
తెలంగాణ పులి..ఆంధ్రాలో ’హల్చల్‘
ఈ కవ్వాల్ టైగర్ ఇప్పటికే ఐదు ఆవులను బలితీసుకుంది. పులి సంచాల దృశ్యాలు కెమెరా ట్రాప్‌కు చిక్కడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
రాష్ట్ర సరిహద్దులు మనుషులకే కానీ.. నాకేం కావన్నట్టుగా తెలంగాణ బెబ్బులి ఆంధ్రప్రదేశ్ అడవుల్లో గంభీరంగా అడుగుపెట్టింది. అటు ఆదిలాబాద్ ’కవ్వాల్‘ అడవుల నుంచి బయలుదేరిన ఈ మృగరాజు.. పాపికొండల మీదుగా ఏలూరు జిల్లా మన్యం గ్రామాల్లోకి చేరి పెను అలజడి సృష్టిస్తోంది. జాతీయ స్థాయిలో పులుల గణన జరుగుతున్న తరుణంలోనే, తన ఉనికిని చాటుకుంటూ వరుస దాడులతో ఐదు ఆవులను బలితీసుకోవడం స్థానికులను హడలెత్తిస్తోంది. దారి తప్పి వచ్చిందో.. కొత్త ఆవాసం కోసం వెతుకుతూ వచ్చిందో ఏమో కానీ, ఆ ’తెలంగాణ పులి‘ సంచారంతో ఏపీ అటవీ గ్రామాల జనం ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
కవ్వాల్ నుంచి కావడిగుండ్ల మీదుగా పాపికొండల అడవుల గుండా ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిన ఈ పులి.. బుట్టాయగూడెం మండలంలోని అంతర్వేదిగూడెం, నాగులగూడెం గ్రామాల్లో పశువుల మందలపై దాడి చేసింది. ఇప్పటివరకు ఐదు ఆవులను చంపి రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. శనివారం తెల్లవారుజామున నాగులగూడెంలో ఆవు కళేబరాన్ని తింటుండగా, అటవీశాఖ ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌కు ఈ పులి చిక్కింది.
గజగజ వణుకుతున్న మన్యం
ఈ భారీ పులి సంచారంతో బుట్టాయగూడెం, దెందులూరు, చల్ల చింతలపూడి, పందిరిమామిడి గూడెం వంటి మన్యం గ్రామాలు భయం గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. పొలాల గట్లపై, ఇంటి పరిసరాల్లో పులి అడుగుజాడలు కనిపిస్తుండటంతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుతం మిరప, మొక్కజొన్న కోతల సమయం కావడంతో పొలాలకు వెళ్లాల్సిన రైతులు, కూలీలు ప్రాణభయంతో ఇళ్లకే పరిమితమవుతున్నారు. సాయంత్రం 6 గంటలు దాటితే చాలు.. ఊర్లకు ఊర్లే కర్ఫ్యూ విధించినట్లుగా నిర్మానుష్యంగా మారుతున్నాయి. జనవాసాల మధ్యే మృగరాజు తిరుగుతుండటంతో గిరిజన పల్లెల్లో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
యుద్ధప్రాతిపదికన అటవీశాఖ చర్యలు.. ప్రత్యేక కంట్రోల్ రూం
పరిస్థితి విషమిస్తుండటంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి ఏలూరులో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు అత్యాధునిక కెమెరాలను అమర్చడంతో పాటు, దానిని సురక్షితంగా బంధించేందుకు బోన్లను కూడా సిద్ధం చేశారు. గ్రామాల్లో డప్పు చాటింపులు వేయిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ ఒంటరిగా బయటకు రావద్దని, పశువులను మేత కోసం అడవి వైపు తీసుకెళ్లవద్దని అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
కుచించుకుపోతున్న అడవులు..పెరుగుతున్న ఘర్షణలు
పులుల గణన 2026 ప్రక్రియ తుది దశకు చేరుకున్న తరుణంలో ఈ పులి వలస రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పోడు సేద్యం వల్ల అడవులు కుచించుకుపోవడం, వన్యప్రాణుల సహజ ఆవాసాలు దెబ్బతినడమే పులులు జనవాసాల వైపు రావడానికి ప్రధాన కారణమని వన్యప్రాణి నిపుణులు విశ్లేషిస్తున్నారు. పులి-మనిషి మధ్య ఈ ఘర్షణ పెరగడం ఆందోళనకరమని, తక్షణమే శాస్త్రీయంగా పులిని సురక్షిత ప్రాంతానికి తరలించాలని నిపుణుడు ఏ. శంకరన్ సూచించారు.

