
తల్లికి నిప్పుపెట్టి, ఇంటికి తాళం పెట్టిన కొడుకు!
కంటికి రెప్పలా కాపాడుకున్న కొడుకే కాలయముడు అవుతాడని ఆ తల్లి ఊహించి ఉండదు...
నవమాసాలు మోసి, రక్తం ధారపోసి కని పెంచి కంటికి రెప్పలా కాపాడుకున్న ఆ తల్లి.. తన కొడుకే కాలయముడు అవుతాడని ఊహించి ఉండదు. వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడనుకున్న చేతులే, బతికుండగానే నిప్పు పెడతాయని కల్లో కూడా అనుకుని ఉండదు. ఒంగోలు నగరంలో జరిగిన ఈ అమానుష ఘటన నాగరిక సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది.
మంగళవారం ఉదయం.. లోకం ఇంకా మేలుకోకముందే ఆ ఇంట్లో మృత్యువు తాండవించింది. వెంకట రమణమ్మ అనే ఆ తల్లి గాఢనిద్రలో ఉంది. తన కన్నకొడుకు కిషోర్ బాబు ఆమెను కాపాడాల్సింది పోయి, ఇంట్లో పెట్టి బయట తాళం పెట్టి నిప్పంటించాడు. కనికరం లేకుండా ఇంటికి నిప్పుపెట్టాడు. లోపల ప్రాణభయంతో ఆ తల్లి ఎంతలా విలవిల్లాడిందో, ఆ మంటల సెగకు ఎంతలా అరిచిందో ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
మంటలను చూసి చుట్టుపక్కల వారు వచ్చేసరికి అంతా జరిగిపోయింది. ఇరుగుపొరుగు వారు కిషోర్‌ను నిలదీసినా సమాధానం చెప్పకుండా పారిపోయాడంటే, ఆ సమయంలో అతడి మనసు ఎంత కఠినంగా మారిందో అర్థమవుతుంది. అగ్నిమాపక దళం వచ్చి మంటలను ఆర్పేలోపే ఆ తల్లి మంటల్లో కాలి బూడిదయ్యింది.
"చనిపోయిన తర్వాత కొడుకు తలకొరివి పెట్టడం ఆచారం.. కానీ బతికుండగానే తల్లిని దహనం చేయడం ఏ రకమైన రాక్షసత్వం?" అని స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మతిస్థిమితమా.. మృగత్వమా?
నిందితుడు కిషోర్ బాబుకు మతిస్థిమితం లేదని కొందరు అనుమానిస్తున్నప్పటికీ, ఒక తల్లి ప్రాణాన్ని బలిగొన్న తీరు మాత్రం క్షమించరానిది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను భారంగా భావించే నేటి సమాజానికి ఈ ఘటన ఒక పరాకాష్ట.
ఆమెకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు ఈ కిషోర్ బాబు. ఒంగోలులో మాంసం దుకాణం నిర్వహిస్తుంటాడు. చిన్న కుమారుడు చెన్నైలో ఉద్యోగం చేస్తుంటాడు.
ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తల్లి మరణానికి గల అసలు కారణాలు, కిషోర్ బాబు మానసిక పరిస్థితిపై దర్యాప్తు సాగుతోంది. కారణాలు ఏవైనా, కన్నతల్లిని అగ్నికి ఆహుతి చేసిన ఈ ఉదంతం మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోతుంది.
అమ్మ అంటే దైవం అనుకునే దేశంలో, అదే అమ్మను నిప్పుల్లో కాల్చేసిన ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసింది.
Next Story

