
13 మంది అవినీతి అధికారులకు సుప్రీం షాక్..ఏసీబీ విచారణకు పచ్చజెండా
2016-20 మధ్య నమోదైన ఏసీబీ కేసుల విచారణకు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది.
పోలీసు స్టేషన్‌గా గుర్తింపు లేదన్న చిన్న సాంకేతిక సాకుతో అవినీతి అక్రమాలను కప్పిపుచ్చలేరని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన షాకింగ్ తీర్పును తోసిపుచ్చుతూ, 2016-20 మధ్య నమోదైన ఏసీబీ కేసుల విచారణకు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. ఈ కీలక ఉత్తర్వులతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో 13 మంది ఉన్నతాధికారుల చుట్టూ మళ్లీ ఉచ్చు బిగుస్తోంది. ఇకపై ఇలాంటి 'సాంకేతిక' పిటిషన్లను విచారణకు స్వీకరించవద్దంటూ హైకోర్టులకు గట్టి హెచ్చరికలు జారీ చేసిన జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం.. ఆరు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని ఏసీబీని ఆదేశించింది.
2016 నుంచి 2020 మధ్య కాలంలో ఏసీబీలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (CIU) పలువురు అధికారులపై కేసులు నమోదు చేసింది. అయితే, ఆ సమయంలో సి.ఐ.యు కార్యాలయాన్ని ప్రభుత్వం అధికారికంగా 'పోలీసు స్టేషన్'గా గెజిట్ నోటిఫై చేయలేదని, కాబట్టి అక్కడ నమోదైన కేసులకు చట్టబద్ధత ఉండదని నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిని ఏకీభవించిన హైకోర్టు, ఆ ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేస్తూ గతంలో తీర్పునిచ్చింది.
ఏసీబీ వాదనకు బలం:
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏసీబీ తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించారు. కేవలం సాంకేతిక కారణాలను సాకుగా చూపి అవినీతి కేసుల నుంచి తప్పించుకోలేరని, విభజన చట్టం ప్రకారం పాత నిబంధనలే వర్తిస్తాయని వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు, అవినీతిపై విచారణ ఆగకూడదని స్పష్టం చేస్తూ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల విచారణకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ముఖ్యంగా 2016-2020 మధ్య విచారణలో ఉండి, హైకోర్టు ఉత్తర్వులతో ఆగిపోయిన కేసుల్లో ఏసీబీ ఇప్పుడు వేగంగా చార్జిషీట్లు దాఖలు చేసే అవకాశం ఉంది.

