
నిన్న సునీల్ కుమార్ సస్పెన్షన్ పొడిగింపు.. నేడు సునీల్ నాయక్ అరెస్ట్
కేవలం 24 గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండు పరిణామాలు రాష్ట్ర పోలీస్ యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సునీల్ అనే పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ఐపీఎస్ అధికారుల చుట్టూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. ఒకవైపు మాజీ సీఐడీ చీఫ్ పి.వి. సునీల్ కుమార్ సస్పెన్షన్‌ను ప్రభుత్వం పొడిగించగా, మరోవైపు అదే కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ నాయక్‌ను ఏపీ పోలీసులు సోమవారం పట్నాలో అరెస్ట్ చేశారు.
రిటైర్మెంట్ వరకు సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు
1993 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్‌ను ఏపీ ప్రభుత్వం నిన్న (ఆదివారం) పొడిగించింది. ప్రస్తుతం ఆయనపై ఉన్న క్రిమినల్ కేసు విచారణ పూర్తయ్యే వరకు లేదా ఆయన పదవీ విరమణ తేదీ (జూన్ 30, 2026) వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని జీవో విడుదల చేసింది. విదేశీ పర్యటనలు, అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగం, రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసుల్లో ఆయన ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
పట్నాలో ఐజీ సునీల్ నాయక్ అరెస్ట్
రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో రెండో నిందితుడు (A2)గా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను ఏపీ పోలీసులు సోమవారం బిహార్‌లో అరెస్ట్ చేశారు. 2021లో సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్, తనను చిత్రహింసలకు గురిచేశారని ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. ప్రస్తుతం బిహార్‌లో ఫైర్ సర్వీసెస్ ఐజీగా ఉన్న నాయక్‌ను ట్రాన్సిట్ వారెంట్‌పై ఏపీ పోలీసులు రాష్ట్రానికి తీసుకువస్తున్నారు.
అధికారుల గుండెల్లో రైళ్లు.. తదుపరి ఎవరు?
కేవలం 24 గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండు పరిణామాలు రాష్ట్ర పోలీస్ యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారాయి. రఘురామ కేసులో ఇప్పటికే సునీల్ కుమార్, సునీల్ నాయక్‌లతో పాటు మరికొందరు అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. ఈ అరెస్టుతో దర్యాప్తు వేగం పుంజుకుందని, త్వరలోనే మరికొంతమంది ఉన్నతాధికారులపై కూడా చర్యలు ఉండే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
Next Story

