
మాచర్ల ఏఎస్సై శ్రీనివాస్.. ఇప్పుడు ఆయనే సస్పెండ్ అయ్యారు..
మాచర్ల ఏఎస్సై బ్లాక్‌మెయిల్ దందాపై ఐజీ వేటు!
మాచర్ల ఏఎస్సై కన్ను పడితే ఇక అంతే.. ఎట్టకేలకు పాపం పండింది!
ఈ పోలీసు కన్నుపడితే 'కోర్కె' తీర్చడమో లేక 'కప్పం' కట్టడమో చేయాల్సిందే.. పేరు శ్రీనివాసు. పని చేసేది పల్నాడు జిల్లా మాచర్ల. హోదా అసిస్టెంట్ స్టేషన్ ఆఫీసర్ (ఏఎస్సై). ఎన్ని ఫిర్యాదులు పోయినా ఎవరూ పట్టించుకోక పోవడంతో బాధితుల్లో ఒకరు ఈ ఎఎస్సై లీలల్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్త వైరల్ అయింది. చేసేది లేక ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి వేటు వేశారు. ఆ ఎఎస్సై ని సస్పెండ్ చేశారు. అయితే ఆ అధికారిని అరెస్ట్ చేయాలంటూ ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
అసలు ఏం జరిగిందంటే...
పల్నాడు జిల్లా మాచర్లకు చుట్టుపక్కల ఊళ్ల నుంచి జనం వచ్చి పోతుంటారు. మాచర్ల నియోజకవర్గంలోని పర్యాటక ప్రదేశాలకు ప్రేమికులు ఎక్కువగా వస్తుంటారు. కళాశాల విద్యార్థులు కూడా సరదాగా గడిపేందుకు వస్తుంటారు. వీళ్లలో ఎవరైనా ప్రేమజంటలు ఉండి ఎక్కడైనా సేద తీరుతుంటే వాళ్లపైన ఈ ఎఎస్సై నిఘా నేత్రం వేసేవాడు. ఇతనికి ఓ అసిస్టెంట్ ఉండేవాడు. అతనిది మాచర్ల మండలం జమ్మలమడక. ఆటో డ్రైవర్. ప్రేమజంటల్ని చూపించడం ఎఎస్సై పని. వీడియోలు తీయడం ఆ ఆటో డ్రైవర్ పని. జంటలు సన్నిహితంగా ఉన్న వీడియోలు తీసి, బెదిరించి డబ్బు వసూలు చేసేవారు. మాచర్లలో ఓ వ్యాపారి ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో తీసి, వారిని బెదిరించి పలు దఫాలుగా డబ్బు వసూలు చేశారు. ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలు చూపించి, కోరిక తీర్చాలంటూ యువతులు, మహిళలను వేధించేవాడు. పలువురు ఈ విషయాల్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో బాధితుల్లో ఒకరు ఈ ఏఎస్సై నిర్వాకాల వీడియోలను సోషల్ మీడియాలో పెట్టారు. అవి వైరల్ అవ్వ, అది పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ జరిపి చర్యలు చేపట్టారు.
Next Story

