
పన్ను చెల్లింపుదారుల చూపంతా కొత్త బడ్జెట్‌పైనే..
వరుసగా తొమ్మిదో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Budget) ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఎనిమిది బడ్జెట్ల(Budget)లో పన్ను విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్‌గా మార్చుతూ వరుసగా ఉపశమనాలు ఇచ్చిన మోదీ ప్రభుత్వం, ఈసారి వేతన జీవులు, పెన్షనర్లు, పొదుపుదారులపై మరిన్ని రాయితీలు ప్రకటిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
గత ఏడాది బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులను ఆశ్చర్యానికి గురిచేశారు. వార్షికంగా రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ఆదాయపు పన్ను మినహాయింపు కల్పిస్తూ కీలక ప్రకటన చేశారు. ఈ నిర్ణయానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి.
ఈ సారి పన్ను విధానంలో మార్పులుంటాయా?
2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంలో పొదుపులు, బీమా ప్రీమియాలు, మెడిక్లెయిమ్ ఖర్చులు, గృహ రుణ వడ్డీ వంటి అంశాలపై ఉన్న పన్ను మినహాయింపులను తొలగించారు. ప్రారంభ దశలో కొత్త విధానంలో ప్రామాణిక మినహాయింపు కూడా లేకపోవడంతో, చాలా మంది పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానాన్నే ఎంచుకున్నారు.
అయితే, 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నంలో భాగంగా, వార్షికంగా రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పూర్తి పన్ను ఉపశమనం కల్పించారు. అలాగే, కొత్త విధానంలో రూ.50,000 ప్రామాణిక మినహాయింపును కూడా ప్రకటించారు. ఈ చర్యలతో కొత్త పన్ను విధానం పన్ను చెల్లింపుదారులకు మరింత అనుకూలంగా మారింది.
రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు..
ప్రధాని మోదీ(Narendra Modi) వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, జూలై 2024లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ మరో కీలక ప్రకటన చేశారు. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి ప్రామాణిక మినహాయింపును రూ.50వేల నుంచి రూ.75వేలకు పెంచారు. ఈ ప్రయోజనం పూర్తిగా కొత్త పన్ను విధానానికే పరిమితం చేశారు.
అదే సమయంలో ఆదాయపు పన్ను స్లాబ్‌లలో కూడా మార్పులు చేశారు. కానీ కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చిన అతిపెద్ద ప్రకటన 2025-26 బడ్జెట్‌లో వెలువడింది. సంవత్సరానికి రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పూర్తిగా ఆదాయపు పన్ను మినహాయింపును ప్రకటించారు. దీనికి అదనంగా రూ.75వేలు ప్రామాణిక మినహాయింపును కూడా జత చేశారు.
“రూ.12 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పరిమితి ఇప్పుడు రూ.12.75 లక్షలకు పెరిగింది” అని గత బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.
పొదుపులకు ప్రోత్సాహం లేకపోవడంపై విమర్శలు..
కొత్త పన్ను విధానాన్ని ప్రజాదరణ పొందేలా చేయడానికి మోదీ ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా పలు మార్పులు చేసింది. అయితే, పెట్టుబడులు, పొదుపులపై ఆదాయపు పన్ను మినహాయింపులు మాత్రం ఇవ్వలేదు.
దీంతో ప్రజలు పొదుపులను పెంచేందుకు ఆసక్తి చూపడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది ప్రధాని మోదీ నీతి ఆయోగ్‌లో సమావేశం ఏర్పాటు చేయగా, అందులో పాల్గొన్న కొందరు ఆర్థికవేత్తలు ప్రజలను మరింత పొదుపు చేయడాన్ని ప్రోత్సహించేందుకు పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. అయితే, ఈ అంశంపై నిపుణుల మధ్య ఏకాభిప్రాయం ఏర్పడలేదు.
చార్టర్డ్ అకౌంటెంట్, మాజీ ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT) న్యాయమూర్తి గోపాల్ కేడియా ‘ది ఫెడరల్’తో మాట్లాడుతూ, పొదుపులపై పన్ను మినహాయింపులకు తాను వ్యతిరేకమని తెలిపారు.
“పొదుపుల పేరిట పన్ను మినహాయింపులు ఇవ్వడం చట్టపరమైన వివాదాలకు దారితీస్తుంది. ఐటీఆర్‌లు దాఖలు చేసే సమయంలో ప్రజలు పొదుపులపై తప్పుడు వివరాలు ఇచ్చి మినహాయింపులు క్లెయిమ్ చేస్తారు. కొందరు అసలు లేని రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చినట్లు చూపించి కూడా పన్ను రాయితీలు పొందుతున్నారు” అని ఆయన చెప్పారు.
పొదుపులపై పన్ను మినహాయింపులు కోరుకునే వారికి పాత పన్ను విధానం ఇప్పటికీ అందుబాటులో ఉందని ఆయన స్పష్టం చేశారు.
పన్ను విధానంలో కొనసాగుతున్న మార్పులు..
కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకోవడంతో, అది ఇప్పుడు డిఫాల్ట్ విధానంగా మారింది. పాత విధానాన్ని ఎంచుకోవాలనుకునే వారు ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో ప్రత్యేకంగా ఎంపిక చేయాల్సి ఉంటుంది.
పాత పన్ను విధానం ద్వారా లభించే ఉపశమనం చాలా పరిమితంగా ఉంది. పన్ను స్లాబ్‌లు లేదా రేట్లలో పెద్ద మార్పులు లేవు. ప్రభుత్వం రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారిపై చెల్లించాల్సిన రూ.12,500 పన్నుపై మాత్రమే రాయితీ అందిస్తోంది.
అయితే, సెక్షన్ 80C కింద పెట్టుబడులు, పొదుపులపై పన్ను మినహాయింపులు పాత విధానంలో కొనసాగుతున్నాయి. రూ.2 లక్షల వరకు గృహ రుణ వడ్డీపై మినహాయింపు, మెడిక్లెయిమ్ ప్రీమియాలపై పన్ను రాయితీ వంటి ప్రయోజనాలు కూడా పాత పన్ను విధానంలో లభిస్తున్నాయి.
భారతదేశ బలం – పొదుపులు..
భారత ఆర్థిక వ్యవస్థకు పొదుపులే ప్రధాన బలం. ఇవే దేశం నిరంతర వృద్ధికి దోహదపడ్డాయి. 1970లలో జీడీపీలో 13 శాతం మాత్రమే ఉన్న గృహ పొదుపులు, 2008 నాటికి 38 శాతానికి చేరుకున్నాయి. ఇది చైనా మినహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు, BRICS దేశాల కంటే అధికం.
అయితే, 2011-12 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 34.6 శాతానికి, 2022-23 నాటికి 29.7 శాతానికి తగ్గింది. ఈ గణాంకాలు భారతదేశంలో గృహ పొదుపులు క్రమంగా తగ్గుతున్నాయని స్పష్టంగా సూచిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రజలు తమ పొదుపులను బ్యాంకుల్లో నిల్వ చేయడం కన్నా, మ్యూచువల్ ఫండ్‌లు, ఈక్విటీలు, బంగారం, రియల్ ఎస్టేట్ వంటి పెట్టుబడుల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
ఈ నేపథ్యంలో, కొత్త పన్ను విధానంలో పెట్టుబడులు మరియు పొదుపులపై పన్ను మినహాయింపులను ప్రభుత్వం ప్రవేశపెడుతుందా? అన్న ప్రశ్నకు సమాధానం ఈ ఆదివారమే దొరుకుతుంది.

