తుచ్ఛమైన డబ్బుపై నాకు మోజు లేదన్న మంగ్లీ, లాయర్ పై ఎదురు కేసు
x

తుచ్ఛమైన డబ్బుపై నాకు మోజు లేదన్న మంగ్లీ, లాయర్ పై ఎదురు కేసు

సింగర్ మంగ్లీ వ్యవహారం ముదురుతోంది.డ్రగ్స్ నుండి మైక్రోఫైనాన్స్ వరకు.. నాపై కుట్ర జరుగుతోందన్న గాయని మంగ్లీ


"నాకు డబ్బు పట్ల ఎలాంటి వ్యామోహం లేదు.. కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. నా ఎదుగుదలను ఓర్వలేక కొందరు కావాలనే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు" అని ప్రముఖ గాయని మంగ్లీ (సత్యవతి) ఆవేదన వ్యక్తం చేశారు. తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ న్యాయవాది సుబ్బారావు (సుబ్బు) పై ఆమె పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన న్యాయవాదితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మంగ్లీ, పూర్తి వివరాలతో కూడిన ఫిర్యాదు పత్రాన్ని పోలీసులకు అందజేశారు.

వరుస వివాదాలు...
రూ. 10 లక్షల డిమాండ్: న్యాయవాది సుబ్బు ఇటీవల తన కార్యాలయం వద్దకు వచ్చి రూ. 10 లక్షలు డిమాండ్ చేశారని, ఇవ్వకపోవడంతో తనను దుర్భాషలాడుతూ మీడియాలో దుష్ప్రచారం చేస్తానని బెదిరించారని మంగ్లీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
గతంలో తనపై వచ్చిన డ్రగ్స్ కేసు ఆరోపణల సమయంలోనూ ఇలాగే ఇబ్బందులకు గురిచేశారని, ఇప్పుడు మైక్రోఫైనాన్స్ పేరుతో మరోసారి తన ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. కేవలం తనను భయపెట్టి డబ్బు వసూలు చేయడానికే సుబ్బు ఇవన్నీ చేస్తున్నారని మంగ్లీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఆమె కన్నీటి పర్యంతమైంది. తనపై వస్తున్న ‍అసత్య ప్రచారంపై తన బాధను వ్యక్తం చేసింది. ఎవరో వచ్చి నాపై ఆరోపణలు చేస్తే.. ఏది పడితే రాయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేసింది. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని.. కేవలం పాటే నా ప్రాణమని మంగ్లీ ఆవేదన తెలిపింది. నిజనిజాలు తెలుసుకోకుండా నా గురించి ఎలాంటి కథనాలు ప్రసారం చేయవద్దని కోరింది. నేను కూడా సోషల్ మీడియా నుంచే వచ్చానని.. కానీ అదే నాకు శాపంగా మారుతుందని ఏనాడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ వ్యక్తి కేవలం ఫేమస్ అవ్వడం కోసమే నాపై ఆరోపణలు చేస్తున్నాడని మంగ్లీ అన్నారు. నన్ను, నా ఫ్యామిలీని రోడ్డుకు లాగకండని కోరింది. మీడియా అంటే తనకు చాలా గౌరవం ఉందని.. దయచేసి ఈ విషయంలో మీరు వెనక, ముందు చూసుకోవాలని సూచించింది. ఎవరెవరో నేనంటే పడని వాళ్లు.. నాపై ఆరోపణలు చేస్తుంటారని అన్నారు. నాపై పార్టీ ముద్రలు వేయడంతో 2003 తర్వాత ఏ పార్టీకి కూడా తాను పాటలు కూడా పాడలేదన్నారు.

మైక్రోఫైనాన్స్ పేరుతో మంగ్లీ తనను రూ. 10 కోట్లు మోసం చేశారంటూ గతంలో అడ్వకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంగ్లీ, ఆ ఆరోపణలు కేవలం తనను లక్ష్యంగా చేసుకుని చేస్తున్నవేనని స్పష్టం చేశారు.

డ్రగ్స్ కేసు మొదలుకొని తాజాగా మైక్రోఫైనాన్స్ వరకు వరుస వివాదాలతో మంగ్లీ పేరు వార్తల్లో నిలుస్తోంది. ఈ తాజా ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.


Read More
Next Story