ముడా కేసులో సిద్ధరామయ్యకు హైకోర్టు నోటీసులు
x

ముడా కేసులో సిద్ధరామయ్యకు హైకోర్టు నోటీసులు

ముఖ్యమంత్రితో పాటు లోకాయుక్త అధికారులు, అలాగే ఈడీకి కూడా..


Click the Play button to hear this message in audio format

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) సైట్ కేటాయింపు కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఒత్తిడి పెరుగుతోంది. కేసు ముగింపు నివేదికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

గురువారం (మార్చి 26) ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, ముఖ్యమంత్రి, లోకాయుక్త అధికారులు, అలాగే ఈడీకి నోటీసులు పంపింది.

ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎస్. సునీల్ దత్ యాదవ్ విచారణకు స్వీకరించారు. ఫిర్యాదిదారు తరఫున న్యాయవాది లక్ష్మీ అయ్యంగార్ వాదనలు వినిపించారు. లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన ‘బి’ నివేదిక దర్యాప్తు ఆధారంగా లేదని పేర్కొన్నారు.

వాదనలు విన్న అనంతరం, కోర్టు మైసూరు లోకాయుక్త ఎస్పీ, ఈడీతో పాటు ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జునస్వామి, మాజీ ముడా కమిషనర్ జి.టి. దినేష్ కుమార్, భూయజమాని జె. దేవరాజుకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

ఈ కేసులో లోకాయుక్త పోలీసులు 2025 ఫిబ్రవరి 12న ప్రత్యేక న్యాయస్థానంలో ‘బి’ నివేదికను సమర్పించారు. అనంతరం 2026 జనవరి 28న ఆ నివేదికను కోర్టు ఆమోదించింది.

అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. ‘బి’ నివేదికను రద్దు చేయాలని, ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వును కొట్టివేయాలని కోరారు. అలాగే, కేసును స్వతంత్ర సంస్థకు బదిలీ చేసి, కోర్టు పర్యవేక్షణలో కొత్తగా విచారణ జరపాలని అభ్యర్థించారు.

ఈ కేసు నేపథ్యం ప్రకారం, మైసూరులోని కేసరే గ్రామంలో ఉన్న భూమి స్వాధీనం ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి సిద్దరామయ్య భార్యకు చెందిన భూమికి పరిహారంగా సుమారు రూ.56 కోట్ల విలువైన 14 స్థలాలు అక్రమంగా కేటాయించారని ఆరోపించారు.

ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై 2024 జూలై 3న ఫిర్యాదు నమోదైంది. ఆగస్టు 17న గవర్నర్ విచారణకు అనుమతి ఇచ్చారు.

తర్వాత, ఈ అనుమతిని సవాలు చేస్తూ సిద్దరామయ్య హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, ఆయన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. 2024 సెప్టెంబర్ 24న దర్యాప్తుకు అనుమతి ఇచ్చింది.

దర్యాప్తు అనంతరం లోకాయుక్త పోలీసులు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబాన్ని నిర్దోషులుగా పేర్కొంటూ ‘బి’ నివేదిక సమర్పించారు. ఈ నివేదికను ప్రత్యేక న్యాయస్థానం ఆమోదించింది. ఇప్పుడు అదే నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.

Read More
Next Story