విజయవాడ ‘లూలూ మాల్’ ముగిసిన కథ
x

విజయవాడ ‘లూలూ మాల్’ ముగిసిన కథ

విజయవాడ ఆర్టీసీ ‘గోల్డ్ మైన్’ లూలూ హస్తాల నుంచి బయటకు ఎలా వచ్చిందంటే...


విజయవాడలోని అత్యంత విలువైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) భూమిని లూలూ గ్రూప్‌కు కేటాయించడాన్ని ప్రభుత్వం ఉప సంహరించుకుంది. భూ కేటాయింపును సవాల్ చేస్తూ మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతుండగా, ప్రభుత్వం ఆ కేటాయింపును రద్దు చేసి భూమిని వెనక్కి తీసుకుంటుందని అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ ఏప్రిల్ 9న కోర్టుకు తెలిపారు. ఇది ప్రజా ఒత్తిడి, రాజకీయ విమర్శలు, సంఘాల నిరసనల మధ్య ప్రభుత్వం తీసుకున్న యు-టర్న్‌గా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

ఎప్పుడు, ఎలా కేటాయించారు?

2025 జూలై 5న జారీ చేసిన జీ.ఓ. నం. 137 ద్వారా విజయవాడ గవర్నర్‌పేటలోని ఆర్టీసీ ఓల్డ్ బస్ స్టాండ్, డిపోల సమీపంలో ఉన్న 4.15 ఎకరాల ప్రధాన భూమిని లూలూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 99 ఏళ్ల లీజుకు కేటాయించారు. ఈ భూమి చదరపు అడుగుకు రూ.1.50 మాత్రమే అద్దె చెల్లించాల్సి ఉంటుందని, మొదటి మూడేళ్లు రెంట్ ఫ్రీగా ఇవ్వాలని షరతులు విధించారు. లూలూ గ్రూప్ ఈ భూమిపై షాపింగ్ మాల్ నిర్మాణం చేసి రూ.1,222 కోట్ల పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదించింది.

భూమి విలువ, ధర ఎంత?

రాజధాని ప్రాంతంలోని ఈ భూమి మార్కెట్ విలువ సుమారు రూ.400 కోట్లు (ఎకరాకు సుమారు రూ.96 కోట్లు) ఉందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు, వ్యతిరేక పక్షాలు అంచనా వేస్తున్నాయి. కానీ ప్రభుత్వం దీన్ని నామమాత్రపు అద్దెతో లీజుకు ఇచ్చడం ‘తుచ్ఛమైన ధర’ అని విమర్శలు వచ్చాయి. ఇది అమ్మకం కాదు, 99 ఏళ్ల లాంగ్ లీజు మాత్రమే.

విమర్శల నేపథ్యం ఏమిటి?

ఈ కేటాయింపు వెలుగులోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు, సీపీఎం, సీపీఐ, వైఎస్‌ఆర్‌సీపీ, వ్యాపార సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.

పబ్లిక్ ఆస్తిని ప్రైవేటు సంస్థకు బదలాయించడం, టెండర్ లేకుండా ఒకే కంపెనీకి ఇవ్వడం.

సుప్రీం కోర్టు నిబంధనలు ఉల్లంఘన.

ఆర్టీసీ ఉద్యోగులు (సుమారు 1,000 మంది) వ్యవహారాలు దెబ్బతినడం, ప్రత్యామ్నాయ భూమి గొల్లపూడిలో ఇవ్వడం అసాధ్యం.

రాష్ట్ర ఖజానాకు నష్టం, పారదర్శకత లోపం.

వైఎస్సార్సీపీ, సివిల్ సొసైటీలు ఇది ‘కుంభకోణం’ అని ఆరోపించాయి.

ప్రభుత్వం సమర్థించుకున్న తీరు?

ప్రభుత్వం మొదట్లో ఈ నిర్ణయాన్ని ‘పర్యాటకం, పెట్టుబడులు, నగర అభివృద్ధి’ కోసం తీసుకున్నట్లు సమర్థించింది. లూలూ గ్రూప్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాల్స్ నిర్మిస్తే ఉపాధి, వాణిజ్యం పెరుగుతాయని వాదించింది. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు కూడా ఆమోదం తెలిపింది.

ఎందుకు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది?

నిరంతర నిరసనలు, ఆర్టీసీ సంఘాల హెచ్చరికలు, సీపీఎం ఉద్యమం, మల్టిపుల్ పిల్‌లు (వడ్డె శోభనాద్రీశ్వరరావు పిటిషన్‌తో సహా), పాలక కూటమి లోపలి ఒత్తిడి (జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సహా) కారణంగా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని వివిధ వర్గాలు చెబుతున్నాయి. కోర్టు విచారణలో ఇక ముందుకు వెళ్లడం కష్టమని గ్రహించి, అడ్వకేట్ జనరల్ ద్వారా రద్దు ప్రకటన చేయించి కేసును ముగించింది. ఇప్పుడు స్పష్టమైన రద్దు ఉత్తర్వులు జారీ కానున్నాయి.

ఈ ఘటన రాష్ట్రంలో పబ్లిక్ ల్యాండ్ కేటాయింపుల్లో పారదర్శకత, ప్రజా హక్కులు ఎంత ముఖ్యమో మరోసారి ఉద్ఘాటించింది. లూలూ విజయవాడ మాల్ ప్రాజెక్టు ఇప్పటికైనా స్తంభించినా, ఇలాంటి భవిష్యత్ కేటాయింపుల్లో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా ఉండాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రజల సమ్మతి లేని నిర్ణయాలు ఎంతటి ఒత్తిడికి లోనవుతాయో ఈ ఉదంతం స్పష్టం చేసింది.

ఇది ప్రజల విజయం

లూలూ కంపెనీకి వందల కోట్ల విలువైన, విజయవాడకు నడిబొడ్డులోని కార్మిక సమాజానికి చెందిన భూమిని లీజుకివ్వడాన్ని వ్యతిరేకించి ఉద్యమించామని, ఆ ఉద్యమం సక్సెస్ అయిందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు పేర్కొన్నారు. ఆయన ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి’తో మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ ఇటువంటి ఘోరాలు ఎన్నో చేస్తోందని, లక్షల కోట్ల విలువైన భూములను పరిశ్రమల పేరుతో స్వాధీనం చేసుకుని దోపిడీ ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. లూలూ కంపెనీకి కేటాయించిన లీజును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం ప్రజల విజయంగా ఆయన వర్ణించారు.

Read More
Next Story