కామాంధుడికి 20 ఏళ్ల కఠిన శిక్ష..చట్టం వదిలిపెట్టదు: ఎస్పీ హెచ్చరిక
x
ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు

కామాంధుడికి 20 ఏళ్ల కఠిన శిక్ష..చట్టం వదిలిపెట్టదు: ఎస్పీ హెచ్చరిక

బాధితురాలి భవిష్యత్తు కోసం ప్రభుత్వం తరపున రూ. 3 లక్షల పరిహారం ప్రకటించారు.


పిల్లలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, అఘాయిత్యాలకు ఒడిగట్టినా చట్టం తన ఉక్కుపాదాన్ని మోపుతుందని, నేరస్తులు ఎంతటి వారైనా సరే.. చట్టం నుంచి త ప్పించుకోవడం అసాధ్యం అని ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, తీవ్రంగా హెచ్చరించారు. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన శిక్ష పడిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అసలేం జరిగింది?

ఘటన వివరాల్లోకి వెళ్తే.. సింగరాయకొండ మండలం, మూలకుంట పాడు గ్రామానికి చెందిన కళ్ళగుంట హరి (22) అనే యువకుడు, 2019 జనవరి 14న తన ఇంటి వద్ద ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారిపై కన్నేశాడు. ఆ పసిపాపను బలవంతంగా మేడపైకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తక్షణమే స్పందించారు. అప్పటి ఒంగోలు SDPO రాధేష్ మురళీ నేతృత్వంలో విచారణ చేపట్టి, నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. పోలీస్ బృందం పక్కాగా సేకరించిన సాక్ష్యాలు, పోక్సో మానిటరింగ్ టీం చేసిన నిరంతర కృషి నిందితుడి మెడకు ఉరితాడులా చుట్టుకున్నాయి.

కోర్టు తీర్పు.. భారీ జరిమానా

పోక్సో మానిటరింగ్ టీం పక్కా ఆధారాలను కోర్టు ముందు ఉంచింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు బలమైన వాదనలు వినిపించగా, నేరం నిరూపితమైంది. దీంతో న్యాయమూర్తి కె.శైలజ నిందితుడికి 20 సంవత్సరాల కఠిన జైలు శిక్ష, రూ. 10,000 జరిమానా విధించారు. అంతేకాకుండా, బాధితురాలి భవిష్యత్తు కోసం ప్రభుత్వం తరపున రూ. 3 లక్షల పరిహారం (Compensation) ప్రకటించారు. శిక్షతో పాటు బాధితురాలికి భరోసా కల్పించారు.

తల్లిదండ్రులూ జాగ్రత్త

ఈ తీర్పు అనంతరం ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ.. సమాజానికి కొన్ని కీలక సందేశాలు ఇచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై, వారి ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఏదైనా ఇబ్బంది ఎదురైతే భయం లేకుండా తల్లిదండ్రులకు చెప్పేలా పిల్లలను ప్రోత్సహించాలి. ఆడపిల్లల జోలికి వస్తే చట్టం ఏ స్థాయిలో స్పందిస్తుందో ఈ తీర్పే నిదర్శనమని ఎస్పీ స్పష్టం చేశారు. కేసును సమర్థవంతంగా వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావును, కోర్ట్ లైజన్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ తరహా తీర్పులు సమాజంలో నేరస్తులకు గుణపాఠంగా మారుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Read More
Next Story