
బొజ్జన్నకొండపై గుహల వద్ద బౌద్ధ భిక్షువులు
బొజ్జన్నకొండపై కను(మ)ల పండువుగా బౌద్ధమేళా!
అనకాపల్లి జిల్లా బొజ్జన్నకొండపై బౌద్ధ బిక్షువుల సందడితో కనుమ పండుగ కనుల పండువుగా జరిగింది.
అది దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన బౌద్ధారామం. వేల సంవత్సరాల క్రితం ఒక వెలుగు వెలిగిన ప్రదేశం. అలాంటి విశిష్టత కలిగిన ఆ ప్రదేశానికి ఏటా ఒకసారి కనుమ పండుగ నాడు బౌద్ధ భిక్షువులు వస్తారు. అక్కడ బౌద్ధ మేళా నిర్వహించి పూజలు చేసి వెళ్తారు. అలా వారు ఈ ఏడాది కూడా వచ్చారు. ప్రత్యేక పూజలు చేసి సందడి చేశారు. కనుమ పండుగ సందర్భంగా ఏటేటా జరిగే జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కనుమ పండుగను కనుల పండువుగా మార్చారు.
బొజ్జన్నకొండకు రెండు వేల ఏళ్ల చరిత్ర..
అనకాపల్లి జిల్లా కేంద్రం అనకాపల్లికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని శంకరంలో ఉంది బొజ్జన్నకొండ. అనకాపల్లి ఆవిర్భావానికి ముందే ఈ బౌద్ధ క్షేత్రం ప్రాముఖ్యతను కలిగి ఉంది. 1907–1908 మధ్య జరిగిన పురావస్తు తవ్వకాల్లో ఈ బొజ్జన్నకొండ, లింగాలకొండల సముదాయం బయటపడింది. ఆ తవ్వకాల్లో పలు మట్టిపాత్రలు, పెద్ద ఇటుకలు, బంగారు, వెండి, రాగి నాణాలు, అరుదైన వస్తువులు లభ్యమయ్యాయి. రాతితో చెక్కిన ఆరు అందమైన గుహల సముదాయం ఇది. బుద్ధుని విగ్రహంతో పాటు బౌద్ధ సన్యాసుల ధ్యాన స్థూపాలు కూడా ఇక్కడున్నాయి. క్రీస్తుశకం 4వ శతాబ్దకాలంలో బౌద్ధం ఇక్కడ విరాజల్లింది. దేశంలోని అత్యంత విలువైన వారసత్వ నిర్మాణాలో నేటికీ చెక్కు చెదరకుండా నిలిచింది. పురావస్తు శాఖ అధీనంలో ప్రముఖ బౌద్ధ పర్యాటక కేంద్రంగానూ భాసిల్లుతోంది. బౌద్ధంలోని మూడు దశలైన మహాయాన, హీనయాన, వజ్రయానలకు సంబంధించి ఇక్కడి గుహలు, చైత్యాలు, స్థూపాలపై పలు వివరాలు కనిపిస్తాయి.
శుక్రవారం బౌద్ధ భిక్షువులు ఏం చేశారంటే?
కనుమ పండుగ రోజైన శుక్రవారం అతి ప్రాచీన బౌద్ధ పర్యాటక కేంద్రమైన బొజ్జన్నకొండకు దేశ, విదేశాల నుంచి బౌద్ధ భిక్షువులు వచ్చారు. వీరితో పాటు విశాఖ బౌద్ధ సంఘాల సమాఖ్య సభ్యులు, బౌద్ధ అభిమానులు, బౌద్ధ ఉపాసకులు కూడా ఉదయం బొజ్జన్నకొండ దిగువ మెట్ల నుంచి బౌద్ధ పతాకాలతో కొండపై ఉన్న ప్రధాన స్థూపం వరకు పంచశీల శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొండపై ఉన్న గుహలో బౌద్ధ స్థూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి బుద్ధ భగవానుడికి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. బుద్ధునికి పూలు, పండ్లు, మిఠాయిలు సమర్పించారు. బుద్ధుని సూక్తులను ప్రభోదించారు. బుద్ధుని అహింస, శాంతి, సత్యం, శీలం, ధర్మ మార్గాలను ప్రతి ఒక్కరు ఆచరించి ప్రపంచ శాంతికి దోహదపడాలని హితోపదేశం చేశారు. బుద్ధుని శాంతి మార్గమే శరణ్యమని తెలియజేశారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మహా బౌద్ధ మేళాను నిర్వహించారు. అనంతరం కొండ దిగువన సభా సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రపంచ శాంతికి బౌద్ధమే శరణ్యం..
బౌద్ధ సభా సమావేశంలో బౌద్ధ భిక్షువులు మాట్లాడుతూ బుద్ధ భగవానుడు సర్వ మానవ వికాసానికి, ప్రపంచ శాంతిఇ తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప తత్వవేత్త అని కొనియాడారు. ఆయన ఆశయ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగి ప్రపంచ శాంతికి దోహదపడాలని కోరారు. బౌద్ధ సంఘాల సమాఖ్య గౌరవాధ్యక్షుడు డాక్టర్ మాటూరి శ్రీనివాస్ మాట్లాడుతూ బొజ్జన్న కొండ విశిష్టత, ప్రాముఖ్యతలను వివరించారు. రాష్ట్ర బుద్ధిస్ట్ సొసైటీ అధ్యక్షుడు వై.హరిబాబు మాట్లాడుతూ బౌద్ధం అంటే మానవుల్లో మంచిని మాత్రమే ప్రభోదించే తత్వ మార్గమని, బుద్ధుని జీవిత సత్యాన్ని తెలుసుకుని మానవత్వాన్ని పెంపొందించుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానిత అతిథులుగా డాక్టర్ జ్ఞానదీప్ మహాథేరో (బుద్ధ గయ), రజ ధమ్మాజీ (మయన్మార్), కంటి మార మోజీ (కంబోడియా), వన్నెత్ చట్‌జీ (కంబోడియా), బౌద్ధ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు గొంది నవీన్, కార్యదర్శి పి.సిద్ధార్థ, సిద్ధార్థ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బల్లా నాగభూషణం తదితరులు హాజరయ్యారు
బొజ్జన్నకొండపై కనుమ తీర్థం..
ప్రతి సంవత్సరం బొజ్జన్నకొండపై కనుమ రోజున తీర్థం (జాతర) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అనకాపల్లి జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనం ఈ జాతరకు తరలివస్తారు. కొండపై ఉన్న బుద్ధుని స్థూపాన్ని దర్శించుకుంటారు. ఈ ఏడాది కూడా వివిధ ప్రాంతాల నుంచి పెద్దలు, పిల్లలు పెద్ద సంఖ్యలో వచ్చి జాతరలో పాల్గొన్నారు.
Next Story

