
జబల్పూర్ జిల్లాలో మత ఘర్షణలు
టియర్ గ్యాస్ ప్రయోగం, 49 మంది అరెస్ట్..
మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ జిల్లా సిహోరా పట్టణంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, ఇప్పటివరకు 49 మందిని అరెస్టు చేశారు. గురువారం రాత్రి ఆజాద్ చౌక్ వద్ద ఉన్న దుర్గాదేవి ఆలయంలో హారతి ఇస్తున్న సమయంలో వాగ్వాదం మొదలైంది. అది కాస్త చివరకు రాళ్లు రువ్వుకునే స్థాయికి చేరింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు విసరడంతో పాటు దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి.
జనసమూహాన్ని చెదరగొట్టి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సుమారు 10టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాల్సి వచ్చిందని పోలీసు సూపరింటెండెంట్ సంపత్ ఉపాధ్యాయ్ తెలిపారు. ముందు జాగ్రత్తగా అదనపు పోలీసు బలగాలను కూడా రప్పించామన్నారు. హింసకు పాల్పడ్డ వారిని గుర్తించి అరెస్టు చేస్తున్నామని అదనపు ఎస్పీ సూర్యకాంత్ శర్మ చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని కలెక్టర్ రాఘవేంద్ర సింగ్ పేర్కొన్నారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని భోపాల్‌లో మంత్రి విశ్వాస్ సారంగ్ హెచ్చరించారు. మసీదుపై నుంచి రాళ్లు విసిరారన్న ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందన్నారు. కాగా శుక్రవారం కొందరు కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. విధ్వంసంలో పాల్గొన్న వారి ఇళ్లను కూల్చివేయాలని డిమాండ్ చేశారు. ఘర్షణలో సుమారు 20 నుంచి 30 మోటార్ సైకిళ్లు, ఐదు కార్లు దెబ్బతిన్నట్లు సమాచారం.

