
సమ్మె చేస్తే పండక్కి బస్సులెట్టా! ఊళ్లకి పోయేదెట్టా!!
అదును చూసి దెబ్బకొట్టిన ఆర్టీసీ అద్దె బస్సులు!!
అదును చూసి దెబ్బ కొట్టడమంటే ఇదేనేమో.. సంక్రాంతి పండక్కి ఊరెళ్లడానికి జనం ఉరుకులు పరుగులు పెడుతుంటే ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. కాస్తంత భద్రంగా ఊళ్లకు చేరే ఈ ప్రయాణ సాధనం ఆగిపోతే సామాన్యులు హాహాకారాలు పెట్టాల్సిందే. అద్దె పెంచాలంటూ అద్దె బస్సుల యజమానుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నష్టాలు వస్తున్నందున తమకు చెల్లించే అద్దె పెంచాలంటున్నారు. అద్దె పెంచకపోతే ఈ నెల 12వ తేదీ నుంచి అంటే సరిగ్గా భోగి పండక్కి ఒక్క రోజు ముందు బస్సులు నిలిపివేస్తామంటున్నారు. సమ్మె గురించి ఎపిఆర్టీసి అద్దె బస్సుల యాజమానుల సంఘం (APSTRC Hired Buses Association) అధ్యక్షుడు ఇ. రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇదేదో ఒక ఊరికో నగరానికో కాదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ అద్దె బస్సులను నిలిపివేయాలని యజమానులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు ఆర్టీసీ యాజమాన్యానికి అద్దె బస్సుల యజమానుల సంఘాలకి మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. సమ్మె నోటీసుల్ని, హెచ్చరికల్ని నిలిపివేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది.
స్త్రీశక్తి పథకం అమలుతో అధిక రద్దీ వల్ల తమపై అదనపు భారం పడుతోందని అద్దె బస్సుల యజమానులు చెబుతున్నారు. ఇందన ఖర్చు పెరగడం, నిర్వహణ ఖర్చు సైతం పెరగడంతో ఇబ్బంది అవుతోందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అద్దె పెంచాలని గత కొంతకాలంగా ఆర్టీసీ యాజమాన్యాన్ని అభ్యర్థిస్తున్నారు. వీరి అభ్యర్థనపై స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం.. నెలకు అదనంగా రూ. 5,200 ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, స్వల్పంగా పెంచిన ఈ అద్దెపై అద్దె బస్సుల యజమానుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమతో చర్చించి అద్దె మొత్తాన్ని మరింత పెంచాలని కోరుతూ.. సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు.
ఏపీఎస్‌ఆర్‌టీసీ (APSRTC)లో అద్దె బస్సులు నేరుగా భాగం కావు. కానీ ఆర్టీసీ తన సొంత బస్సులతో పాటు, అద్దె (Hire on Rental) పద్ధతిలో ప్రైవేట్ బస్సులను కూడా నడుపుతుంది. మార్చి 2025 నాటికి సుమారు 2,779 అద్దె బస్సులు ఉన్నట్లు సమాచారం. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించేందుకు సీఎం చంద్రబాబు ఇటీవల ఆదేశాలు ఇచ్చారు. ఇది ప్రైవేట్ భాగస్వామ్యానికి సూచన.
ఏపీఎస్‌ఆర్‌టీసీ అనేది ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ బస్సులను తమ నెట్‌వర్క్‌లో భాగం చేస్తుంది లేదా వాటిని నిర్వహించడానికి ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది.
ఇలాఉంటే ప్రయివేటు బస్సుల యజమానులతో ఆర్టీసి యాజమాన్యం ఈ మధ్యాహ్నం 4గంటలకు సమ్మె నివారణ చర్చలు జరుపనుంది.
Next Story

