‘డమాస్కస్’ ను ఆక్రమించిన రెబెల్స్..
x

‘డమాస్కస్’ ను ఆక్రమించిన రెబెల్స్..

పారిపోతున్న సమయంలో కుప్పకూలిన అసద్ విమానం?


పశ్చిమాసియాలో మరోసారి నిప్పురవ్వలు రాజుకుంటున్నాయి. ఇన్నాళ్లు సిరియా అధ్యక్షుడిగా ఉన్న బషర్ అల్ అసద్ నుంచి దేశాన్ని చేజిక్కించుకున్నట్లు రెబెల్స్ ప్రకటించారు. ఈ రోజు ఉదయం రాజధాని డమాస్కస్ ను చేరుకుని మొత్తం నగరాన్ని తమ హస్తగతం చేసుకున్నట్లు తిరుగుబాటుదారుల నాయకుడు అంతర్జాతీయ మీడియాకు తెలిపారు.

అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచిపారిపోయినట్లు, ఆయన పారిపోతున్న విమానం మధ్యలో కూలిపోయినట్లు కూడా తిరుగుబాటు దారులు ప్రకటించారు. అయితే ఈ విషయాన్ని ఏ అంతర్జాతీయ సంస్థ కూడా ధృవీకరించలేదు.

"మేము డమాస్కస్ నగరాన్ని నిరంకుశ బషర్ అల్-అస్సాద్ నుంచి విముక్తి చేసినట్లు ప్రకటిస్తున్నాం" అని మిలిటరీ ఆపరేషన్స్ కమాండ్ ఆదివారం (డిసెంబర్ 8) టెలిగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో వివరించింది. ఈ విషయాన్నిCNN ఉటంకించింది. "ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్వాసితులకు, ఉచిత సిరియా మీ కోసం వేచి ఉంది." అని తిరుగుబాటుదారులు తెలిపారు.
తిరుగుబాటుదారులు డమాస్కస్‌లోకి ప్రవేశించారని, డమాస్కస్‌కు ఉత్తరాన ఉన్న అపఖ్యాతి పాలైన సైద్నాయ మిలిటరీ జైలును తమ ఆధీనంలోకి తీసుకున్నామని పేర్కొన్నారు. జైలులో ఉన్న మా ఖైదీలను విడిపించాం. అలాగే ఇతర బందీలకు సైతం విడుదల చేశాం. సిరియాలో ఇక అన్యాయ యుగం ముగిసింది. ఇక నుంచి సిరియన్ ప్రజలతో సంబరాలు జరుపుకుంటామని రాయిటర్స్ తో తిరుగుబాటుదారులు పేర్కొన్నారు.
సిరియాలో అంతర్యుద్దం ప్రారంభమైన తరువాత సైద్నాయాను మానవ కబేళాల ప్రాంతంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించింది. ఇక్కడ వందలాది మంది అసద్ వ్యతిరేకులను ఉరితీసినట్లు ఆ సంస్థ పేర్కొంది.
జూలై 2023 నాటి UN హైకమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ కార్యాలయ నివేదిక ప్రకారం, సైద్నాయాతో సహా సిరియన్ నిర్బంధ క్యాంపుల్లో విస్తృత స్థాయిలో హింస జరిగింది. అనేక మంది నిరసనకారులు ఇక్కడ నుంచి మాయం అయిపోయారు. వారి గురించి ఎలాంటి సమాచారం యూఎన్ కు లభించలేదు.
నగరాల స్వాధీనం..
తిరుగుబాటుదారుల విజృంభణతో సిరియన్ ఆర్మీ పారిపోవడం ప్రారంభించింది. ఇంతకుముందు రెబెల్స్ దేశంలో మూడో అతిపెద్ద నగరమైన హోమ్స్ లోకి ప్రవేశించినట్లు వెల్లడించింది. మధ్యధరా సముద్రం- డమాస్కస్ మధ్య ఉన్న ప్రాంతాలు ప్రాంతమే ప్రస్తుతం అసద్ బలగాల ఆధీనంలో ఉంది. తిరుగుబాటుదారుల నాయకుడు అబూ మొహమ్మద్ అల్-జోలానీ మాట్లాడుతూ.. తన బలగాలు "హోమ్స్, డమాస్కస్‌ చేరుకున్నాయి. రాక్షస పాలన కూల్చివేతకు దగ్గరగా ఉంది" అని ప్రకటించాడు.
సమన్వయంతో కూడిన దాడిలో, ప్రతిపక్ష వర్గాలు ప్రధానంగా డ్రూజ్ జాతి జనాభా కలిగిన నైరుతి నగరమైన స్వీడా, ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్ సమీపంలోని క్యూనీత్రా పట్టణంపై కూడా నియంత్రణ సాధించింది.



Read More
Next Story