అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు
x

అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ముప్పిడి అవినాశ్ రెడ్డి ఏ-7 నిందితుడిగా ఉన్నాడు.


ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఏ-7 నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టులో పెద్ద ఊరట లభించింది. గత కొంతకాలంగా ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయనకు న్యాయస్థానం రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న తరుణంలో అవినాశ్ రెడ్డికి బెయిల్ లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది.

కస్టడీ విచారణలో కీలక విషయాలు
మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), కోర్టు అనుమతితో అవినాశ్ రెడ్డిని మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఈ విచారణ సందర్భంగా అవినాశ్ రెడ్డి కొన్ని కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి (కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి) పాత్ర, అలాగే ఈ కుంభకోణం ద్వారా అంతిమంగా లబ్ధి పొందింది ఎవరు? అనే కోణంలో అవినాశ్ వివరాలు చెప్పినట్లు తెలుస్తోంది. అవినాష్ రెడ్డి సిట్ కి వెల్లడించిన సమాచారం వైఎస్సర్సీపీ వర్గాల్లో కలకలం రేపుతోందనే చర్చ కూడా ఉంది.
ఆర్థిక లావాదేవీల్లో కీలక పాత్ర
మద్యం కుంభకోణంలో ఆర్థిక నియంత్రణ, నగదు లావాదేవీల నిర్వహణలో అవినాశ్ రెడ్డి కీలక పాత్ర పోషించారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి సన్నిహితంగా ఉంటూ, స్కామ్‌కు సంబంధించిన నిధుల మళ్లింపులో ఆయన చురుగ్గా వ్యవహరించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, ఈ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
Read More
Next Story