శ్రీ లంక కొత్త అధ్యక్షుడిగా కమ్యూనిస్టు నేత
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో వామపక్ష జనతా విముక్తి పెరమున (JVP) చీఫ్ అనుర కుమార దిసనాయకే విజయానికి చేరువలో ఉన్నారు.
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో వామపక్ష జనతా విముక్తి పెరమున (JVP) చీఫ్ అనుర కుమార దిసనాయకే విజయానికి చేరువలో ఉన్నారు. ఇప్పటివరకు లెక్కించిన 10 లక్షల ఓట్లలో 53 శాతంతో స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు.
పోటీ మాత్రం ఆ ముగ్గురి మధ్య..
ఈ ఎన్నికల్లో మొత్తం 38 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే, జనతా విముక్తి పెరమున(జేవీసీ)కి చెందిన అనూర కుమార దిసనాయకే, సమగి జన బలవేగయ(ఎ్‌సజేబీ) నాయకుడు సజిత్ ప్రేమదాస మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఒపీనియన్ పోల్స్ ప్రకారం జేవీసీ నాయకుడు అనూర కుమారకే అధికార పీఠం దక్కే అవకాశం ఉంది. 13వేలకు పైగా పోలింగ్ కేంద్రాలలో మొత్తం 2.2 కోట్లకుపైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ 75 శాతంగా నమోదైంది.
50 శాతం ఓట్లు వచ్చిన వారే..
ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఆధారంగా శ్రీలంక అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎవరికైతే 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తాయో వారే తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోతే.. రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటివరకు అన్నిసార్లూ మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతోనే ఫలితం తేలిపోయింది.
ఈ రోజే ప్రమాణ స్వీకారం?
అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే ఈ రోజే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉంటుందని JVP ప్రధాన కార్యదర్శి నిహాల్ తెలిపారు.
అభినందనల వెల్లువ..
విజయానికి చేరువలో ఉన్న దిసానాయక్‌ను అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పదవీవిరమణ చేసిన విదేశాంగ మంత్రి అలీ సబ్రీ దిసానాయక్‌ను అభినందించిన వారిలో మొదటివారు. విక్రమసింఘే కోసం అలీ భారీగా ప్రచారం చేసిన అలీ శ్రీలంక ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తాను అని అన్నారు. ‘‘ఒక దేశాన్ని నడిపించడం అంత తేలికైన పని కాదు. దిసానాయక్ నాయకత్వం శ్రీలంక అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆశిస్తున్నాను.’’ అని SJB ఎంపీ, ప్రేమదాస మద్దతుదారు హర్ష డి సిల్వా పేర్కొన్నారు. ప్రేమదాసకు ఓటు వేయమని తమిళులను కోరిన తమిళ ఎంపీ MA సుమంధిరన్ కూడా దిసానాయకే శుభాకాంక్షలు తెలిపారు.
JVP (Janathi Vimukti Peramuna) అధికారాన్ని చేజిక్కించుకోవడానికి 1971, 1988-89లో రెండు సాయుధ తిరుగుబాట్లకు నాయకత్వం వహించింది. అయితే రెండు సందర్భాల్లోనూ విఫలమైంది. తిరుగుబాటలో ఇరువర్గాల వారు చనిపోయారు. 1990లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని స్వీకరించినప్పటి నుంచి JVP తుపాకీ రాజకీయాలకు దూరంగా ఉంది. కానీ రెండేళ్ల క్రితం వరకు జాతీయ రాజకీయాల అంచున ఉన్న పార్టీగా మిగిలిపోయింది. 2022లో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. ఇది అప్పటి అధ్యక్షుడు గోటబయ రాజపక్సను నాటకీయంగా తొలగించి శ్రీలంక నుండి పారిపోవడానికి దారితీసింది. దీంతో అధికార పక్ష సభ్యులు మిగిలిన పదవీకాలంలో విక్రమసింఘేను కొనసాగించాలని కోరారు.
విక్రమసింఘే విధానాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయి. అయితే IMF-ప్రేరిత పన్ను సంస్కరణలు పేదలకు భారంగా మారాయి. శ్రీలంకలో ఆర్థిక అసమానతలు, అవినీతిని అంతానికి వ్యతిరేకంగా డిస్సానాయకే, ఆయన పార్టీ చాలా మాసాల పాటు ప్రచారం చేసింది.