భూమి మీది..హక్కు మీది..భద్రత మాది: సీఎం చంద్రబాబు
x

భూమి మీది..హక్కు మీది..భద్రత మాది: సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని 16,816 గ్రామాల్లో రీ-సర్వే ప్రక్రియ వేగవంతం.


భూమి అనేది కేవలం ఆస్తి మాత్రమే కాదు.. అది ఒక కుటుంబానికి జీవనాధారం, భద్రత, గౌరవం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బాపట్ల జిల్లా సూరేపల్లిలో గురువారం నిర్వహించిన మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో ఆయన పాల్గొని, లబ్ధిదారులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో భూ రికార్డుల విషయంలో జరిగిన తప్పిదాలను సరిదిద్ది, రైతులకు పూర్తి భరోసా కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

బ్లాక్ చైన్ టెక్నాలజీతో భూములకు రక్షణ
రికార్డులు ట్యాంపరింగ్‌కు గురికాకుండా అత్యున్నత సాంకేతికతను వాడుతున్నట్లు సీఎం వెల్లడించారు. బ్లాక్ చైన్, క్యూఆర్ కోడ్: రికార్డుల భద్రత కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని, సులువుగా గుర్తించేందుకు క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సాధారణ కాగితంలా కాకుండా, కరెన్సీ ముద్రణలో వాడే సాంకేతికతనే పాసు పుస్తకాల తయారీలో వాడామని, వీటిని ఎవరూ ఫోర్జరీ చేయలేరని స్పష్టం చేశారు. యజమాని అనుమతి లేకుండా ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా డిజిటల్ లాక్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు వివరించారు.
గత పాలనపై ధ్వజమెత్తుతూ..
వైసీపీ పాలనలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని చంద్రబాబు విమర్శించారు. ఆస్తి మీది.. కానీ పట్టా పుస్తకంపై ఫొటో మాత్రం జగన్‌ది.. ఇదెక్కడి న్యాయం? అని ఆయన నిలదీశారు. గత ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో భూ వివాదాలకు తెరలేపి, ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఇప్పటివరకు 21.23 లక్షల కొత్త పాసు పుస్తకాలు అందించిందని, జూలై నాటికి మరో 9 లక్షల పుస్తకాలు ఇస్తామని, మొత్తంగా 1.12 కోట్ల పుస్తకాలు పంపిణీ చేయడమే లక్ష్యమని చెప్పారు.
అవినీతి రహిత సర్వే.. యజమాని సమక్షంలోనే
ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా పాసు పుస్తకాలు అందించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని సీఎం పేర్కొన్నారు. భూ యజమాని సమక్షంలోనే సర్వే నిర్వహించి, ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేశాకే పట్టా ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 16,816 గ్రామాల్లో రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేసి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు.
పెట్టుబడులు, ఉద్యోగాలే లక్ష్యం
రాష్ట్ర అభివృద్ధిపై స్పందిస్తూ.. రాబోయే కాలంలో రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 23 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. విధ్వంసమైన వ్యవస్థలను మళ్లీ దారిలో పెట్టి, మహిళలకు రక్షణ ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Read More
Next Story