
’అన్నగారి‘ తీపి జ్ఞాపకం.. సరికొత్తగా ’బసవతారక కుటీరం‘
’శ్రీకృష్ణపాండవీయం‘ చిత్రంలో ఎన్టీఆర్ పోషించిన సుయోధనుడి గంభీర రూప విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించనున్నారు.
తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, స్వర్గీయ నందమూరి తారక రామారావు (NTR) సినీ సామ్రాజ్యాన్ని ఏలిన రోజుల్లో ఆయనకు ’అదృష్ట దేవత‘గా నిలిచిన చెన్నైలోని చారిత్రక నివాసం మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకోనుంది. దశాబ్దాల కాలంగా కళావిహీనంగా, నిర్వేదంలో మునిగిపోయిన త్యాగరాయనగర్‌లోని ఆ ’వెలుగుల ఇల్లు‘.. ఇప్పుడు తన యజమాని కీర్తిని చాటేలా సరికొత్త శోభను అద్దుకుంటోంది. ఒకప్పుడు తిరుమల వేంకటన్నను దర్శించుకున్న ప్రతి భక్తుడు, తన అభిమాన నటుడిని కనులారా చూసేందుకు క్యూ కట్టిన ఆ గడప.. ఇప్పుడు మరోసారి అభిమానుల సందడి కోసం ముస్తాబవుతోంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, ఎన్టీఆర్ వారసుల నుంచి ఈ ఇంటిని కొనుగోలు చేసిన చదలవాడ బ్రదర్స్, దీనిని ఒక పర్యాటక స్మృతివనంగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు.
అప్పట్లో అదొక వెలుగుల వీధి - వాచ్‌మన్ లేని రక్షణ
చెన్నైలోని త్యాగరాయనగర్ (T Nagar) లోని బజుల్లా రోడ్డు అంటే అప్పట్లో ఒక సినిమా గెలాక్సీ. అక్కడ ఉన్న వెయ్యి గజాల విస్తీర్ణంలోని ఈ ఇంటిని ఎన్టీఆర్ 1953లో తన సతీమణి బసవతారకం గారి పేరిట కొనుగోలు చేశారు. ఈ నివాసం ఆయనకు ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని సినీ వర్గాలు నమ్ముతాయి. అయితే ఈ ఇంటికి మరో ప్రత్యేకత ఉండేది. సరిగ్గా దీనికి ఎదురుగానే దర్శకరత్న దాసరి నారాయణరావు గారి నివాసం ఉండేది. ఆ రెండు ఇళ్ల మధ్య ఉన్న సినీ బంధం ఆ వీధికే కొత్త వెలుగును ఇచ్చేది.
వార్తల్లో నిలిచే ఒక గొప్ప విషయం ఏమిటంటే, ఆ వీధిలో నివసించే ఎవరికీ సెక్యూరిటీ గార్డులు లేదా వాచ్‌మెన్‌ల అవసరం ఉండేది కాదు. దానికి కారణం ఎన్టీఆర్ క్రమశిక్షణ, దాసరి పనితీరు. ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటలకే ఎన్టీఆర్ నిద్రలేచి తన దైనందిన పనులు, యోగా, సాధన మొదలుపెట్టేవారు. అప్పటికే తన ఇంటి లైట్లు వెలుగుతూ ఉండేవి. మరోవైపు, ఎదురుగా ఉన్న దాసరి గారి ఇంట్లో తన టీమ్‌తో కలిసి రాత్రంతా కథా చర్చలు (Story sittings) సాగుతూ ఉండేవి. రాత్రి నుంచి తెల్లవారే వరకు అటు దాసరి ఇంట్లో, తెల్లవారుజాము నుంచే ఇటు ఎన్టీఆర్ ఇంట్లో లైట్లు వెలుగుతూనే ఉండటంతో ఆ వీధి ఎప్పుడూ కాంతితో కళకళలాడుతుండేది. నిరంతరం మనుషుల సంచారం, వెలుగు ఉండటంతో దొంగల భయం ఉండేది కాదని, అందుకే ఆ వీధికి వాచ్‌మన్‌లు అక్కర్లేదని అప్పట్లో స్థానికులు గర్వంగా చెప్పుకునేవారు.
అభిమానుల కోరిక నెరవేరుతోంది.. దశాబ్దాల నిరీక్షణకు తెర
తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు (చెన్నై) నుండి హైదరాబాద్‌కు తరలిరావడం, కాలక్రమేణా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా చెన్నైని వీడటంతో ఆ చారిత్రక నివాసం కొన్నేళ్లపాటు నిరాదరణకు గురైంది. సుమారు 30 మంది వారసుల మధ్య ఉన్న కొన్ని సాంకేతిక .. ఆస్తిపరమైన కారణాల వల్ల ఆ ఇంటికి పూర్వవైభవం తీసుకురావాలనే అభిమానుల ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. అయితే, నందమూరి కుటుంబానికి అత్యంత ఆప్తులు, బంధువులైన చదలవాడ బ్రదర్స్ (తిరుపతిరావు, శ్రీనివాసరావు) ఆ ఇంటిని కొనుగోలు చేయడంతో దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. తమ అభిమాన నాయకుడి జ్ఞాపకాలను పదిలపరచాలనే సంకల్పంతో వారు ఈ బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు.
పునరుద్ధరణ పనుల ప్రత్యేకతలు.. పాత శైలిలో కొత్త మెరుగులు
ప్రస్తుతం ఈ ఇంటికి మరమ్మతు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పునరుద్ధరణలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. ఆనాటి నిర్మాణ శైలిని (Architecture) ఏమాత్రం మార్చకుండా, పాత కాలపు రాజసాన్ని అలాగే ఉంచుతూ తీర్చిదిద్దుతున్నారు. ఇంటి ప్రధాన ద్వారం పైన ఒక అద్భుతమైన ఆకర్షణను ఏర్పాటు చేయనున్నారు. ’శ్రీకృష్ణపాండవీయం‘ చిత్రంలో ఎన్టీఆర్ పోషించిన సుయోధనుడి గంభీర రూప విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించనున్నారు. ఇంటి ముందున్న ఫ్లైఓవర్ పైనుంచి వెళ్లే వాహనదారులకు కూడా ఈ విగ్రహం స్పష్టంగా కనిపించేలా దీన్ని ప్లాన్ చేశారు. పనులు పూర్తయిన తర్వాత, ఇది కేవలం ఒక ఇల్లుగానే కాకుండా.. ఎన్టీఆర్ స్మారక కేంద్రంగా మారనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, పర్యాటకులు లోపలికి వెళ్లి ఆ ఇంటిని సందర్శించేందుకు నిర్వాహకులు అనుమతించనున్నారు.
మళ్ళీ మొదలవనున్న సిరుల జాతర
ఒకప్పుడు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ప్రతి తెలుగువాడు.. మద్రాసు చేరుకుని తమ అభిమాన నటుడు ఎన్టీఆర్‌ను ఈ ఇంటి వద్దే కనులారా చూసి పులకించిపోయేవారు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత అదే వైభవం తిరిగి రానుండటం అటు నందమూరి అభిమానులకు, ఇటు సినిమా ప్రేమికులకు పండుగ లాంటి వార్త. కళావిహీనంగా మారిన ఆ గోడలకు మళ్ళీ రంగులద్ది, సుయోధనుడి విగ్రహంతో ఆ ఇంటికి ’విశ్వవిఖ్యాత‘ శోభను తీసుకురావడమే లక్ష్యంగా చదలవాడ బ్రదర్స్ చేస్తున్న ఈ కృషి ప్రశంసనీయం అంటూ అటు సినీ వర్గాలు, ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

