కటకటాల వెనక్కి ఖాకీ కామపిశాచి
x

కటకటాల వెనక్కి ఖాకీ కామపిశాచి

ఎస్సై రవితేజకు 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ గుంటూరు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.


రక్షణ కల్పించాల్సిన ఖాకీ చొక్కా.. కామరూపం దాల్చింది. ప్రేమ పేరిట ఓ యువతి జీవితంతో చెలగాటమాడి, పెళ్లి పేరుతో నమ్మించి నట్టేట ముంచిన ఓ ఎస్సై పాపం పండింది. అధికార దర్పం, యూనిఫాం గర్వంతో చేసిన అకృత్యానికి చట్టం కళ్లు తెరిచింది. గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ మోసం కేసులో.. నిందితుడు ఎస్సై రవితేజకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పునిచ్చింది.

అధికార దర్పం.. మోసపూరిత ప్రేమ

ఈ విషాద గాథ 2022లో గుంటూరు నడిబొడ్డున నగరంపాలెం పోలీస్ స్టేషన్ వేదికగా మొదలైంది. అప్పుడే విధుల్లో చేరిన ఎస్సై రవితేజ కళ్లు.. రక్షణ కోరి వచ్చే వారిపై కాకుండా, ఓ అమాయక నర్సింగ్ విద్యార్థినిపై పడ్డాయి. ఆపదలో అండగా ఉంటాడని నమ్మిన ఆ యువతికి, తన మాటలతో రవితేజ మాయవల వేశాడు. నిన్నే పెళ్లి చేసుకుంటాను.. నా జీవితం నీదే అంటూ నమ్మబలికి, పవిత్రమైన ప్రేమ పేరుతో ఆమెపై పలుమార్లు శారీరక దాడికి పాల్పడ్డాడు.

కానీ, అసలు రంగు బయటపడటానికి ఎంతో కాలం పట్టలేదు. తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి నిలదీయడంతో, రవితేజలో ఉన్న కిరాతకుడు బయటకు వచ్చాడు. అంతవరకు ప్రేమ ఒలకబోసిన రవితేజ నోరే.. కులం పేరుతో అసహ్యంగా దూషించడం మొదలుపెట్టింది. అంతటితో ఆగకుండా.. ఒకవేళ ఈ విషయం బయటకు చెబితే ప్రాణాలు తీస్తానంటూ తన ఖాకీ పవర్‌తో బెదిరింపులకు దిగాడు.

న్యాయం చేయాల్సిన వాడే నమ్మించి గొంతు కోస్తుంటే.. ఆ బాధితురాలు ప్రాణాలకు తెగించి 2023లో పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. దీంతో రవితేజ ముసుగు తొలగిపోయింది. అత్యాచారం, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు కాగా, సుదీర్ఘ విచారణ అనంతరం నేడు న్యాయస్థానం అతడికి 10 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది.

ఖాకీకి పట్టిన ’కళంకం‘పై కఠిన తీర్పు

బాధితురాలి కన్నీటికి న్యాయదేవత స్పందించింది. పోలీసులు పక్కాగా సేకరించిన సాక్ష్యాధారాలు, బాధితురాలు కోర్టులో ధైర్యంగా ఇచ్చిన వాంగ్మూలం ముందు ఎస్సై రవితేజ పన్నాగాలేవీ పారలేదు. అన్ని కోణాల్లో కేసును నిశితంగా పరిశీలించిన న్యాయస్థానం.. రవితేజను దోషిగా తేలుస్తూ పిడుగులాంటి తీర్పును వెలువరించింది. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (అత్యాచారం) సహా మరికొన్ని తీవ్రమైన సెక్షన్ల కింద అతనికి పదేళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తూ జిల్లా 4వ అదనపు కోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం అమృతలూరులో ఎస్సైగా అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్న రవితేజ.. ఈ తీర్పుతో ఒక్కసారిగా కటకటాల పాలయ్యాడు. 10 ఏళ్ల జైలు శిక్ష పడటంతో అతడు తన విలువైన పోలీసు ఉద్యోగాన్ని కోల్పోవడం ఇప్పుడు ఖాయంగా కనిపిస్తోంది. పదవి అండతో చేసిన పాపానికి, చట్టం విధించిన ఈ శిక్ష ఒక బలమైన గుణపాఠంగా నిలిచిపోయింది.

వ్యవస్థపై పెరిగిన నమ్మకం

శాంతిభద్రతలను కాపాడి, అబలలకు అండగా నిలవాల్సిన అధికారే.. కంచె చేను మేసిన చందంగా కామాంధుడిగా మారడం సమాజానికే ఒక మాయని మచ్చ. పోలీసు యూనిఫాంలో ఉన్న వ్యక్తి ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అధికారం ఉంది కదా అని తప్పించుకోవచ్చన్న రవితేజ అహంకారాన్ని న్యాయస్థానం అణచివేసింది. న్యాయం జరగడంలో కొంత జాప్యం జరిగినప్పటికీ, చివరకు వెలువడిన ఈ తీర్పు బాధితురాలి పోరాటానికి దక్కిన విజయంగా భావించవచ్చు. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా చట్టం ముందు తలవంచాల్సిందే అని ఈ తీర్పు మరోసారి నిరూపించింది. సామాన్యులకు న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని ఈ తీర్పు రెట్టింపు చేయడమే కాకుండా, విధి నిర్వహణలో ఉండి.. బాధ్యత మరిచే వారికి ఇది ఒక గట్టి హెచ్చరికగా నిలిచిపోతుంది.

Read More
Next Story