
ఢిల్లీలో హై అలర్ట్.. భద్రత కట్టుదిట్టం
ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం.
దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హై అలర్ట్ ప్రకటించిన తర్వాత సున్నిత ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
రెడ్ ఫోర్ట్, చాంద్ని చౌక్ పరిసరాల్లో అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని హెచ్చరికల నేపథ్యంలో శనివారం మతపరమైన వారసత్వ కట్టడాల వద్ద పహారా పెంచినట్టు అధికారులు తెలిపారు. పాకిస్తాన్‌కు చెందిన లష్కర్-ఎ-తయిబా (LeT) సంస్థ ప్రముఖ మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఇంప్రోవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్ (IED) ద్వారా దాడి చేసే అవకాశం ఉందన్న సమాచారంతో కేంద్ర బలగాలు, ఢిల్లీ పోలీసులతో కలిసి పనిచేస్తున్నాయి. సీసీటీవీ పర్యవేక్షణ పెంచారు. వాహనాల తనిఖీలు కఠినతరం చేశారు. అదనపు సిబ్బందిని నియమించారు. బాంబు డిస్‌బోసబుల్ స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లు, క్విక్ రియాక్షన్ టీమ్‌లను సిద్ధం చేశారు.
2025 నవంబర్ 10న రెడ్ ఫోర్ట్ సమీపంలో కారు పేలిన ఘటనలో 13 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఆ ఘటన తర్వాత భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.

