
కోడి గెలుస్తూనే ఉంది
చట్టాలు.. ఆంక్షలు.. హెచ్చరికలు.. అన్నింటినీ తోసిరాజని ప్రతి ఏటా ’బరి‘ తెగింపులు సాగుతూనే ఉన్నాయి.
ముందు నుంచి అనుకున్నదే జరిగింది. పోలీసుల హెచ్చరికలు.. కోర్టుల ఆంక్షల ముందు కోడిపుంజు కాలి కత్తే పైచేయి సాధించింది. మొన్నటి వరకు ఆంక్షల పేరుతో హడావుడి చేసిన యంత్రాంగం.. సంక్రాంతి సంబరాలు మొదలవ్వగానే మిన్నకుండిపోవడంతో పందెం రాయుళ్లు బరితెగించారు. నిబంధనలు కాగితాలకే పరిమితం కాగా.. ఉభయ గోదావరి నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా వరకు పందెం బరులు జాతరలను తలపిస్తున్నాయి. అదుపుతప్పిన మద్యం విక్రయాలు, మినీ క్యాసినోలుగా మారిన జూదశాలలు, కోట్లాది రూపాయల కరెన్సీ కట్టల మధ్య చట్టం చతికిలపడగా.. అంతిమంగా బరిలో ’కోడి‘ గెలుస్తూనే ఉంది.
ఒకప్పుడు కేవలం సంప్రదాయ కోడిపందేలకే పరిమితమైన బరులు, ఇప్పుడు హద్దులు దాటి అదుపుతప్పిన జూదశాలలుగా రూపాంతరం చెందాయి. నిడదవోలు, రాజానగరం, కడియం మండలాల్లో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ ఏర్పాట్లు చేయడం గమనార్హం. కేవలం పందేలు చూడటానికే కాకుండా.. జూదరులను ఆకర్షించేలా ఇక్కడ ప్రత్యేక గ్యాలరీలు.. హైటెక్ టెంట్లు.. రకరకాల తినుబండారాల స్టాల్స్‌తో మినీ స్టేడియాలను తలపిస్తూ బరుల వద్ద కోలాహలం నెలకొంది. ఈ ప్రాంతాలు ఇప్పుడు పల్లెటూరి వాతావరణాన్ని విస్మరించి, విలాసవంతమైన జూద కేంద్రాలుగా మారిపోయాయి.
ఏరులై పారుతున్న మద్యం.. కోట్లాది రూపాయల విలయం
బరుల వద్ద వినోదం పేరుతో వికృత క్రీడ సాగుతోంది. పందేలు జరిగే చోటే నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక మద్యం కౌంటర్లు వెలిశాయి. ’తాగిన వారికి తాగినంత‘ అన్న చందంగా మద్యం విక్రయాలు జోరుగా సాగుతుండటంతో పందెం రాయుళ్లు మత్తులో జోగుతున్నారు. ఆర్థిక లావాదేవీల విషయానికొస్తే, అది ఒక పెను విలయంలా కనిపిస్తోంది. ఒక్క రాజానగరం నియోజకవర్గంలోనే ఏకంగా 35 బరులు ఏర్పాటు కాగా, విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక్కో బరిలో సుమారు 5 కోట్ల రూపాయల వరకు నగదు చేతులు మారుతోంది. క్షణాల వ్యవధిలో సామాన్యుల జేబులు ఖాళీ అవుతుంటే.. నిర్వాహకుల గల్లా పెట్టెలు నిండుతున్నాయి.
రాజకీయ అండ.. పోలీసుల నిశ్శబ్దం
ఈసారి కోడిపందేల జోరు వెనుక బలమైన రాజకీయ అండదండలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. కూటమి నేతల ప్రత్యక్ష ప్రోత్సాహంతో పందేలు మునుపెన్నడూ లేని స్థాయిలో విచ్చలవిడిగా సాగుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో మినీ క్యాసినోలు.. రామవరప్పాడులో భారీ స్టేడియాలు వెలియడమే దీనికి నిదర్శనం. ఇక తూర్పుగోదావరి జిల్లా జంబుపట్నంలో పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. ఇక్కడ టీడీపీ-జనసేన నేతల మధ్య పొడసూపిన విభేదాల కారణంగా ఏకంగా రెండు వేర్వేరు బరులను పోటీ పడి మరీ ఏర్పాటు చేయడం గమనార్హం. కడియం వీరవరం, తాళ్లపూడి మలకపేట బరుల్లో విజేతలకు అక్షరాల ’బుల్లెట్‘ వాహనాలను బహుమతులుగా ప్రకటిస్తూ నిర్వాహకులు తమ బరితెగింపును ప్రదర్శిస్తున్నారు.

