ప్రధాని మోదీకి స్టాలిన్ లేఖ..
x

ప్రధాని మోదీకి స్టాలిన్ లేఖ..

లేఖలో ఏఏ అంశాలను తమిళనాడు సీఎం ప్రస్తావించారు? మోదీని ఏం కోరారు?


Click the Play button to hear this message in audio format

తమిళనాడు(Tamil Nadu)లో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టు(Railway Projects)లను వేగవంతం చేయాలని, పెండింగ్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(CM Stalin) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi)కి లేఖ రాశారు. నిధుల కొరత కారణంగా రైల్వే పనులు నెమ్మదించాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిధుల విడుదలలో రైల్వే మంత్రిత్వ శాఖ జాప్యం చేస్తోందన్నారు. ప్రతి ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వకుండా విడదల వారీగా కేటాయించడం వల్ల పనులు నిలిచిపోతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితి భూసేకరణ ప్రక్రియను కూడా ప్రభావితం చేస్తోందని చెప్పారు.


భూ సేకరణకు అనుమతి ఇచ్చినా..

వివిధ రైల్వే ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2,500.61 హెక్టార్ల భూ సేకరణకు అనుమతి ఇచ్చినప్పటికీ, అందులో 931.52 హెక్టార్లకు రైల్వే శాఖ నిధులు కేటాయించలేదని తెలిపారు. నిధుల విడుదలలో ఆలస్యం కారణంగా భూయజమానులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

మొత్తం 19 ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ 94 శాతం పూర్తయిందని, ఇప్పటికే 1,198.02 హెక్టార్ల భూమిని రైల్వే శాఖకు అప్పగించామని స్టాలిన్ వెల్లడించారు. తిరువనంతపురం–కన్యాకుమారి బ్రాడ్‌గేజ్ డబ్లింగ్ ప్రాజెక్టుకు సంబంధించిన రూ.289.78 కోట్ల పరిహారం ఇంకా విడుదల కాలేదని ప్రస్తావించారు.


‘బ్రాడ్‌గేజ్ లైన్లను పునఃప్రారంభించాలి’

మంజూరైన ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో, ప్రాధాన్యతా ప్రాతిపదికన నిధులు విడుదల చేయాలని ప్రధానమంత్రిని కోరారు. తూత్తుకుడి–మధురై (అరుప్పుకోట్టై ద్వారా), తిండివనం–తిరువణ్ణామలై బ్రాడ్‌గేజ్ లైన్లను పునఃప్రారంభించాలని అభ్యర్థించారు.

భారతదేశంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న తమిళనాడురాష్ట్ర అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచాలని స్టాలిన్ సూచించారు. కేంద్రం తక్షణ జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరిస్తుందన్న ఆశాభావాన్ని స్టాలిన్ వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని అన్ని రైల్వే ప్రాజెక్టులను వేగంగా అమలు చేయడంలో తమిళనాడు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ప్రధానమంత్రికి స్టాలిన్ హామీ ఇచ్చారు.

Read More
Next Story