లడ్డూ పిటిషన్ పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
x

లడ్డూ పిటిషన్ పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని తోసిపుచ్చింది.


తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తిరుమల లడ్డూ వ్యవహారంపై రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తుండటాన్ని ప్రస్తావిస్తూ దానిని నిలిపివేయాలని కోరుతూ ఈ పిటిషన్‌ను మానూరు శ్రీనివాస్ (Manur Srinivas) అనే సామాజిక కార్యక్త దాఖలు చేశారు.

పిటిషన్ ను తోసిపుచ్చుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాలా బాగ్చీ ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే స్వతంత్ర విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశామని, దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో తాము జోక్యం చేసుకోవడం సమంజసం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుపోయేలా వదిలేయాలని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.

నిపుణులా?.. కోర్టు ఘాటు ప్రశ్న
విచారణ సందర్భంగా పిటిషనర్ లడ్డు మీద కొంతమంది పదవుల్లో ఉన్నవాళ్లు చేస్తున్న విమర్శలను కోర్టు దృష్టికి తెచ్చారు.లడ్డులో జంతుకొవ్వులు కలిపారని, కొన్ని కెమికల్స్ వాడుతున్నరని కొందరు అంటున్నారని, ఇలాంటి వాటిని అనుమతిస్తే తీవ్రవర్యవసానాలుండే ప్రమాదం ఉన్నందునతాను సుప్రీంకోర్టుకు ఆశ్రయిస్తున్నానని పిటిషనర్ తెలిపారు. అయితే, పిటిషనర్ లేవనెత్తిన వాదనలపై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. లడ్డూలో జంతువు కొవ్వు కలిసిందని బల్లగుద్ది చెప్పడానికి మీరేమైనా శాస్త్రీయ నిపుణులా? అని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. తగిన ఆధారాలు, శాస్త్రీయ నిరూపణలు లేకుండా చేసే ఆరోపణలను కోర్టు ఉపేక్షించదని ఈ వ్యాఖ్యల ద్వారా తేటతెల్లం చేసింది. రాజకీయంగా లేదా వ్యక్తిగతంగా చేసే వ్యాఖ్యల కంటే, నిష్పక్షపాత విచారణ ద్వారా వచ్చే నిజాలే ముఖ్యమని కోర్టు అభిప్రాయపడింది.
ఆధారాలుంటే సీబీఐకి ఇవ్వండి
అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సీబీఐ పర్యవేక్షణలో సిట్ (SIT) ఏర్పాటు చేశామని కోర్టు గుర్తు చేసింది. పిటిషనర్ వద్ద ఈ వ్యవహారానికి సంబంధించి ఏవైనా ఆధారాలు లేదా సమాచారం ఉంటే, వాటిని బహిరంగంగా చర్చించడం కంటే నేరుగా దర్యాప్తు సంస్థలకే అప్పగించాలని సూచించింది. ఏదైనా ఉంటే సీబీఐ ముందే చెప్పుకోండి అని పేర్కొంటూ, దర్యాప్తు సంస్థలకు ఇచ్చే ఆధారాలకే చట్టబద్ధంగా ప్రాధాన్యత ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
Read More
Next Story