
‘దళిత క్రైస్తవులపై సుప్రీం కోర్టు తీర్పు సమాజ పరిస్థితులకు దూరంగా ఉంది’
దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాకు సంబంధించి సుప్రీం కోర్టులో విచారణ జరిగితే ఈ విషయం పై స్పష్టత వస్తుందని సామాజిక కార్యకర్తలు మేధావులు పేర్కొంటున్నారు
హిందూ దళితులకు మాత్రమే ఎస్సీ హోదా వర్తిస్తుందన్న సుప్రీం తీర్పుపై దేశవ్యాప్తంగా మంటలు రేపుతోంది. చట్టానికి అనుగుణంగా ఉన్నా సమాజ పరిస్థితులకు అనుగుణంగా లేదనే విమర్శలు వస్తున్నాయి. అగ్ర వర్ణాల కుల దురహంకారాన్ని కాకుండా బాధితుల మతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవటం అన్యాయం అనే వాదన వినిపిస్తోంది. ఈ తీర్పును పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఆక్షేపిస్తున్నాయి.
ఈ వివాదం ఎలా మొదలైందంటే...
ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో అక్కల రామిరెడ్డి తనను కులంపేరుతో దూషించారంటూ పాస్టర్ చింతాడ ఆనంద్ కేసు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అక్కల రామిరెడ్డిపై కేసు నమోదైంది. అయితే ఆనంద్ అసలు క్రిస్టియనే కాదని, తనపై పెట్టిన క్రిమినల్ కేసులు కొట్టివేయాలంటూ రామిరెడ్డి 2021 లో ఎదురు కేసు పెట్టారు. ఆయన వాదనతో ఏకీభవించిన సుప్రీం కోర్టు మతం మారిన వ్యక్తి తాను ఎస్సీనని చెప్పుకోలేరని, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వర్తించదని సంచలన తీర్పు ఇచ్చింది.
ఈ విషయంపై ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ కు చెందిన గద్దపాటి విజయ్ రాజ్ స్పందిస్తూ.. ‘‘ఎవరైనా క్రైస్తవం లోకి మారాక ఎస్సీ హోదా పోయి బీసీ-సీ కేటగిరి క్రిందికి వస్తారనే విషయం చెప్పటానికి సుప్రీం కోర్టు అవసరం లేదు. గ్రామంలోని వీఆర్వోకు కూడా చర్చికి వెళ్ళే వ్యక్తికి ఎస్సీ సర్టిఫికేట్ రాదు అనే స్పష్టత ఉంటుంది. కోర్టు కొత్తగా చెప్పింది ఏమీ లేదు. 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వులలో ఆ విషయం ఉంది’’ అని అన్నారు.
ఈ ఉత్తర్వు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు పొందాలంటే హిందూ మత విశ్వాసాలు కలిగి ఉండాలి అని స్పష్టం చేస్తుంది. “2007 లో యుపిఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ రంగనాథ మిశ్రా కమీషన్ మతం మారినా వివక్ష పోదని తేల్చింది. ఈ నిర్ధారణ మీద ఆధారపడే సుప్రీం కోర్టులో క్రైస్తవ దళితులకు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం రక్షణ కల్పించాలని కేసు వేశాము. షెడ్యూల్ తెగల వారు ఏ మతంలో ఉన్నా ఎస్టీ స్టేటస్ ఇస్తున్నట్టే షెడ్యూల్ కులాల వారికి మతంతో సంబంధం లేకుండా అత్యాచార చట్టం క్రింద రక్షణ కల్పించాలని కోరాము,” అని విజయ్ రాజు చెప్పారు. ఈ కేసు పెండింగ్ లో ఉంది. ప్రజల్లో ఆ కేసులో తీర్పు వచ్చిందనే అపోహను తొలగించాల్సి ఉంది.
పాస్టర్ ఆనంద్ కు ఆయన లాయర్ సరైన సలహా ఇవ్వలేదు అనేది స్ఫష్టం అని విజయ్ రాజు అభిప్రాయపడ్డారు.
జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫారసులను పక్కన పెట్టిన ప్రస్తుత బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కే.జీ. బాలకృష్ణన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2022 మరో కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ సంధర్భంగా గుర్తుండాల్సిన విషయం 1950 లో హిందువులకు మాత్రమే ఎస్సీ హోదా ఉండగా, సిక్కులకు 1956లో, 1990 లో బౌద్ద మతస్థులను ఈ జాబితాలో చోటు దక్కింది.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక సభ్యులు కృపాకర్ మాదిగ సుప్రీం కోర్టు.. ఉన్న చట్టాన్ని వ్యాఖ్యానించిందని అయితే సమాజంలోని పరిస్థితులను పరిగణలోకి తీసుకుని మాట్లాడాల్సిందని అన్నారు. “బాలకృష్ణన్ కమిటీ ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు అయ్యింది. సుప్రీం కోర్టులో పెండింగ్ ఉన్న కేసులో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం,” అని అన్నారు.
నల్సార్ లో మానవ హక్కుల సబ్జెక్టు ప్రొఫెసర్ కరణం మురళి మాట్లాడుతూ 1950 లో వచ్చినటువంటి ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కు 1936 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ లో పునాది ఉంది అన్నారు. “ఆ రోజుల్లో హిందూ మతంలో మాత్రమే కులం ఉంది. క్రిస్టియానిటీ, ఇస్లాంలలో లేదని చెప్పడం బ్రిటిష్ గవర్నమెంట్ కి ఒక అవసరం. అంబేద్కర్ రాబోయే పార్లమెంటుకు షెడ్యూల్డ్ కులాల జాబితా తయారు చేసే బాధ్యత ఇస్తే చర్చ సుదీర్ఘ కాలం జరిగే అవకాశం ఉందని భావించారు. ఆ రోజుల్లో ఉన్న కులతత్వాన్ని చూసి ఆయన పార్లమెంటును కూడా నమ్మలేదు. కులం పేరు పెట్టి ఆనంద్ అనే పాస్టర్ ను దూషించారు. కులం పేరుమీద దూషించే వాళ్ళు కులాన్ని నమ్మే వాళ్ళే. కాబట్టే ఆ రకంగా వ్యవహరిస్తారు. చర్చ నిందితుల కులం మీద చేయాలి కానీ బాధితుల కులం, మతం మీద ఎందుకు జరుగుతా ఉంది?,” అని ప్రశ్నించారు.
ఆర్టికల్స్ 14, 15 ల స్పూర్తిలో హిందూ మతంలో ఉంటే మాత్రమే నీకు రక్షణ, ప్రయోజనాలు ఉంటాయి అనటం ఎంత వరకు సమంజసం. ఏ మతాన్ని నమ్మని నాస్తికులకు రక్షణ నిరాకరిస్తారా. సిక్కు, బౌద్ధ మతాలను 1950 ఆర్డర్ ను సవరించి చేర్చారు కదా, అని అన్నారు.
సుప్రీం కోర్టు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఈ తీర్పులో షెడ్యూల్ తెగకు చెందిన వ్యక్తి కులాన్ని వాళ్ళ జీవించే స్థితిగతుల మీద ఆధారపడి నిర్ణయించాలని అన్నారు. చదువుకొని ఉద్యోగం సంపాదించుకొని నగరంలో సెటిల్ అయిన వ్యక్తి షెడ్యూల్ తెగలాగా జీవించడం లేదు కాబట్టి నువ్వు షెడ్యూల్ తెగ కాదు కాబట్టి నీకు ఈ రక్షణ వర్తించదు అని రేపు అంటారా, అని మురళి ఆశ్చర్యపోయారు.
ఇటీవలే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక దళిత క్రైస్తవుడు చనిపోతే మా రోడ్డు వెంట శవాన్ని తీసుకుపోకూడదని అగ్ర కులాలు అడ్డుకోవడంతో ఆ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలోను పెద్ద సంచలనం అయ్యింది, అని విజయ రాజు గుర్తు చేశారు. “ఇటీవల ఒక దళిత క్రైస్తవ మహిళ రేప్ కు గురై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం క్రింద కేసు పెడితే ఆమె హిందువా లేక క్రిస్టియన్ యా అనే దాని పై చర్చ జరుగుతోంది. పైగా రేప్ చేసిన వ్యక్తి ఆమె ఎస్సీ కాదు అని కేసు పెట్టే పరిస్థితి ఉంది. ఇది ఇప్పటి సామజిక వాస్తవం,” అని అన్నారు.
క్రైస్తవం, ఇస్లాం ఇతర దేశాల మతాలు అనే వాదన తప్పు. అది హిందుత్వ శక్తులు చేస్తున్న తప్పుడు వాదన. రాజ్యాంగం ఆర్టికల్ 25 మత స్వేచ్చ కల్పించింది. ఆధ్యాత్మిక చింతనకు ప్రాంతం, దేశం అనే భేదం లేదు, అని వివరించారు.
ఈ రకమైన తీర్పులు రావటానికి సుప్రీం కోర్టు లో ఎస్సీ, ఎస్టీ, బీసీ లు కేవలం 17 శాతం మాత్రమే ఉండటం కారణం. స్త్రీలు 13 శాతం మాత్రమే ఉన్నారు. అత్యంత మైనారిటీ వర్గం అయిన ఒకటి రెండు కులాలు మాత్రమే గత 75 ఏళ్లుగా సుప్రీంకోర్టులో ఇతర కులాల మీద తీర్పులు చెప్తున్నారు. తీర్పు రాసిన జస్టిస్ మిశ్రా తన అగ్రవర్ణ చైతన్యం జడ్జిమెంట్ లో ప్రతిబింభించ కూడదు అనే కనీస స్పృహ లేకుండా మాట్లాడారు. కులాన్ని లాయర్ లు, జడ్జ్ లకు అర్థం చేయించాల్సి ఉందని మురళి అన్నారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉంటేనే త్వరగా బాధితులకు న్యాయం జరుగుతుందని కృపాకర్ అన్నారు.
ఈ విషయం పై సెంట్రల్ ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. ఇది ఇద్దరు జడ్జీల సుప్రీం కోర్టు బెంచ్ తీర్పు చెప్పి తేల్చే విషయం కాదని అన్నారు. “1950 ఆర్డర్ ఆర్టికల్ 14, 15, 25 లకు విరుద్దమా కాదా అనేది అసలు పరిశీలించాల్సిన విషయం. ప్రెసిడెంట్, పార్లమెంటు పూనుకుని ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి,” అని అన్నారు.

