అంగన్ వాడీలకు ఎలక్ట్రికల్ స్టవులు, గ్యాస్ భారం తగ్గినట్టేనా?
x

అంగన్ వాడీలకు ఎలక్ట్రికల్ స్టవులు, గ్యాస్ భారం తగ్గినట్టేనా?

11,400 అంగన్‌వాడీ కేంద్రాలకు ఎనర్జీ ఎఫిషియెంట్ ఇండక్షన్ స్టవ్స్‌తో పాటు నాణ్యమైన వంట సామగ్రిని అందించారు


ఇరాన్-అమెరికా యుద్ధ ప్రభావం అంగన్ వాడీలపైనా పడింది. ఇప్పటికే కట్టెల పొయ్యిలు, గాడి పొయ్యిలపై బడి పిల్లలకు తిండి వండిపెడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇదే అదునుగా కేంద్ర ప్రభుత్వం కూడా క్లీన్ ఎనర్జీ వినియోగంపై దృష్టి సారించమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఏపీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ Energy Efficiency Services Limited (EESL)తో కలిసి అంగన్ వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవుల పంపిణీ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రశంసించింది.

దేశంలోనే తొలి ప్రాజెక్ట్..

రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 55,746 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో మొత్తం 12,18,239 మంది పిల్లలున్నారు. వీరిలో 10,26,580 మంది పిల్లలు అంగన్‌వాడీ కేంద్రాలలో చేరారు. ఈ కేంద్రాలలో 11,448 అంగన్‌వాడీలు స్థానిక పాఠశాలల ప్రాంగణంలోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంగన్‌వాడీల ద్వారా ఏడు నెలల వయస్సు నుంచి ఆరేళ్ల వరకు ఉన్న పిల్లలకు పోషకాహారం అందిస్తోంది. ఈ కేంద్రాలను ఇప్పుడు అంగన్‌వాడీ ప్రీ-స్కూల్స్‌గా పేరు మార్చారు. ఈ ప్రీ-స్కూల్స్‌లో 8,34,595 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.

నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా తొలి దశలో 11,400 అంగన్‌వాడీ కేంద్రాలకు ఎనర్జీ ఎఫిషియెంట్ ఇండక్షన్ స్టవ్స్‌తో పాటు నాణ్యమైన వంట సామగ్రిని అందించారు. మహిళా శిశు సంక్షేమ శాఖతో కలిసి అమలు చేసిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.

రెండో దశకు శ్రీకారం...

మొదటి దశ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు రెండో దశ ప్రారంభమైంది. రాష్ట్రంలో మిగిలిన 44,346 అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా ఇండక్షన్ స్టవ్స్ అందించేందుకు ఆర్డర్లు ఇచ్చారు. మొత్తం 55,746 కేంద్రాలు ఉండగా వాటిలో 6,497 మినీ కేంద్రాలు. వీటికి 100% ఎనర్జీ ఎఫిషియెంట్ ఇండక్షన్ స్టవ్స్‌ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇవి ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలు ఉండే ప్రాంతాల్లోనే ఉన్నాయి.
అసలేమిటీ ప్రాజెక్ట్...
ఈ ప్రాజెక్ట్ ద్వారా భూగర్భ ఇంధన వనరుల వినియోగాన్ని పూర్తిగా తగ్గిస్తూ, పర్యావరణ పరిరక్షణలో రాష్ట్రం ముందంజలో నిలిచింది. అదే సమయంలో మహిళల ఆరోగ్యం, సమయ పొదుపు, భద్రత వంటి అంశాల్లో కూడా ఇది కీలక మార్పు తీసుకువస్తోంది.

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన జాతీయ సమావేశంలో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్, ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్స్ అందించడం ద్వారా ఫాసిల్ ఫ్యూయెల్స్ ను పూర్తిగా తగ్గించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని, ఇది పెద్ద ముందడగని చెప్పారు. అదే శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ ఈ కార్యక్రమాన్ని ఆర్థిక, పర్యావరణ, మహిళా సాధికారత పరంగా ఒక బెంచ్‌మార్క్‌గా పేర్కొన్నారు.
సీఎం ఆదేశాలతో వేగవంతం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ఈ ప్రాజెక్ట్ అమలును వేగవంతం చేయడానికి ఉన్నతాధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, EESL ప్రతినిధులతో కలిసి సరఫరా ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. EESL సీఈఓ అఖిలేష్ కుమార్ దీక్షిత్ కూడా ఈ ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేసి, దేశానికి ఆదర్శంగా నిలపాలని సూచించారు. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలను క్లీన్ ఎనర్జీ మోడల్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఏర్పడిన గ్యాస్ కొరతను అధిగమించే దిశగా ఈచర్య చేపట్టారని తెలుస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు వల్ల LPG సరఫరా పై ఒత్తిడి పెరుగుతుంది. ధరలు పెరగడం, సబ్సిడీ భారం పెరగడం జరుగుతుంది. భవిష్యత్తులో కొరత వచ్చే అవకాశాలను ప్రభుత్వాలు ముందుగానే అంచనా వేస్తాయి. ఈ నేపథ్యంలో గ్యాస్‌పై భారాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయడం సహజమే.
కానీ అసలు ప్రధాన ఉద్దేశం మాత్రం క్లీన్ ఎనర్జీ వైపు ప్రభుత్వ వంట శాలలను మరల్చడంగా భావిస్తున్నారు. గ్యాస్ సమస్య వల్ల మాత్రమే కాదు కానీ భవిష్యత్ సమస్యలను ముందుగానే నివారించే ప్లాన్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటోంది.
క్లీన్ ఎనర్జీ, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత- మూడు రంగాల్లో ఒకేసారి ప్రభావం చూపుతున్న ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశానికి మార్గదర్శిగా నిలుస్తోంది.
Read More
Next Story