
మహాపాపం మీదే : సజ్జల
లడ్డూ వివాదంపై కూటమి సర్కార్‌కు సజ్జల కౌంటర్
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం కేవలం రాజకీయ దురుద్దేశంతోనే దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఖరిపై నిప్పులు చెరిగారు.
భక్తుల మనోభావాలను దెబ్బతీసిన పాపం చంద్రబాబుదే
శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చేసిన అసత్య ప్రచారం కోట్లాది మంది భక్తులను దిగ్భ్రాంతికి గురిచేసిందని సజ్జల ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్రమైన ప్రసాదంపై అబద్ధపు బురదజల్లి చంద్రబాబు మహాపాపం చేశారు. ఈ తప్పుడు ప్రచారానికి ఆయనే బాధ్యత వహించాలి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి భక్తుల విశ్వాసాలతో ఆడుకుంటున్న చంద్రబాబును ప్రజాక్షేత్రంలో బోనులో నిలబెట్టాల్సిన అవసరం ఉంది అని ఆయన డిమాండ్ చేశారు.
తేలిపోయిన అబద్ధాలు.. బయటపడ్డ ల్యాబ్ రిపోర్టులు
చంద్రబాబు చేసిన ఆరోపణలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని సజ్జల స్పష్టం చేశారు. రెండు జాతీయ ల్యాబ్ రిపోర్టులు సైతం చంద్రబాబు ఆరోపణలు తప్పని స్పష్టంగా తేల్చాయి. వాస్తవాలు ఇలా ఉన్నా, చంద్రబాబు క్షమాపణ చెప్పకపోగా.. ఇంకా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేసి వైఎస్సార్‌సీపీపై నిందలు వేయడం రాజకీయ కుట్రలో భాగమే అని ఆయన విమర్శించారు.
పవన్ కళ్యాణ్ విషప్రచారంపై ఆగ్రహం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరును కూడా సజ్జల తీవ్రంగా తప్పుబట్టారు. తిరుమల లడ్డూపై పవన్ కళ్యాణ్ విపరీతంగా దుష్ప్రచారం చేశారని, చివరికి అయోధ్యకు కూడా కల్తీ లడ్డూలు పంపారంటూ విషప్రచారం చేయడం అత్యంత దారుణమని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం దేవుడిని, ప్రసాదాన్ని వాడుకోవడం కూటమి నేతలకే చెల్లిందని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.

