పాప ప్రాణం తీసిన బొమ్మ..ఇది ఎవరి పాపం?
x

పాప ప్రాణం తీసిన బొమ్మ..ఇది ఎవరి పాపం?

పార్కులో ఏర్పాటు చేసిన సిమెంట్‌ బొమ్మలకు కనీసం పునాది కూడా నిర్మించకుండా నేల మీద ఊరికే ఉంచారు.


ఆ చిన్నారి కళ్ళలో వెయ్యి ఆశలు.. అడుగుల్లో పసిప్రాయపు తడబాటు.. నవ్వుతూ ఆడుకుంటూ అనంతలోకాలకు వెళ్లిపోయింది. నిన్నటి దాకా తోటి విద్యార్థులతో కలిసి సందడి చేసిన ఆ గొంతుక, నేడు మూగబోయింది. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం జి.పెదపూడి ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ ఘోరం.. వ్యవస్థలోని నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపుతోంది. డెబ్బై కిలోల బరువున్న సిమెంట్‌ జింక బొమ్మ రూపంలో మృత్యువు దాడి చేయడంతో జాహ్నవి (7) అనే పసిపాప ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.


ఆట కాదు..అది మృత్యుపాశం

శుక్రవారం మధ్యాహ్నం భోజనం ముగించుకున్న జాహ్నవి, సరదాగా పాఠశాల ఆవరణలోని పార్కుకు వెళ్లింది. అక్కడే ఉన్న సిమెంట్‌ జింక బొమ్మపై ఎక్కి కాసేపు ఆడుకుంది. కిందకు దిగుతున్న సమయంలో, పునాది లేని ఆ భారీ బొమ్మ ఒక్కసారిగా ఆ చిన్నారిపై పడిపోయింది. సుమారు 70 కిలోల బరువున్న ఆ సిమెంట్‌ దిమ్మ నేరుగా జాహ్నవి ఛాతిపై పడటంతో, ఆ లేత ప్రాణం విలవిలలాడిపోయింది. అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించేలోపే ఆ చిన్నారి కన్నుమూసింది.

అమ్మమ్మ ఒడిలో ఉంటూ అనంత తీరాలకు

విజయవాడలో ఉండాల్సిన జాహ్నవి, అక్కడే ఉన్న అమ్మమ్మ సత్యవతి వద్ద ఉంటూ చదువుకుంటోంది. సత్యవతి అదే స్కూల్‌లో వంట మనిషిగా పని చేస్తోంది. అప్పుడే భోజనం తినిపించాను.. సరదాగా నవ్వుతూ వెళ్ళింది. ఇంతలోనే ఇలా జరిగిందేమ్మా అంటూ ఆ అమ్మమ్మ విలపిస్తున్న తీరు చూస్తుంటే అక్కడి వారి కళ్లు చెమర్చుతున్నాయి. సంక్రాంతికి వచ్చి రెండు రోజుల క్రితమే విజయవాడకు వెళ్లిన తల్లిదండ్రులకు, తమ బిడ్డ ఇక లేదన్న వార్త పిడుగుపాటులా తగిలింది.

నిర్లక్ష్యం ఎవరిది?

ఈ దారుణ ఘటన కేవలం ఒక యాదృచ్ఛిక ప్రమాదం మాత్రమే కాదు. అడుగడుగునా పేరుకుపోయిన అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. పాఠశాల ఆవరణలోని పార్కులో ఏర్పాటు చేసిన భారీ సిమెంట్‌ బొమ్మలకు కనీసం పునాది కూడా నిర్మించకుండా, నేలపైనే ఉంచడం అధికారుల అజాగ్రత్తను స్పష్టం చేస్తోంది. ఈ బొమ్మల వల్ల ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చని స్థానికులు గతంలోనే పలుమార్లు హెచ్చరించినా, అధికారులు పెడచెవిన పెట్టారనే ఆరోపణలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. వీటికి తోడు, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఐదు తరగతులకు కలిపి ఒకే టీచర్‌ ఉండటంతో, మధ్యాహ్న సమయంలో విద్యార్థుల కదలికలపై సరైన నిఘా కరువైంది. పటిష్టమైన భద్రతా చర్యలు లేకపోవడం, హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం వెరసి, అభం శుభం తెలియని ఒక చిన్నారి ప్రాణాన్ని బలితీసుకున్నాయి.

ఇది ఎవరి పాపం?

పిల్లల భద్రతను గాలికొదిలేసిన అధికారులదా? లేక నాణ్యత లేని పనులు చేసిన కాంట్రాక్టర్లదా? ఎవరో చేసిన తప్పిదానికి, నిండు నూరేళ్లూ జీవించాల్సిన ఆ చిన్నారి బలవ్వడం ఊహించలేని విషాదం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్సై శివకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read More
Next Story