
బీఎండబ్ల్యూ కారుతో ఫోజిస్తున్న గజదొంగ మహేష్‌రెడ్డి
ఆ లగ్జరీ దొంగ బీఎండబ్ల్యూ కారులో షికార్!
సాఫ్ట్‌వేర్ జాబ్‌కన్నా చోరీలే సో బెటర్ అనుకున్న ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటు పడ్డాడు. చివరకు గాజువాక పోలీసులకు చిక్కాడు.
లగ్జరీ లైఫ్ అనుభవించాలని చాలామంది కోరుకుంటారు. అందుకోసం కష్టపడి ఉన్నత చదువులు చదివో, ఉన్నతోద్యోగం సంపాదించో లేక వ్యాపార రంగంలోనో రాణించాలనో తపిస్తారు. తాను అనుకున్నది సాధించడానికి రేయింబవళ్లు శ్రమిస్తారు. కానీ ఈ యువకుడు మాత్రం అలా అనుకోలేదు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగంతో ఎన్నాళ్లు సంపాదిస్తే బీఎండబ్ల్యూ కారు కొంటాను? కొంపలు కొల్లగొడితే కోరుకున్న విలాసవంత జీవితాన్ని అనుభవించవచ్చు అనుకున్నాడు. అనుకోవడమే కాదు.. అమలు చేసేశాడు కూడా! ఆసక్తిని రేపే అ అగ్జరీ దొంగ గురించి తెలిస్తే మీరూ షాకవుతారు మరి!
హైదరాబాద్‌లో ఓ ఐటీ సంస్థ వద్ద ఇలా..
15 ఏళ్ల ప్రాయం నుంచే చోర వృత్తిలోకి..
విశాఖపట్నం మాధవదారకు చెందిన అచ్చి మహేష్‌రెడ్డి (27) అలియాస్ సన్నీకి చిన్నప్పట్నుంచే చోరీలంటే మోజు. ఆ మోజుతో 15 ఏళ్ల నుంచే ఆ వృత్తిలోకి అడుగు పెట్టాడు. బాల్యంలోనే విశాఖ పీఎంపాలెం పరిధిలో ఓ నాలుగైదు చోరీలు చేసి పోలీసులకు చిక్కాడు. అప్పట్లో మైనర్ కావడంతో జువైనల్ హోంకు వెళ్లొచ్చాడు. హోం నుంచి విడుదలయ్యాక, మేజర్ అయ్యాక కూడా తన చోర వృత్తికి మరింత పదును పెట్టాడు. ఒకపక్క దొంగతనాలు చేస్తూనే బాగా చదువుకుని పోస్టు గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాడు. చదువు చదువే.. చోరీలు చోరీలే అన్నట్టుగా రెండూ విజయవంతంగా సాగించాడు. కొన్నాళ్ల తర్వాత హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాన్ని సంపాదించాడు. అక్కడ కొన్నాళ్లు జాబ్ చేసినా అది అతనికి తృప్తినివ్వలేదు. దీంతో ఆ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేసి ఫుల్ టైం చోరీలపై దృష్టి పెట్టాడు. రోజు రోజుకూ చోర కళలో రాణిస్తూ ముందుకు దూసుకుపోయాడు. అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 60 దొంగతనాలకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో ఉంటూ అక్కడ చోరీలు చేసేవాడు. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా విశాఖ వచ్చినప్పుడు కూడా వట్టి చేతులతో వెళ్లకుండా దొంగతనాలు చేసి వెళ్లేవాడు.
ముసుగేసుకుని విశాఖలో చోరీకి వచ్చినప్పటి సీసీటీవీ ఫుటేజి
చోరీ సొమ్ముతో బీఎండబ్ల్యూ కారు..
ఎప్పడూ జల్సాగా గడిపే మన మహేష్‌రెడ్డి కన్ను అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కారుపై పడింది. దానిని కొనాలంటే భారీ చోరీలకు పాల్పడాలన్న లక్ష్యంతో ఆ దిశగా ప్లాన్ వేశాడు. మకాంను విశాఖ నుంచి హైదరాబాద్‌కు మార్చేశాడు. ఒక్కసారి కొల్లగొడితే రూ.లక్షలు దోచుకుని వచ్చేవాడు. అలా వచ్చిన సొమ్ముతో బీఎండబ్ల్యూ కారును కొని తన కలను సాకారం చేసుకున్నాడు. ఆ లగ్జరీ కారులో పగలంతా సూటు, బూటూ వేసుకుని, రేబాన్ కళ్లజోడు ధరించి ఓ రేంజ్‌లో తిరిగేవాడు. చూసే వారికి ధనవంతుడి ఇంటి బిడ్డలా టిప్‌టాప్‌గా కనిపించేవాడు. ఏ కోశాన, ఎవరికీ ఈయన గారు దొంగ అనే భావనే కలగకుండా జాగ్రత్త పడేవాడు. ఇలా అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ రాత్రి వేళ తనకిష్టమైన చోరీలకు వెళ్లేవాడు.
అచ్చిగాడు కన్ను పడితే ఇక అంతే..
పగటి పూట బీఎండబ్ల్యూ కారులో షికారుకు వెళ్తున్నట్టు వెళ్లి ధనికులుండే ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించేవాడు. అలా చోరీకి అనుకూలంగా ఉండే ఇంటిని ఎంచుకుని రాత్రి వేళ నంబరు ప్లేటు లేని స్కూటీపై వెళ్లి పని కానిచ్చేసేవాడు. అచ్చి మహేష్‌రెడ్డి కన్ను పడిందంటే ఎలాంటి ఇల్లయినా తెరుచుకోవలసిందే! అన్నట్టుగా చోర కళలో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. ఇందుకోసం అనువుగా ఉండేలా ప్రత్యేకంగా ఒక చోర కిట్‌ను తయారు చేయించుకున్నాడు. ఆ కిట్‌లో ఐరన్ రాడ్, టోపీ, ఫేస్‌మాస్క్, సుత్తి, స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్, డ్రిల్లింగ్ మిషన్ బిట్ వంటివి ఉంటాయి. ఒకసారి చోరీకి వెళ్తే ఫెయిల్ అన్నది సన్నీ హిస్టరీలో లేదని పోలీసులు చెబుతారు.
ముసుగులో వెళ్లడం ఈయన ప్రత్యేకత..
మహేష్‌రెడ్డి చోరీల్లో ఓ ప్రత్యేకత ఉంది. చోరీకి వెళ్లేటప్పుడు పూర్తిగా ముసుగు వేసుకుని చేతులకు గ్లౌజులు ధరిస్తాడు. దీనివల్ల అయనను గుర్తు పట్టడం సాధ్యమయ్యేది కాదు. దీంతో ఎక్కడైనా చోరీ జరిగిన ఇంట్లో ముసుగు వేసుకున్న వ్యక్తి సీసీ టీవీ ఫుటేజీల్లో కనిపిస్తే అది మహేష్‌రెడ్డేనని పోలీసులు నిర్ధారణకు వచ్చేవారు. అందుకే పోలీసులు ఈయనను ముసుగు దొంగ మహేష్‌రెడ్డిగా పేర్కొంటారు. భారీ చోరీలకు పాల్పడే ఈయన పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.
గజదొంగ మహేష్‌రెడ్డి ఎలా చిక్కాడంటే..
గత అక్టోబర్‌లో గాజువాక సమీపంలోని జోగువానిపాలేనికి చెందిన కన్నా శివరామకృష్ణ ఇంట్లో 17 తులాల బంగారం, 30 తులాల వెండి చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాజువాక క్రైం సీఐ కల్లూరి శ్రీనివాసరావు బృందం రంగంలోకి దిగారు. అది ముసుగు దొంగ మహేష్‌రెడ్డి పనేనని నిర్ధారణకు వచ్చారు. ఆధునిక సాంకేతికతతో పాటు మహేష్‌రెడ్డి సన్నిహితుని ద్వారా ఆయన ఆచూకీ కనుగొన్నారు. హైదరాబాద్‌లో ఉన్న మహేష్‌రెడ్డిని పట్టుకుని విశాఖ తీసుకొచ్చారు.
మహేష్‌రెడ్డి చోరీ చేసిన సొత్తును చూపుతున్న విశాఖ సీపీ బాగ్చీ
తెలుగు రాష్ట్రాల్లో 60 చోరీ కేసుల్లో..
మహేష్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో సుమారు 60 చోరీలకు పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. ఈయన కాకినాడ, సర్పవరం, రామచంద్రపురం, ఇంద్రపాలెం, రాజమండ్రి పోలీస్ స్టేషన్ల పరిధిలో 32 చోరీ నేరాలకు పాల్పడ్డాడు. మిగిలినవి ఏపీ, తెలంగాణల్లోని ఇతర ప్రాంతాల్లో చేశాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన మహేష్‌రెడ్డి నుంచి 699 గ్రాముల బంగారం, 3.8 కిలోల వెండి ఆభరణాలతో పాటు బీఎండబ్ల్యూ కారు, స్కూటీ, చోరీ కిట్‌లను స్వాధీనం చేసుకున్నారు. మహేష్‌రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చీ శనివారం నాటి మీడియా సమావేశంలో తెలిపారు.
Next Story

