
TTD: చంద్రబాబును టార్గెట్ చేస్తూ కోర్టుకెక్కిన సుబ్రమణ్యస్వామి
సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు, 23న విచారణ
తిరుమల లడ్డూ వివాదం మరోసారి రాజకీయ వేడెక్కింది. బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నేరుగా టార్గెట్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) నివేదికపై చంద్రబాబు ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించడాన్ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేయడం ద్వారా, స్వామి చంద్రబాబును కోర్టు ధిక్కరణ ఆరోపణలతో లక్ష్యంగా చేసుకున్నారు. ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 23 (సోమవారం) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
వివాదం నేపథ్యంలో చంద్రబాబు పాత్ర
ఈ వివాదం 2024లో మొదలైంది. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం (జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో) హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ (గొడ్డు కొవ్వు వంటివి) కలిసిందని చంద్రబాబు ఆరోపించారు. దేశవ్యాప్తంగా కలకలం చెలరేగింది. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. చంద్రబాబు నాయుడు, ఆ ఆరోపణలను రాజకీయంగా ఉపయోగించుకుని, వైఎస్‌ఆర్‌సీపీపై విమర్శలు గుప్పించారని వైసీపీ ఆరోపించింది. ఈ వ్యవహారమై చంద్రబాబు ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. దాన్ని సవాల్ చేస్తూ సుబ్రమణ్యస్వామి, వైవీ సుబ్బారెడ్డి తదితరులు సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. దానిపై సుప్రీంకోర్టు- CBI-నాయకత్వంలో SITని ఏర్పాటు చేసి, రాజకీయం చేయవద్దని హెచ్చరించింది.
జనవరి 2026లో SIT ఫైనల్ చార్జ్‌షీట్ దాఖలు చేసింది, ఇందులో యానిమల్ ఫ్యాట్ లేదని చెబుతూ సింథటిక్ గీ (పామ్ ఆయిల్ మిక్స్) ఉపయోగించి ఉండవచ్చునని పేర్కొంది. రూ.250 కోట్ల విలువైన నెయ్యిని వాడారని కూడా పేర్కొంది. 36 మంది నిందితులుగా పేర్కొంది. వీరిలో TTD అధికారులు, నెయ్యి సరఫరాదార్లూ ఉన్నారు. సీబీఐ సిట్ నివేదిక తమకు అనుకూలంగా మార్చుకుని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఆందోళనలకు దిగారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
చంద్రబాబును టార్గెట్ చేసిన సుబ్రమణ్యస్వామి పిటిషన్
ఫిబ్రవరి 20న చంద్రబాబు ప్రభుత్వం SIT నివేదికను పరిశీలించడానికి రిటైర్డ్ IAS దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఇది టెండర్ లాప్సెస్, అధికారుల బాధ్యతలు పరిశీలించడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతుంది. కానీ సుబ్రమణ్యస్వామి దీనిని కోర్టు ధిక్కరణగా భావిస్తూ, చంద్రబాబు ప్రభుత్వం SIT సూచనలకు విరుద్ధంగా తమకు అనుకూల నివేదిక కోసం కుట్ర చేస్తోందని ఆరోపించారు.
పిటిషన్‌లో చంద్రబాబును ప్రధాన ప్రతివాదిగా చేర్చి, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, SIT, CBI, TTDలను కూడా లక్ష్యంగా చేశారు. స్వామి గతంలోనూ (2024లో) కోర్ట్-మానిటర్డ్ ప్రోబ్ కోరారు. ఇప్పుడు చంద్రబాబు నిర్ణయాన్ని భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా చూపుతున్నారు.
రాజకీయ ప్రభావం ఎలా ఉండవచ్చు..
వైఎస్‌ఆర్‌సీపీ ఈ ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు దిక్కరణగా, కోర్టుకు జరిగిన అవమానంగా భావిస్తోంది. రాజకీయ టార్గెటింగ్ అంటుంది. ఈనేపథ్యంలో సుబ్రమణ్యస్వామి పిటీషన్ దాఖలైంది. సోమవారం విచారణకు రావచ్చు. సుప్రీంకోర్టు నిర్ణయం TDP వర్సెస్ YSRCP మధ్య మరిన్ని వివాదాలకు దారితీయవచ్చు. భక్తులు, హిందూ సంస్థలు TTDలో ట్రాన్స్‌పరెన్సీ డిమాండ్ చేస్తున్నారు. సుబ్రమణ్యస్వామి ఈ పోరాటంతో చంద్రబాబును రాజకీయంగా ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Next Story

