
13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బంద్
90 రోజుల్లో నిషేధాజ్ఞలు తీసుకొని రానున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ కీలక ప్రకటన చేస్తూ, డిజిటల్ వ్యసనం నుంచి పిల్లలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
90 రోజుల్లో నిషేధాజ్ఞలు
చిన్నారులకు సోషల్ మీడియాను దూరం చేసే ప్రక్రియను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా, రాబోయే 90 రోజుల్లో దీనిని కార్యరూపంలోకి తీసుకువస్తామని సీఎం వెల్లడించారు. సాంకేతికత అందుబాటులో ఉండటం మంచిదే అయినప్పటికీ, అది పిల్లల మానసిక వికాసాన్ని దెబ్బతీసేలా ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వయసు పిల్లలకు సామాజిక మాధ్యమాలు అందుబాటులో లేకుండా చేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఆయుధమా? బానిసత్వమా?
సాంకేతికత వినియోగంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. టెక్నాలజీని మనం వాడుకుంటే అది మనకు ఒక ఆయుధంలా పనిచేస్తుంది. కానీ, దానికి మనం బానిసలైతే మాత్రం మన జీవితాలు నాశనమవుతాయి అని ఆయన హెచ్చరించారు. పిల్లలు సోషల్ మీడియా వల్ల నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి భవిష్యత్తును కాపాడటం కోసం ఎంతటి కఠిన నిర్ణయానికైనా వెనుకాడబోమని ఉద్ఘాటించారు.
టీనేజర్ల భద్రతపై కూడా దృష్టి
13 ఏళ్లలోపు వారికి నిషేధం విధిస్తూనే, 13 నుండి 16 ఏళ్ల మధ్య వయసున్న టీనేజర్ల భద్రతపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ వయసు వారు సోషల్ మీడియా వినియోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న దానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. తల్లిదండ్రులు, నిపుణుల సూచనల మేరకు ఈ వయసు వారికి సంబంధించి నియమ నిబంధనలు ఖరారు చేయనున్నారు.
ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా
ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయాన్నే తీసుకుంది. ఇప్పుడు అదే బాటలో ఆంధ్రప్రదేశ్ పయనించడం పట్ల విద్యావేత్తలు, తల్లిదండ్రుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. స్మార్ట్‌ఫోన్ల వాడకం వల్ల పిల్లల్లో ఏకాగ్రత తగ్గిపోవడం, సైబర్ నేరాల బారిన పడటం వంటి సమస్యలకు ఈ నిర్ణయం ఒక పరిష్కారంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Next Story

