ఏపీలో పరిస్థితులు దిగజారిపోతున్నాయ్‌!
x
విశాఖలో మీడియాతో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ

ఏపీలో పరిస్థితులు దిగజారిపోతున్నాయ్‌!

ఆంధ్రప్రదేశ్‌లో హత్యలు, గ్రామ బహిష్కరణలతో శాంతిభద్రతల పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖపట్నం ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఏమన్నారంటే?

‘పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో గ్రామ బహిష్కరణకు గురైన వైఎస్సార్‌సీపీ దళిత కార్యకర్త సాల్మన్‌ను హత్య చేశారు. రెండేళ్ల క్రితం ఊరి నుంచి బహిష్కరించిన ఆయన ఇటీవల ఊళ్లోకి రాగానే చంపేశారు. హత్యకు గురైన సాల్మన్‌ను దహనం చేయకుండా అడ్డుకున్నారు. అంతేకాదు.. ఆధార్‌ కార్డులు చూపిస్తేనే బంధువులను దహన సంస్కారాల్లో పాల్గొనేలా చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి.. దిగజారిపోతున్నాయి. మీ కూటమి ప్రభుత్వ హయాంలో ఇంకా గ్రామ బహిష్కరణలా? ప్రజాస్వామ్యం ఉందా?
పల్నాడులో జరుగుతున్న పరిణామాలను ఖండిస్తున్నాం. మాయమాటలు చెప్పో, పెట్టెలు మార్చో అధికారంలోకి వచ్చారు కదా? ఊరి బహిష్కరణ చేసిన దళితుడిని చంపితే ఏం చెబుతారు మీరు? దళితుడి హత్యను ఖండిస్తూ ప్రభుత్వం నుంచి ఒక ప్రకటనైనా వచ్చిందా? అలాంటి ప్రభుత్వం ఉంటే ఏమిటి? పోతే ఏమిటి? దళితులను, పేదలను చంపుతున్న ప్రభుత్వం అవసరమా?
పోలీసులూ చట్టాలను అతిక్రమించకండి..
పోలీసులూ మీరు కూడా సమర్థవంతంగా పనిచేయండి. చట్టాలను అతిక్రమించకండి. మీరు పనిచేసేది పోలీస్‌ స్టేషన్లలో తప్ప పోస్టాఫీసుల్లో కాదన్న సంగతి మరచిపోకండి. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పెద్ద మాటలు చెబుతారు కదా? పల్నాడు హత్యపై స్పందించరేమి? దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని ప్రధాని మోదీ పదే పదే చెబుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలనలో జరుగుతున్న అఘాయిత్యాలపై దృష్టి సారించండి.
రైతుల పరిస్థితీ అగమ్య గోచరమే..
ఇక రాష్ట్రంలో రైతుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగానే ఉంది. రైతులు పండించిన పంటలను కొనే వాడే లేడు. వారిని పట్టించుకునే నాథుడూ లేడు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. రూ.275ల యూరియా బస్తా మార్కెట్లో రూ.600 ఉంది. అనుకూల మీడియాలో డిబేట్లు పెడితే రైతుల కడుపు నిండుతుందా? ఈ రెండేళ్లలో రైతులకు ఏం మేలు జరిగిందో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చెప్పాలి. మేం చెబుతున్నది అబద్ధమని చెప్పే పరిస్థితి కూడా పాలకుల వద్ద లేదు. అందుకే మేం చెబుతున్నవన్నీ వాస్తవాలే. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి రూ.5,600 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలున్నాయి. రెండు నెలల నుంచి ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు జీతాలిచ్చే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ అటకెక్కేసింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే కొన్ని మీడియాలు మాత్రం పాలన ఆహా ఓహో అంటూ ఊదరగొడ్తున్నాయి. మీడియా సంస్థలకు సామాజిక బాధ్యత లేదా?
ఎన్నికల ముందు ఏం మాట్లాడారో తెలుసా?
చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌లు సార్వత్రిక ఎన్నికల ముందు మీరేం మాట్లాడారో గుర్తు చేసుకుని మర్నాడు మీటింగుల్లో మాట్లాడండి. ఏం పరిపాలన ఇస్తామని అధికారంలోకి వచ్చారు? ఇప్పుడు చేస్తున్నదేమిటి? పిల్లలకు చదువుల్లేక, ఉద్యోగులకు జీతాల్లేక.. కూలీలకు ఐదేళ్లూ నోట్లో పోక, రైతులకు గిట్టుబాటులేక.. రాష్ట్రంలో అన్ని వర్గాలూ అవస్థలు పడుతున్నాయి. సంక్రాంతి పండుగకు ఏ ఊళ్లోనైనా గొబ్బిళ్లు, ధాన్యం పండించుకున్న సంబరాలున్నాయా? కోడి పందేలు విచ్చల విడిగా ఆడిస్తారా? రాబోయే తరాలకు మంచి సంస్కృతిని నేర్పండి.. మీడియా కూడా అలాంటి వాటికే ప్రాధాన్యమిస్తోంది. పదే పదే చూపిస్తోంది.
కారు చౌకగా భూములిచ్చేస్తే చూస్తూ ఊరుకోం.
రాష్ట్రంలో ఏవేవో కంపెనీలకు కారు చౌకగా భూములిచ్చేస్తామంటే చూస్తూ ఊరుకోం. లులూ, సత్వా వంటి రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు రూ.వందల కోట్ల భూములను అప్పనంగా ఇచ్చేస్తారా? మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటిపై తగిన చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కాకినాడలో గ్రీన్‌ కో కంపెనీకి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలను బెదిరించి పారిపోయేలా చేశారని ఆరోపించారు. కాకినాడలో గ్రీన్‌ కో కంపెనీతో మా హయాంలో నే ఎంఓయూ జరిగింది. స్వయంగా అదానీ కుమారుడే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించామని చెప్పారు’ అని చెప్పారు. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పాల్గొన్నారు.
Read More
Next Story