
ఏపీకి ‘దావోస్-26’ ఎలా అర్ధమయింది?
తొమ్మిది సార్లు బాబు, ఒక్క సారి జగన్ దావోస్ వెళ్లారు, అయితే మరి తేడా ఏమిటి?
ఈ ఏడాది దావోస్-‘26 వార్తల్లో ‘బ్లూదావోస్’ అనేది ఏపీలో వినిపించలేదు. ఐక్య రాజ్యసమితి దీన్ని ‘ఇయర్ ఆఫ్ వాటర్’గా ప్రకటించడంతో, ఈ ఏడాది డిసెంబర్లో జరిగే ‘యూ.ఎన్. వాటర్ కాన్ఫరెన్స్’ (UN Water Conference)కు దావోస్ సదస్సును దానికి ముందస్తు భూమికగా చేయాలనేది డబ్ల్యూ.ఇ.ఎఫ్. (WEF) యోచన. అయితే, దావోస్ సదస్సుకు ప్రభుత్వం తరపున వెళ్ళేప్పుడు ఆ ఏడాది ‘థీమ్’ ముందుగా తెలుసుకుని, అందుకు తగినట్టుగా తగిన కసరత్తు ముందే ఇక్కడ పూర్తిచేసుకుని ‘ప్లానింగ్’ ఉన్నవాళ్ళు ఎవరైనా వెళతారు. ఈ ఏడాది ‘థీమ్’లో ఆంధ్రప్రదేశ్ కు నేరుగా అనుసంధానం అయ్యే అంశాలు రెండు ఉన్నప్పటికీ అటువంటి ప్రయత్నం మనవైపు నుండి జరగలేదు.
ఆ రెండింటిలో మొదటిది ‘వాటర్ ఎకో సిస్టం’ (Water Ecosystem)ఇందులో- సముద్ర జలాలు త్రాగునీరుగా మార్చడం, జీవనోపాధుల కల్పన, ఆహారం, వాతావరణ అంశాలు. ఇది వెయ్యికి పైగా కి.మీ పొడవు సముద్ర తీరమున్న మనకు నేరుగా వర్తించేది. రెండవది- ఏడాది పొడవునా గ్రామీణ మహిళలు ఉపాధి కోసం ఆధారపడే వ్యవసాయ రంగం. డబ్ల్యూ.ఇ.ఎఫ్. దీన్ని ‘ఇయర్ ఆఫ్ వుమెన్ ఫార్మర్-2026’ అని ప్రకటించింది. దీని లక్ష్యం వ్యవసాయం ‘అగ్రి ఫుడ్ సిస్టమ్స్’గా పరివర్తన చెంది, క్షేత్ర స్థాయిలో పంట ఉత్పత్తి నుంచి దాని చివరి ఆహార ఉత్పత్తి వాణిజ్యం వరకు అంతా ‘ఆమె’ కేంద్రీతంగా జరగాలనేది ఉద్దేశ్యం.
భౌగోళికంగాను, ‘డెమోగ్రాఫిక్’ గాను మనం ఎంతమేర ఈ రెండింటికీ అనుసంధానం అవుతాము అనే విషయంలో మళ్ళీ కొత్తగా విడమర్చి చెప్పడానికి ఏమీ లేదు. విభజన తర్వాత పదేళ్ళ ఆంధ్రప్రదేశ్ లో మొదలైన పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, నిర్మాణం ‘కోస్టల్ కారిడార్లు’ పేరుతో మొదలైన తీర కేంద్రీత అభివృద్ది ప్రణాళికలు గురించి తెలిసిందే, అలాగే గత వైసీపీ ప్రభుత్వంలోనే కొత్తగా ‘ఫుడ్ ప్రాసెసింగ్’ అనేది ఒక ప్రభుత్వశాఖగా మారింది. అందువల్ల టిడిపి ప్రభుత్వంలో ఆ శాఖకు ఒక మంత్రి కూడా ఉన్నారు. అటువంటప్పుడు ఈ ఏడాది డబ్ల్యూ.ఇ.ఎఫ్. ‘థీమ్’కు తగినట్టుగా మన ముఖ్యమంత్రి దావోస్ లో వీటిని ‘ప్రజెంట్’ చేశారా లేదా అంటే, అటువంటిది సమాచారం ఇప్పటికి వెలువడలేదు.
సిఎం హోదాలో చంద్రబాబు 1999-2004 మధ్య ఏపీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఐదు సార్లు, విభజన తర్వాత 2014-19 మధ్య నాలుగుసార్లు దావోస్ వెళ్లారు. ఇక ఆయన కుమారుడు నారా లోకేష్ ( Nara Lokesh) గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా ఒకసారి ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా మరోసారి వెళ్లారు. ఇక ‘కోవిడ్’ కారణంగా 2023లో జరిగిన సదస్సుకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి హాజరు అయ్యారు. అయితే, ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల పనితీరులోని ప్రధానమైన వ్యత్యాసం ఎలా ఉంటుంది అనేది ‘దావోస్’ సందర్భంలో తెలుగునాట ఆలోచనపరులు తెలుసుకోవడం ఎంతైనా అవసరం. అదికూడా ‘దావోస్’ వార్తలు ఇంకా మన జ్ఞాపకంలో నుంచి చెరిగిపోక ముందే అవి తెలియడం మంచిది.
ఎందుకిది అవసరం అంటే, రెండు పార్టీల ప్రభుత్వాలు మధ్య రాజకీయ స్పర్ధ సహజంగా ఉంటుంది. అయితే, విదేశాల్లో అది కూడా అంతర్జాతీయ వాణిజ్య వేదికలమీద మా రాష్ట్ర ప్రాధాన్యతలు ఇవి అని, మనం వేటిని అక్కడ చూపిస్తున్నామో... అంతిమంగా అస్సలు మనం ఏమిటో? ఇటువంటి వేదికలు వెల్లడిస్తాయి. దాన్నిబట్టి మనకు లభించే గౌరవం కూడా ఉంటుంది. అస్సలు ఎక్కడైనా సరే, ప్రభుత్వంలో (ప్రజాప్రతినిధులు) ‘లెజిస్లేచర్’ అధికారులు (‘బ్యూరోక్రసీ’)తో కలిసి ఒక పని చేస్తే, అది ఎలా ఉంటుంది, అలా కానప్పుడు అది ఎలా ఉంటుంది, అనే దానికి ఏపీలో టిడిపి, వైసీపీ ఇద్దరు ముఖ్యమంత్రుల ‘దావోస్’ పర్యటన ఒక ‘గ్లోబల్’ స్థాయి ఉదాహరణ.
జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళింది ఒక్కసారే అయినా, ‘కోవిడ్’ విపత్తు మధ్యలో కూడా ఏడాది ముందుగా అందుకు ప్రభుత్వంలో ముందస్తు కసరత్తు జరిగింది. విశాఖపట్టణంలో 7 మే 2020 న 12 మంది మరణానికి కారణమైన ఎల్.జి. పాలిమర్స్ ‘గ్యాస్ లీక్’ వంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, ఇకముందు తయారీ రంగంలో మేము ‘డబ్ల్యూ.ఇ.ఎఫ్.’ ఆంక్షలు విధిగా అమలుచేస్తూ ‘నెట్ జీరో మాన్యుఫ్యాక్చరింగ్’ పరిశ్రమలకు మా ప్రాధాన్యత అనే హామీతో ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ హామీతో మే 2022 నాటికి ‘డబ్ల్యూ.ఇ.ఎఫ్.’ వేదికపై ‘ఫ్లాట్ ఫార్మ్ పార్టనర్’గా మన రాష్ట్రం తన స్థాయిని పెంచుకొంది. అందువల్లనే కీలక రంగాలైన విద్య, హెల్త్ కేర్, నైపుణ్యాభివృద్ది, ‘డీ కార్బనైజ్డ్ ఎకానమీ’కి బదిలీ వంటి అంగీకారంతో మన రాష్ట్రం దావోస్ వేదికపై క్రియాశీల భాగస్వామ్యం పొందగలిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2023 సదస్సుకు ముందు వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రసిడెంట్ బెర్జే బ్రెండే పంపిన సందేశంలో- “మీరు ఆంధ్రప్రదేశ్ ను పారదర్శకత పునాదులుపై నిర్మించడం అనేది ఎంతైనా గమనించాల్సిన అంశం. అధికార కేంద్రాల్ని వికేంద్రీకరించడం, టెక్నాలజీలో వినూత్న విధానాలను ప్రవేశపెట్టడంలో మీ నిబద్దత ప్రసంసనీయం” అంటూ లేఖ రాశారు. (Mr. Berge Brende President of WEF said- “YOUR commitment to building Andhra Pradesh on the foundations of transparency, the decentralization of power, and technological innovation is noteworthy”)
అయినా పారిశ్రామిక ప్రతిపాదనలు ఒక రాష్ట్రం నుంచి వచ్చినా, లేక ఒక దేశం నుంచి వచ్చినా, తయారీరంగ పరిశ్రమలు విషయంలో ఇప్పుడు గతానికి భిన్నంగా- WEF వైఖిరి దృఢంగా ఉంది. ఇకముందు పరిశ్రమలు- ‘తదుపరి దశ’ (Advanced Manufacturing and Value Chains) శ్రేణిలోనే ఉండాలనేది- ‘ఫోరం’ ఆంక్షలు. ఇప్పటి పరిశ్రమలకు- ‘గ్లోబల్ నెట్ వర్క్’ తప్పనిసరి. ఆయా దేశాల్లో లేదా రాష్ట్రాల్లో ప్రధాన పరిశ్రమ రంగంతో పోటీపడేలా- ‘ఎం.ఎస్.ఎం.ఇ.’ల సామర్ధ్యాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. తయారీ రంగంలో పనిచేసే ఉద్యోగులు కార్మికులకు- ‘అప్ స్కిల్’, ‘రీ స్కిల్’ పెంపొందే చర్యలు తప్పనిసరి. ఇందులో ఇంకా- ‘నెట్ జీరో మాన్యుఫ్యాక్చరింగ్’, ‘పోర్టు’లను అభివృద్ధి చేయడం ద్వారా ‘గ్లోబల్ వాల్యు చైన్’ వసతి కల్పించడం, ప్రధానమైన అంశాలుగా ఉన్నాయి.
ఒకప్పడు 200 ఏళ్ల పాటు సాగిన బ్రిటిష్ వారి- ‘పోర్టు కేంద్రిత’ పరిపాలనలో మద్రాస్ ప్రెసిడెన్సీ పాలనలో ‘సర్కార్ జిల్లాలు’గా పిలువబడిన ఆంధ్రప్రదేశ్ 2014లో జరిగిన రాష్ట్ర విభజన తర్వాత 2022 నాటికి కొత్త జిల్లాల విభజనతో సరికొత్త- ‘సామాజిక ప్రయోగశాల’ అయింది. ప్రపంచ వాణిజ్యం విషయంలో ‘బ్లర్రింగ్ ఆఫ్ బౌండ్రీస్’ (హద్దులు చెరిపేయడం) లక్ష్యంగా పనిచేస్తున్న డబ్ల్యూ.ఇ.ఎఫ్ దృష్టి నుంచి (అప్పటికి 9 ఏళ్ల క్రితం ఏర్పడిన) ఆంధ్రప్రదేశ్ ను చూసినప్పుడు; రాష్ట్ర ప్రభుత్వం ‘రాజ్యం’ చివరి మైలు వద్దకు చేరడం, అనే లక్ష్యంతో ఉన్నట్టుగా అది దావోస్ సదస్సు వద్ద తనను తాను చూపించుకునే ప్రయత్నం చేసింది.
దావోస్ లో ‘యునిసెఫ్’ ఆద్వర్యంలో జరిగిన ‘డబ్ల్యూ.ఇ.ఎఫ్.’ పబ్లిక్ సెషన్స్ లో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి ‘కోవిడ్’ సమయంలో ఏపీలో పటిష్టం చేయబడిన వైద్య ఆరోగ్య వ్యవస్థలు ద్వారా ప్రతి 50 కుటుంబాలకు ఒక ‘వాలెంటీర్’ ద్వారా సేవలు అందిస్తున్న తరహాలో 44 కుటుంబాలను ఒక యూనిట్ గా ప్రతి కుటుంబాన్ని ‘లొకేట్’ చేసిన విధానాన్ని ఆ సెషన్స్ లో వివరించారు. ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రులు ఏర్పాటు చేసి, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజి ఏర్పాటు గురించి వివరించారు.
మారుతున్న ప్రభుత్వాల ప్రాధాన్యతల కారణంగా ‘దావోస్’ సదస్సు ఒక్కొక్కరికి ఒక తీరుగా కనిపించడం మనం చూస్తున్నాము. మానవీయ ‘తత్త్వం’ లోతుల్లోకి చూడలేక, ‘దావోస్ సదస్సును కేవలం పెట్టుబడుల సేకరణ వేదిక స్థాయికి కుదించడం కూడా చూస్తున్నాము. చివరికి 2026 నాటికి అక్కడి నిర్వాహకులు దాన్ని ‘బ్లూ దావోస్’ అంటుంటే, మనకు దాని ఊసులేకపోగా, చివరికి ఏపీ రాజకీయాలకు వేదికగా దాన్ని మార్చి రాష్ట్ర స్థాయిని తెలుగు వారి పరపతిని కూడా ఈ ఏడాది ఏమార్చారు.

