
హర్యానా: మేళాలో విషాదం
కూలిన ఊయల. రక్షణ చర్యల్లో ఇన్‌స్పెక్టర్ మృతి, 13 మందికి తీవ్రగాయాలు
హర్యానా(Haryana) రాష్ట్రం ఫరీదాబాద్‌లో ప్రమాదం (accident) చోటుచేసుకుంది. సూరజ్‌కుండ్ మేళాలో శనివారం ఓ భారీ ఊయల (Tsunami Swing) విరిగి పడిన ఘటనలో ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్ మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఊయల(swing) ఊడిపోతున్న సమయంలోనే అక్కడే విధుల్లో ఉన్న ఇన్‌స్పెక్టర్ జగ్‌దీశ్ ప్రసాద్.. బాధితులను రక్షించే క్రమంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు. మరో నెల రోజుల్లో జగ్‌దీశ్ పదవీ విరమణ చేయనున్నట్లు తెలిసింది.
ఈ ఘటనలో గాయపడిన వారిలో ఏఎస్సై నీలం, మహేంద్రగఢ్‌కు చెందిన సునీల్, గ్రేటర్ నోయిడాకు చెందిన హర్ష్ ప్రకాశ్, ధోల్పూర్‌కు చెందిన ప్రశాంత్, ఫరీదాబాద్‌కు చెందిన అనీషా, నోయిడా సెక్టార్‌కు చెందిన శివానీ, పర్వీందర్ తదితరులు ఉన్నారు. క్షతగాత్రుల్లో 9 మందిని ప్రైవేట్ ఆస్పత్రులకు, నలుగురిని బీకే ఆస్పత్రికి తరలించారు.
ఇన్‌స్పెక్టర్ జగదీశ్ ప్రసాద్ 1989లో హర్యానా ఆర్మ్డ్ పోలీస్‌లో చేరారు. 36 ఏళ్ల సేవ అనంతరం మార్చిలో పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పిల్లలందరూ ఇంకా చదువుతున్నారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం..
హర్యానా ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి తక్షణ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
పర్యాటక మంత్రి అర్వింద్ శర్మ ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీజీపీ అజయ్ మాట్లాడుతూ .. ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ విధి నిర్వహణలో చూపిన సాహసం, మానవత్వాన్ని ప్రశంసించారు. ఆయన కుటుంబానికి రూ.1 కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అనంతరం క్షతగాత్రులను పరామర్శించారు. మరో పది రోజుల్లో మేళా ముగియనుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

