కుప్పకూలిన ఫ్రెంచ్ ప్రభుత్వం.. ఇబ్బందుల్లో మాక్రాన్
ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీలో మాక్రాన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కుప్పకూలింది. ఫార్ రైట్ - లెప్ట్ వింగ్ కలిసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ప్రధాని బార్నియర్..
బడ్జెట్ విషయంలో తలెత్తిన వివాదాలతో ఫ్రెంచ్ ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధానమంత్రి మిచెల్ బార్నియర్ పై పార్లమెంట్ లో ఫార్ రైట్- లెప్ట్ వింగ్ లు కలిసి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టగా ఆయన ప్రభుత్వం అవసరమైన మెజారిటీ సాధించలేకపోయింది.
దాదాపు 70 సంవత్సరాల తరువాత ఫ్రెంచ్ ప్రభుత్వం కూలిపోయింది. 1962 లో అప్పటి ప్రధాని జార్జెస్ పాంపిడౌ, అతని మంత్రులు కొన్ని ఆరోపణలతో బలవంతంగా రాజీనామా చేశారు. తరువాత బార్నియర్ ప్రభుత్వమే కూలిపోయింది. జాతీయ అసెంబ్లీ 331 ఓట్ల తీర్మానంతో తీర్మానాన్ని ఆమోదించింది.
అతి తక్కువ కాలం ప్రధానమంత్రి
సంప్రదాయవాది అయిన బార్నియర్ ఫ్రాన్స్ ఆధునిక రిపబ్లిక్‌లో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రిగా రికార్డులకెక్కాడు. సెప్టెంబర్ 5న పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన కేవలం 91 రోజులు మాత్రమే ప్రధానిగా ఉన్నారు. ఫ్రెంచ్ ప్రజలకు గౌరవప్రదంగా సేవ చేయడం నాకు గొప్ప గౌరవంగా మిగిలిపోతుందని ఓటింగ్ కు ముందు బార్నియర్ అన్నారు.
జాతినుద్దేశించి ప్రసంగించనున్న ఇమాన్యుయెల్..
కొన్ని నెలల వ్యవధిలోనే నియమించిన ప్రభుత్వాలు వరుసగా కుప్పకూలిపోవడంతో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ప్రసంగించనున్నారు. అయితే ఏ విషయంలో మాట్లాడతారనే విషయంలో మాత్రం అధ్యక్ష కార్యాలయం ఎలాంటి వివరాలు అందించలేదు. అప్పటి వరకూ బార్నియర్ అధికారికంగా రాజీనామా చేస్తారని భావిస్తున్నారు.
రాజకీయ సంక్షోభం
ఫ్రెంచ్ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో ఫ్రాన్స్ తో పాటు, యూరోపియన్ యూనియన్ కూడా సంక్షోభంలో పడినట్లు అయింది. ఈయూలో రెండో అతి పెద్ద దేశం ఫ్రాన్స్. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ ను ఆమోదించలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పటు అయ్యే వరకూ అధ్యక్షుడు తన విశేష అధికారాలను ఉపయోగించనున్నారు. ఇప్పటికే జర్మనీలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడం, డొనాల్డ్ ట్రంప్ తిరిగి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఈయూకు కష్టకాలం దాపురించిందనే చెప్పాలి.
ప్రభుత్వం ఎందుకు కూలిపోయింది..
చాలాకాలం తరువాత రైట్ వింగ్ కు జాతీయ అసెంబ్లీలో భారీగా సీట్లు సాధించింది. అయితే లెప్ట్ వింగ్, మధ్యవాదులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు అయింది. వచ్చే ఏడు బడ్జెట్ లో బార్నియర్ చేసిన కొన్ని ప్రతిపాదనలతో స్వపక్షం, విపక్షంలోనూ తీవ్ర వ్యతిరేకత ప్రబలింది.
బార్నియర్ పౌరులపై పొదుపు చర్యలు ప్రకటించడం, అది కూడా ఏకంగా 60 బిలియన్ యూరోలు కావడం, అలాగే ఎన్నికల హామీలు అమలు చేయట్లేదని కూటమి మధ్య లుకలుకలు ప్రారంభం అయ్యాయి. ఇదే సమయంలో జాతీయ వాదులు ర్యాలీలతో పోరాటాలు ప్రారంభించారు. వీరికి లెప్ట్ వింగ్ జతకలిసింది.
మాక్రాన్ కు సవాలు..
ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ జూన్‌లో ముందస్తు ఎన్నికలను సిద్దం అయ్యారు. ఆయనే ప్రస్తుత సంక్షోభానికి కారణమని విశ్లేషకుల మాట. జూన్ లో జరిగిన ఎన్నికల తరువాత ఆయన రెండో ప్రధానమంత్రిని నియమించాల్సి ఉంటుంది. ఫ్రెంచ్ రాజ్యాంగం ప్రకారం వచ్చే జూలై వరకూ ఎన్నికలు నిర్వహించడానికి వీలులేదు.
కానీ ఆయన పార్టీకీ సరైన బలం లేకపోవడంతో పార్లమెంట్ లో ఆయన ప్రభుత్వానికి చిక్కులు తప్పవు. దీనికి పరిష్కారంగా మేక్రాన్ రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమ పరిష్కారంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మేక్రాన్ ఎటువంటి రాజకీయ ఎత్తులు వేస్తారనేది చెప్పడం కష్టం.
ఇటీవలి సౌదీ అరేబియా పర్యటనలో, మాక్రాన్ తన రాజీనామా గురించి చర్చలను "మేక్-బిలీవ్ పాలిటిక్స్"గా అభివర్ణించారు."నేను ఫ్రెంచ్ ప్రజలచే రెండుసార్లు ఎన్నికైనందున నేను ఇక్కడ ఉన్నాను" అని మాక్రాన్ అన్నారు. అంతేకాకుండా, ప్రజలు "ఇలాంటి వాటితో భయపడవద్దని. మనకు బలమైన ఆర్థిక వ్యవస్థ ఉంది" అని కూడా ఆయన అన్నారు.
ఆర్థిక పతనం
ఫ్రాన్స్‌లో రాజకీయ అస్థిరత "ఆర్థిక మార్కెట్లలో కల్లోలం రేపింది." అని అంతర్జాతీయ వార్తా సంస్థ నివేదిక పేర్కొంది. రాజకీయ అనిశ్చితి ఫ్రెంచ్ సావరిన్ బాండ్లు, స్టాక్‌లలో పెట్టుబడిదారులను కలవరపెడుతోందనే కథనాలు వెలువడుతున్నాయి.
అంతేకాకుండా ఫ్రాన్స్ తీసుకున్న రుణాలు గ్రీస్ తో సమానంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ఫ్రెంచ్ ఆర్థిక పరిస్థితిని కష్టాల్లో ఉన్నట్లు తెలియజేస్తున్నాయి.
అయితే, ఫ్రాన్స్ మరీ అధ్వాన్న స్థితిలో లేదని, ఎందుకంటే దాని బాకీలు చాలా సంవత్సరాలుగా చెల్లించాల్సిన అవసరం లేదని, జర్మన్ ప్రభుత్వ బాండ్ల కొరత కారణంగా దాని బాండ్లకు డిమాండ్ ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కానీ యూరోపియన్ యూనియన్ ఒత్తిడి కారణంగా, ఫ్రాన్స్ తన భారీ రుణాన్ని తగ్గించుకోవడానికి కూడా పని చేయాల్సి ఉంటుంది.
దేశ ద్రవ్యలోటు ఈ ఏడాది స్థూల దేశీయోత్పత్తిలో 6 శాతానికి చేరుకుంటుందని అంచనా వేయగా, వచ్చే ఏడాదికి 7 శాతానికి చేరుకుంటుందని భావిస్తున్నారు.
Next Story