
'2047 నాటికి ప్రపంచంలో మనమే నెంబర్ -1'
జ్యూరిచ్ లో తెలుగు కమ్యూనిటీ తో చంద్రబాబు
వచ్చే రెండు దశాబ్దాల్లో ప్రపంచంలోనే నంబర్‌వన్ కమ్యూనిటీగా తెలుగువారు ఎదగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. జ్యూరిచ్‌లో జరిగిన తెలుగు ప్రవాసుల ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. 2047 నాటికి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు అగ్రస్థానంలో నిలవాలన్నదే తన లక్ష్యమని ఆయన ఆకాంక్షించారు. దావోస్ పర్యటనలో భాగంగా ఆయన సోమవారం సాయంత్రం జ్యూరిచ్ లో తెలుగు డయాస్పోరాలో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
పెరిగిన తెలుగు వారి ప్రాబల్యం: "1995 నుంచి నేను జ్యూరిచ్ వస్తున్నాను. అప్పట్లో ఇక్కడ తెలుగువారు వేళ్లమీద లెక్కపెట్టేంత మందే ఉండేవారు. కానీ నేడు ఇక్కడ వాతావరణం చూస్తుంటే సొంత గడ్డపై ఉన్నట్లే అనిపిస్తోంది. స్విట్జర్లాండ్‌తో పాటు ఐర్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో వేల సంఖ్యలో తెలుగువారు స్థిరపడటం గర్వకారణం."
ఏపీ బ్రాండ్ ఇమేజ్: గత 18 నెలల్లో ఏపీని నంబర్ వన్ బ్రాండ్‌గా తీర్చిదిద్దామని, 25 కొత్త పాలసీల ద్వారా పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే రావడం గర్వకారణమని సీఎం స్పష్టం చేశారు.
1995లోనే తాను ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తే అప్పట్లో విమర్శించిన వారు ఉన్నారని, కానీ ఆనాటి దూరదృష్టి వల్లే నేడు 195 దేశాల్లో తెలుగువారు అత్యున్నత స్థానాల్లో ఉన్నారని ఆయన గుర్తు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 తెలుగు సంఘాలు ఉన్నాయని, ఎన్‌ఆర్‌టీ (NRT)లో రెండు లక్షల మంది సభ్యులు ఉండటం విశేషమని పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం పట్ల వారిని అభినందించారు.
ఆర్థిక శక్తిగా భారత్: 2028 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, ఈ ప్రయాణంలో యువతే దేశానికి అతిపెద్ద ఆస్తి అని బాబు తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న కమ్యూనిటీగా తెలుగువారు ఎదగడం విశేషమన్నారు.

