మొన్న కర్నూలు, ఇవాళ మార్కాపురం, ఎంతకాలం ఈ ఘోరాలు?
x

మొన్న కర్నూలు, ఇవాళ మార్కాపురం, ఎంతకాలం ఈ ఘోరాలు?

ఏదైనా ఘోరం జరిగినపుడు హడావిడి చేయడం మినహా నిరంతర నిఘా, తనిఖీలు ఉండవా? ప్రయాణీకుల ప్రాణాలంటే ఇంత చులకనా?


ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటు బస్సులు ప్రయాణీకుల ప్రాణాలను బలిగొంటున్న తీరు కలవరపరుస్తోంది. కర్నూలు దుర్ఘటన మరువక ముందే మార్కాపురం వద్ద మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు 15 మందిని బలిగొంది.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ప్రయాణికుల పాలిట యమపాశాలుగా మారుతున్న తీరు తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. నియంత్రణ లోపం, అధికారుల నిర్లక్ష్యం వెరసి, రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. కర్నూలు దుర్ఘటన తాలూకు విషాద ఛాయలు ఇంకా పూర్తిగా తొలగిపోకముందే, తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో చోటుచేసుకున్న ఘోర ప్రైవేటు బస్సు ప్రమాదం 15 మంది అమాయక ప్రయాణికుల ప్రాణాలను బలిగొంది. చీమకుర్తి నుంచి కంకర లోడుతో అతివేగంగా వస్తున్న టిప్పర్, పలకల క్వారీల మలుపు వద్ద బస్సును ఢీకొట్టడంతో చెలరేగిన మంటల్లో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది.

కర్నూలు సమీపంలో దగ్ధమైన ప్రైవేటు బస్సు (ఫైల్)

ఈ ఘోర ప్రమాదం వెనుక అధికారుల ఘోర వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డు భద్రతా నియమాలను పట్టించుకోకుండా, కాలం చెల్లిన వాహనాలను తిప్పుతున్న ట్రావెల్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే వాదన బలంగా వినబడుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే హడావుడి చేయడం, ఆ తర్వాత చేతులు దులుపుకోవడం ఆనవాయితీగా మారిందని, శాశ్వత పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టకపోవడమే ఈ తరహా దుర్ఘటనల పునరావృతానికి కారణమని ప్రజలు మండిపడుతున్నారు.
ముఖ్యంగా ప్రమాదానికి గురైన బస్సు పరిస్థితిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ నుండి పామూరు వైపు వెళ్తున్న ఈ హరికృష్ణ ట్రావెల్స్ బస్సు గత పదేళ్లుగా అనేకసార్లు మరమ్మతులకు లోనైందని సమాచారం. సరైన ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండానే, కేవలం ప్రయాణికుల నుండి భారీగా ఛార్జీలు వసూలు చేస్తూ, వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి వాహనాలపై రవాణా శాఖా అధికారులు తనిఖీలు చేపట్టకపోవడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి టిప్పర్ అతివేగమే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినప్పటికీ, ఫిట్‌నెస్ లేని బస్సు కూడా ప్రమాద తీవ్రతను పెంచినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో 15 మంది అక్కడికక్కడే సజీవ దహనం కాగా, చికిత్స పొందుతూ మరికొందరు చనిపోయారు. అధికారులు తక్షణమే స్పందించి, ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల ఫిట్‌నెస్, రవాణా నిబంధనల అమలుపై కఠినంగా వ్యవహరించకపోతే మరిన్ని ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.
ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేయడం ఆ తర్వాత వదిలివేస్తుండడం వల్లే ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయి.
జగన్ సంతాపం
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు ప్రమాదం పట్ల దిగ్భాంతి వ్యక్తం చేశాడు.




Read More
Next Story