రాష్ట్ర విభజనపై లోక్‌సభలో మళ్లీ రగడ
x
ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్ర విభజనపై లోక్‌సభలో మళ్లీ రగడ

టీడీపీ లావు వర్సెస్ కాంగ్రెస్ మల్లు


లోక్ సభలో రాష్ట్ర విభజన మరోసారి ప్రతిధ్వనించింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సభ్యులు మరోసారి తలపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తీరు అన్యాయం అని తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు నిన్న చేసిన ప్రసంగాన్ని ఇవాళ (11-3-2026) కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మల్లు రవి ఖండించారు.
నిన్న లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ..రాష్ట్ర విభజన అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2014 ఫిబ్రవరి 14న ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును లోక్‌సభలో ఆమోదించిన తీరును ఆయన "ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన చీకటి రోజు"గా అభివర్ణించారు.
విభజన బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో లోక్‌సభ టీవీ ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేయడం, తలుపులు మూసివేసి అడ్డగోలుగా వ్యవహరించడం వంటివి అప్పట్లో కాంగ్రెస్ చేసిన అరాచకాలేనని గుర్తు చేశారు. విభజనను వ్యతిరేకించినందుకు అప్పట్లో తమ పార్టీకి చెందిన 18 మంది ఎంపీలను సస్పెండ్ చేసినా, తాము ఎప్పుడూ స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టలేదని, కానీ ఇప్పుడు విపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు.
ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న వారు నాడు ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఇది కేవలం "హెడ్ లైన్స్" కోసం చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇందులో వాస్తవం లేదని కొట్టిపారేశారు. నాడు రాష్ట్ర విభజన జరిగిన తీరును "అరాచకం"గా పేర్కొంటూ, దానిపై ప్రత్యేక చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
దీనిపై తెలంగాణలో పలువురు రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో లోక్ సభలో మల్లురవి ఇవాళ మాట్లాడుతూ.. లావు శ్రీకృష్ణ దేవరాయలు వ్యాఖ్యలను ఖండించారు.
“తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం అనేది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు. దశాబ్దాలుగా కొనసాగిన ప్రజల ఉద్యమం ఫలితంగా తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రజలు అనేక సంవత్సరాలు పోరాటం చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. పార్లమెంట్ ఆ పోరాటాన్ని గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. అందువల్ల తెలంగాణ ఏర్పాటును ఇప్పుడు తప్పుగా చూపించడం సరైంది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. ప్రజల మధ్య విభేదాలు పెంచేలా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలి.” అన్నారు.
దీనికి స్పందించిన లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇలా అన్నారు.. “2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన విధానం సరైన పద్ధతిలో జరగలేదు. ఆ సమయంలో పార్లమెంట్‌లో జరిగిన ఘటనలను దేశం మొత్తం చూసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విభజన బిల్లును వ్యతిరేకించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును ముందుకు తీసుకువచ్చింది. పార్లమెంట్‌లో కూడా తలుపులు మూసి పెట్టి, ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసి బిల్లును ఆమోదించారు అని వివరించారు.
ఫిబ్రవరి 14, 2014 భారత పార్లమెంట్ చరిత్రలో ఒక బ్లాక్ డేగా మిగిలిపోయింది. ఆ రోజు జరిగిన ఘటనలు ప్రజాస్వామ్యానికి సరైన ఉదాహరణ కావు. అందుకే ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం గురించి పార్లమెంట్‌లో పూర్తి చర్చ జరగాలి. రెండు రాష్ట్రాల ప్రజలకు న్యాయం జరిగేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి” అన్నారు లావు శ్రీకృష్ణ దేవరాయలు.
Read More
Next Story