“అరే, సాయిరాం.. అన్నను అట్లా చంపావేంట్రా?”
x
ప్రతీకాత్మక చిత్రం

“అరే, సాయిరాం.. అన్నను అట్లా చంపావేంట్రా?”

అట్లపాడు ఘటన వెనుక దాగిన సామాజిక విషాదం


“ఓరేయ్ సాయిరాం… అన్నను అట్లా చంపావేంట్రా?” ఈ ప్రశ్న నిడదవోలు మండలం, అట్లపాడులోని ఒక్క కుటుంబాన్ని కాదు, మొత్తం సమాజాన్నే వెంటాడుతోంది. కుటుంబ కలహాలతో తమ్ముడు అన్నను హత్య చేసిన ఈ ఘటనను కేవలం ఓ క్రైమ్ న్యూస్‌గా మాత్రమే చూడలేం. ఇది గ్రామీణ సమాజంలో పెరుగుతున్న నిరుద్యోగం–మద్యం–మానసిక ఒత్తిడి త్రికోణానికి అద్దం పడిన ఘటనగా కనిపిస్తోంది.

ఘటన ఏమిటి?
అట్లపాడు గ్రామానికి చెందిన బండి కోట సత్యనారాయణ (28) బీటెక్ చదివి ఇంటివద్ద ఖాళీగా ఉంటున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో మద్యం అలవాటు పెరిగింది. ఈ నేపథ్యంలో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. సోమవారం తెల్లవారుజామున మద్యం మత్తులో తల్లి, తమ్ముడితో వాగ్వాదానికి దిగాడు. కోపోద్రిక్తుడైన తమ్ముడు సాయిరాం రోకలిబండతో అన్న సత్యనారాయణపై దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆ తర్వాత సాయిరాం సమిశ్రగూడెం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి పోలీసులకు జరిగినదంతా చెప్పారు. సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి పరిశీలించగా సత్యనారాయణ అప్పటికే మృతి చెందినట్లు ఎస్సై బాలాజీ సుందర్ రావు చెప్పారు.
ఇది ఒక్క కుటుంబ కథ కాదు...
ఈ ఘటనను విన్న గ్రామస్తులు “ఎంతో బాగుండే కుటుంబం… ఇంతటి ఘాతుకం ఎలా జరిగింది?” అని వాపోతున్నారు. కానీ ఇదే సమయంలో మరో ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.. ఇలాంటి ఘటనలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఇది వ్యక్తిగత కోపం మాత్రమే కాదు.
గ్రామీణ ప్రాంతాల్లో బీటెక్, డిగ్రీలు పూర్తి చేసిన యువత సంఖ్య పెరుగుతోంది. కానీ ఉద్యోగాలు అందుబాటులో లేకపోవడంతో వారు ఇంటివద్ద ఖాళీగా ఉండిపోతున్నారు. ఈ ఖాళీ- నిరాశగా మారుతోంది. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. కుటుంబాల్లో ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. సత్యనారాయణ ఘటన ఇదే వాస్తవానికి ఉదాహరణగా మారింది అని గుంటూరుకు చెందిన సైకాలజిస్ట్ డాక్టర్ జి. విజయసారధి.
సమస్యను మర్చిపోవాలన్న తప్పుడు దారి...
నిరుద్యోగం, ఆర్థిక ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి చాలామంది మద్యం వైపు మొగ్గుతున్నారు. కానీ అది సమస్యను పరిష్కరించదు. కుటుంబ కలహాలను పెంచుతుంది. హింసకు దారి తీస్తుంది. మద్యం మత్తులో మాటలు అదుపు తప్పితే, క్షణాల్లో ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని వివరించారు డాక్టర్ సారధి.
కుటుంబాల్లో మానసిక ఆరోగ్యంపై చర్చ లేకపోవడం వల్ల కూడా డిప్రెషన్, మానసిక ఒత్తిడి, నిరాశ పెరిగిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇటువంటి అంశాలపై గ్రామాలలో మాట్లాడడం ఇప్పటికీ ‘బలహీనత’గా భావిస్తున్నారు. ఫలితంగా సమస్యలు లోపలే పేరుకుపోతూ చివరకు హింసగా బయటపడుతున్నాయి.
Read More
Next Story