల షెల్టర్ల ఏర్పాటు, ప్రజారోగ్యంపై శ్రద్ధ చూపాలని కోరింది. అలాగే ప్రజలు కూడా ఎండలు, వడగాడ్పుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మంచినీరు ఎక్కువగా తాగాలని సూచించింది.
ఈ వేసవి తీవ్రత ఎందుకంటే?
ప్రస్తుతం భూమధ్యరేఖ పసిఫిక్‌ మహాసముద్రాల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణకంటే తక్కువగా ఉంటూ లానినా పరిస్థితులు బలహీనంగా ఉన్నాయి. వర్షాలకు అనుకూలంగా ఉండాలంటే లానినా పరిస్థితులు బలంగా ఉండాలి. కానీ ఈ సీజనులో లానినా బలహీనంగాను, ఎల్‌నినో (కరువు పరిస్థితులు) ఒకింత బలపడుతుండడమే ఉష్ణతాపం, వడగాడ్పుల ఉధృతికి దోహదపపడుతున్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది.
ఐఎండీ అంచనాల్లో కచ్చితత్వం..
ఐఎండీ అంచనాలు చాలావరకు కచ్చితత్వాన్ని కలిగి ఉంటాయి. 2016 నుంచి శీతలం, వేసవి, వర్షాకాల సీజన్ల పరిస్థితిపై ఐఎండీ వేస్తున్న ముందస్తు అంచనాలు దాదాపు నిజమవుతున్నాయి. ఇందుకు కొత్తగా అభివృద్ధి పరచిన మల్టీ మోడల్‌ ఎన్సంబుల్‌ (ఎంఎంఈ) ఆధారిత ఫోర్‌కాస్టింగ్‌ సిస్టమ్‌ను వినియోగిస్తోంది.
Read More
Next Story