పాఠశాల ఆవరణల్లో దుకాణాలా? హైకోర్టు సీరియస్
x

పాఠశాల ఆవరణల్లో దుకాణాలా? హైకోర్టు సీరియస్

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.


ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో వాణిజ్య సముదాయాల నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల ఆవరణల్లో ఇలాంటి నిర్మాణాలు చేపట్టకూడదంటూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల భవిష్యత్తు, చదువుకు ఆటంకం కలిగించే ఏ చర్యలనైనా ఉపేక్షించబోమని స్పష్టం చేసింది.

విశ్రాంత ఉపాధ్యాయుడి పోరాటం
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి హైస్కూల్ వద్ద రూ.50 లక్షలతో, వి.కోట పాఠశాల వద్ద రూ.25 లక్షల అంచనా వ్యయంతో వాణిజ్య సముదాయాలను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశ్రాంత ఉపాధ్యాయుడు నారాయణరెడ్డి సోమచంద్రరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విద్యాాలయాల పవిత్రతను కాపాడాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ న్యాపతి విజయ్‌ శుక్రవారం విచారణ చేపట్టారు.
చదువుపై ప్రతికూల ప్రభావం
పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ.. పాఠశాల ఆవరణలో వాణిజ్య కార్యకలాపాలు సాగితే విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటుందని కోర్టుకు వివరించారు. బయటి వ్యక్తుల రాకతో పాఠశాల వాతావరణం కలుషితమవుతుందని, ఇది విద్యార్థుల చదువుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
నిర్మాణాలు నిలిపివేయాలని ఆదేశం
న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి, సదరు పాఠశాలల వద్ద ఎటువంటి వాణిజ్య నిర్మాణాలను చేపట్టవద్దని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.
Read More
Next Story